Tawi Flood Alert: పొంచి ఉన్న వరద ముప్పు.. పాక్‌ను భారత్ అప్రమత్తం చేసిందా..
ABN , Publish Date - Aug 25 , 2025 | 01:40 PM
భారత్, పాక్‌లో ప్రవహించే తావీ నదిలో వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో భారత్.. దిగువ దేశమైన పాక్‌ను వరద ముప్పుపై అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. భారత హైకమిషన్ ద్వారా ఈ సమాచారాన్ని చేరవేసినట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని తావీ నది పోటెత్తుతుండటంతో భారత్ తాజాగా పాక్‌ను అప్రమత్తం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పాక్‌లోని భారత హైకమిషన్ ద్వారా అక్కడి వర్గాలకు వరద ముప్పు సమాచారం అందజేసినట్టు తెలిసింది. అయితే, ఈ విషయంలో పాక్, భారత్ ఇంకా స్పందించలేదు. సింధు నదీ జలాల తరువాత భారత్ నుంచి తొలి సానుకూల స్పందన ఇదేనని పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు.
మీడియా కథనాల ప్రకారం, జమ్ములోని తావీ నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్న విషయంపై ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ అక్కడి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఈ మేరకు పాక్ అధికారులు కూడా స్థానికులను అప్రమత్తం చేశారు. సింధు నదీ జలాల ఒప్పందం అమల్లో ఉన్న రోజుల్లో భారత్ ఇలాంటి సమాచారాన్ని సంబంధిత కమిషనర్‌ల ద్వారా అందించేది. పహల్గాం దాడి తరువాత పాక్‌కు బుద్ధి చెప్పేందుకు కేంద్రం ఈ ఒప్పందాన్ని నిలుపుదల చేసిన విషయం తెలిసిందే.
టిబెట్‌లో మొదలయ్యే సింధు నదీ జమ్మూకశ్మీరు మీదుగా పాక్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడి ఆర్థిక వ్యవస్థకు జీవనాడి. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య సింధు, దాని ఉపనదుల జలాల పంపిణీ కోసం వరల్డ్ బ్యాంక్ చొరవతో 1960లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ వ్యవస్థలో 20 శాతం నీటిని భారత్‌కు, మిగతా వాటా పాక్‌కు కేటాయించారు. ఇందుకోసం పశ్చిమాన ఉన్న సింధు, జీలం, చీనాబ్‌లను పాక్‌కు, తూర్పున ఉన్న రావి, బియాస్, సట్లెజ్ నదులను భారత్‌కు కేటాయించారు. భారత్, పాక్‌లకు కేటాయించిన నదీ జాలల్లో కొంత నీటి రెండో దేశం వాడుకునే వెసులుబాటు కూడా ఉంది.
తాజాగా చినాబ్‌కు ఉపనది అయిన తావీలో వరద పోటెత్తడంతో భారత్ పాక్‌ను అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. జమ్మూ, దోడా, ఉధంపూర్ జిల్లాల మీదుగా ప్రవహించే ఈ నది భారత సరిహద్దు దాటాక చీనాబ్‌లో కలుస్తుంది.
ఇవి కూడా చదవండి:
టారిఫ్‌లతో అమెరికాకు ఎంత ప్రయోజనం కలుగుతుందంటే..
భారత్‌కు రాయబారిగా కీలక వ్యక్తి నియామకం.. ఉద్రిక్తతల వేళ ట్రంప్ నిర్ణయం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి