Share News

Trump-Sergio Gor: భారత్‌కు రాయబారిగా కీలక వ్యక్తి నియామకం.. ఉద్రిక్తతల వేళ ట్రంప్ నిర్ణయం

ABN , Publish Date - Aug 23 , 2025 | 08:20 AM

భారత్‌తో వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌కు రాయబారిగా తనకు సన్నిహితుడైన సెర్గియో గోర్‌ను నియమించారు.

Trump-Sergio Gor: భారత్‌కు రాయబారిగా కీలక వ్యక్తి నియామకం.. ఉద్రిక్తతల వేళ ట్రంప్ నిర్ణయం
Trump appoints Sergio Gor India ambassador

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో వాణిజ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌కు రాయబారిగా తనకు రాజకీయంగా సన్నిహితుడైన సెర్గియో గోర్ రాస్‌ను (38) నియమించారు. ట్రంప్ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసే వ్యక్తిగా పేరున్న సెర్గియోను ఈ కీలక సమయంలో భారత్‌కు పంపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గోర్ నియామకాన్ని ట్రంప్ సోషల్ మీడియా వేదికా ప్రకటించారు. ‘సెర్గియో గోర్‌ను భారత్‌కు రాయబారిగా, దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధిగా ఎంపిక చేశాను’ అని పేర్కొన్నారు.

మీడియాలో ఎక్కువగా కనిపించని సెర్గియో గోర్‌‌‌కు పార్టీ వర్గాల్లో పవర్ ఫుల్ నేతగా పేరుంది. ప్రభుత్వంలో ట్రంప్ మద్దతుదారులను తీసుకోవడంలో ముఖ్య పాత్ర పోషించిన సెర్గియో సుమారు 4 వేల మంది నియామకంలో కీలకంగా వ్యవహరించారు. అయితే, ఎలాన్ మస్క్‌తో వైరం కారణంగా ఇటీవల ఆయన పేరు మీడియాలో ప్రముఖంగా వినిపించింది. ట్రంప్‌తో విభేదాల నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఓ సందర్భంలో సెర్గియోను విష సర్పంగా పేర్కొన్నారు. నాసాలో తన అభిమతానికి అనుగూణంగా వ్యక్తుల నియామకానికి గోర్ అడ్డుపడ్డారంటూ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ విదేశీ పర్యటనల్లో కొన్నిసార్లు పాల్గొన్న సెర్గియో గోర్, కొందరు జాతీయ భద్రతా మండలి సభ్యుల తొలగింపునకు కారణమయ్యారు.


విదేశీ వ్యవహారాల పర్యవేక్షణకు ట్రంప్ ప్రస్తుతం తన స్నేహితులను, సన్నిహితులను ఎంపిక చేస్తున్నారు. సంప్రదాయక దౌత్యవేత్తలను చాలా వరకూ పక్కనపెట్టేశారు. అమెరికా విదేశాంగ శాఖలోని దక్షిణాసియా విభాగం అధిపతిగా ఇప్పటివరకూ ఎవరినీ నియమించకపోవడం గమనార్హం.

1990ల తరువాత జరిగిన పరిణామాల్లో అమెరికాకు ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా మారిన భారత్‌‌పై ట్రంప్ సుంకాలతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధం కొనసాగింపునకు భారత్ కారణమవుతోందంటూ సుంకాలను 50 శాతానికి పెంచారు. ఇవి ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి.


ఇవి కూడా చదవండి:

అమెరికాను భారత్‌ మునుపటిలా నమ్మదు.. ట్రంప్‌పై మండిపడ్డ ప్రముఖ ఆర్థికవేత్త

భారత్‌ను అమెరికా కోల్పోతే ప్రమాదం.. ట్రంప్‌నకు దక్షిణ కెరొలీనా మాజీ గవర్నర్ వార్నింగ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 23 , 2025 | 08:29 AM