Share News

Jeffrey Sachs: అమెరికాను భారత్‌ మునుపటిలా నమ్మదు.. ట్రంప్‌పై మండిపడ్డ ప్రముఖ ఆర్థికవేత్త

ABN , Publish Date - Aug 21 , 2025 | 02:42 PM

ట్రంప్ సుంకాల కారణంగా భారత్ అమెరికా దౌత్య బంధంపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందని ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ శాక్స్ అన్నారు. భారతీయులు గుణపాఠం నేర్చుకున్నారని, ఇక అమెరికాను నమ్మరని కామెంట్ చేశారు.

Jeffrey Sachs: అమెరికాను భారత్‌ మునుపటిలా నమ్మదు.. ట్రంప్‌పై మండిపడ్డ ప్రముఖ ఆర్థికవేత్త
Jeffrey Sachs India Tariffs Criticism

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌పై అమెరికా సుంకాల విధింపును ప్రముఖ ఆర్థికవేత్త, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్ తీవ్రంగా ఖండించారు. అమెరికాకు ఆసియాలో ఉన్న అత్యంత ముఖ్యమైన దౌత్యబంధాన్ని చేజేతులా దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌పై విధించిన ఈ సుంకాలు వ్యూహాత్మకం కాదు మూర్ఖత్వం. అమెరికా విదేశాంగ విధానంలో అత్యంత మూర్ఖపు చర్య ఇదే’ అని అన్నారు. ఈ సుంకాల విధింపుతో అమెరికా పలు దీర్ఘకాలిక పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.

‘ఈ సుంకాలు బ్రిక్స్ దేశాలను రాత్రికి రాత్రి ఏకం చేశాయి. మునుపెన్నడూ చూడని రీతిలో వాటి మధ్య దౌత్య బంధాలు పెరిగాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఆయా దేశాలు పలుమార్లు ఫోన్ కాల్స్ చేసుకున్నాయి. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా దౌత్య బంధాన్ని బలోపేతం చేసుకున్నాయి. ట్రంప్ బ్రిక్స్‌ను ఏకం చేశారు. ఇందులో నాకు అభ్యంతరమేమీ లేదు. నాకు బ్రిక్స్ అంటే ఇష్టమే. కానీ దక్షిణ కెరొలీనా సెనెటర్ లిండ్సే గ్రాహమ్ చెప్పిన దానికంటే పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. అతడు ఓ ఫూల్. అమెరికాలోనే అత్యంత చెత్త సెనెటర్’ అంటూ మండిపడ్డారు.


డొనాల్డ్ ట్రంప్‌కు వాణిజ్య సలహాదారుగా ఉన్న పీటర్ నెవారోపై కూడా జెఫ్రీ శాక్స్ ఫైరైపోయారు. అతడికి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ ఉన్నా ఏమాత్రం అవగాహన, సామర్థ్యం లేని వ్యక్తి అని మండిపడ్డారు. ఈ చర్యల కారణంగా అమెరికా, భారత్ దౌత్య బంధంపై దీర్ఘకాలిక ప్రభావం పడిందని అన్నారు. ‘భారత్‌తో కొన్ని ఏళ్లుగా పెంపొందించుకుంటూ వస్తున్న వ్యూహాత్మక, దౌత్య సంబంధాన్ని ట్రంప్ ఒక్కరాత్రిలో తెంచేశారు. ఇప్పటికిప్పుడు 25 శాతం సుంకాన్ని తొలగించినా భారతీయులు మాత్రం ఈ గుణపాఠాన్ని మర్చిపోరు. అమెరికాను ఇక విశ్వసించరు’ అని అన్నారు. సుంకాల కారణంగా అమెరికాకు ఎలాంటి ప్రయోజనాలు కలగకపోగా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల మధ్య దౌత్య బంధాలు బలోపేతం అయ్యాయని అన్నారు.


ఇవి కూడా చదవండి:

కాలాపానీ ప్రాంతం మీదుగా చైనాతో వాణిజ్యంపై నేపాల్ అభ్యంతరాలు.. ఖండించిన భారత్

భారత్‌ను అమెరికా కోల్పోతే ప్రమాదం.. ట్రంప్‌నకు దక్షిణ కెరొలీనా మాజీ గవర్నర్ వార్నింగ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 21 , 2025 | 04:15 PM