Trump Criticizes: న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే
ABN, Publish Date - Nov 07 , 2025 | 05:08 AM
న్యూయార్క్ కొత్త మేయర్‌గా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ నేత జోహ్రాన్ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు.
డెమొక్రాట్లు ఓ కమ్యూనిస్టును కూర్చోబెట్టారు.. అమెరికాను క్యూబా, వెనెజువెలాలా మార్చాలని యత్నం
న్యూయార్క్‌లో ఆర్థిక, సామాజిక విపత్తు తప్పదు
కమ్యూనిజమా, కామన్‌సెన్సా? ఏదీకావాలో తేల్చుకోవాలి
మమ్దానీ చాలా ఆగ్రహంగా ప్రసంగించారు
నా పట్ల మర్యాదగా ఉంటే మంచిది: ట్రంప్ హెచ్చరిక
మియామి, నవంబరు 6: న్యూయార్క్ కొత్త మేయర్‌గా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ నేత జోహ్రాన్ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. విజయోత్సవంలో జోహ్రాన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. బుధవారం ఫ్లోరిడాలోని మియామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరం సదస్సులో ట్రంప్ మాట్లాడారు. ఏడాది క్రితం నవంబరు5న (ట్రంప్ గెలిచిన రోజు) అమెరికన్లు తమ సార్వభౌమతాన్ని తిరిగి నిలుపుకొన్నారని.. ఇప్పుడు న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో అందులో కొంత పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అమెరికన్లకు ఇప్పుడు కమ్యూనిజమా, కామన్ సెన్సా ఏది కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ‘‘మమ్దానీయా.. న్యూయార్క్‌లో అతడి పేరు ఏదైతే ఏంటి? మహిళల క్రీడల్లో మగవాళ్లు ఆడటం ఆయనకు అద్భుతంగా అనిపిస్తుంది’’అని ఎద్దేవా చేశారు. డెమొక్రాట్లు దేశంలోని పెద్ద నగరంలో కమ్యూనిస్టును తీసుకొచ్చి కూర్చోబెట్టారని విమర్శించారు. ‘‘డెమొక్రాట్లు అమెరికాను ఏం చేయాలని కోరుకుంటున్నారో తెలుసా? న్యూయార్క్ ఎన్నికల ఫలితాన్ని చూస్తే తెలుస్తుంది. వాళ్లు అమెరికాను క్యూబా, వెనెజువెలాలా మార్చాలని చూస్తున్నారు. అక్క డేం జరిగిందో మీకు తెలుసు. ఇలా జరగకూడదని నేను భావించాను. న్యూయార్క్‌కు ఆర్థిక, సామాజిక విపత్తు తప్పదు. ప్రజలు న్యూయార్క్‌ను వదిలేసి ఫ్లోరిడాకు పారిపోవాల్సి వస్తుంది. వారికి మియామి ‘శరణార్థి’ క్యాంపులా మారిపోతుంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత వరకు అమెరికాలో ఏరకంగానూ కమ్యూనిజాన్ని అనుమతించబోనని, దానిని ఇక్కడే ఆపుతానన్నారు. కమ్యూనిస్టు పాలనలో తాను ఉండలేనని, న్యూయార్క్ నగరాన్ని వీడుతానని చెప్పారు. మేయర్ ఎన్నికలో గెలిచిన అనంతరం మమ్దానీ చాలా ఆగ్రహంగా ప్రసంగించారని, కానీ తన విషయంలో మర్యాదగా ఉంటే మంచిదని ట్రంప్ పేర్కొన్నారు. న్యూయార్క్ మేయర్‌గా ఆయనకు రావాల్సిన అన్నింటినీ ఆమోదించాల్సింది తానేనని చెప్పారు. ప్రసంగం చివరిలో ట్రంప్ తనదైన శైలిలో నృత్యం చేశారు. కాగా.. జోహ్రాన్ మమ్దానీ గెలిస్తే తాము న్యూయార్క్ వదిలి వెళ్లిపోతామని 9శాతం మంది ప్రజలు చెప్పారని ఎన్నికల ముందు సర్వే చేసిన జేఎల్ పార్ట్‌నర్స్ వెల్లడించింది.
భారత్-పాక్ యుద్ధంలో 8 ఫైటర్లు కూలాయి
భారత్-పాక్ యుద్ధంలో 8 యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ పేర్కొన్నారు. ఆ యుద్ధాన్ని ఆపింది తానేనని మరోసారి చెప్పారు. ‘‘భారత్-పాక్ యుద్ధంలో 7 విమానాలు కూలిపోయాయి. మరొకటి తీవ్రంగా దెబ్బతింది. మొత్తం 8 ఫైటర్లు కూలిపోయాయి. వాణిజ్య ఒప్పందం చేసుకోబోనని హెచ్చరించి ఆ యుద్ధం ఆపాను’’ అని మియామి సదస్సులో పేర్కొన్నారు. కాగా, ట్రంప్ ఇలా ప్రకటన చేయడం 58వసారని, కానీ ప్రధాని మోదీ ఏమీ మాట్లాడరేంటని కాంగ్రెస్ ప్రధాన కార్యర్శి జైరాం రమేశ్ విమర్శించారు.
Updated Date - Nov 07 , 2025 | 05:08 AM