ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump: భారత్‌ సూపర్‌ ఆఫర్‌!

ABN, Publish Date - May 16 , 2025 | 04:49 AM

అమెరికాకు చెందిన సరుకులపై అన్ని రకాల సుంకాలను ఉపసంహరించుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు భారత్‌ తమకు తెలిపిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో బాంబు పేల్చారు.

  • అమెరికా సరుకులపై సుంకాలు మొత్తం ఎత్తేస్తానని ముందుకొచ్చింది

  • ఆ మేరకు ఒప్పందానికి సిద్ధమైంది

  • ట్రంప్‌ మరో సంచలన ప్రకటన

  • భారత్‌ బదులు అమెరికాలో ప్లాంట్లు నిర్మించాలని యాపిల్‌కు సూచన

  • భారత్‌-పాక్‌ యుద్ధాన్ని ఆపలేదు.. ఆపేందుకు సాయం చేశానని వెల్లడి

  • భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు నడుస్తున్నాయి

  • ఇంకా ఏమీ ఖరారు కాలేదు.. ముందే తీర్పులివ్వటం అపరిపక్వత

  • విదేశాంగ మంత్రి జైశంకర్‌ సిందూర్‌ నిలిపివేతకు, ట్రంప్‌ ప్రకటనకు సంబంధముందా: జైరాం

దోహా, మే 15: అమెరికాకు చెందిన సరుకులపై అన్ని రకాల సుంకాలను ఉపసంహరించుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు భారత్‌ తమకు తెలిపిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో బాంబు పేల్చారు. ఖతార్‌ పర్యటనలో ఉన్న ట్రంప్‌ ఆ దేశ రాజధాని దోహాలో గురువారం జరిగిన ఓ వాణిజ్య సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సంచలన ప్రకటన చేశారు. ఎటువంటి సుంకాలు లేని ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు భారత్‌ నుంచి ప్రతిపాదన వచ్చిందన్నారు. ట్రంప్‌ ప్రకటనపై భారత విదేశాంగమంత్రి జైశంకర్‌ స్పందిస్తూ.. ‘భారత్‌ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. అవి సంక్లిష్టమైనవి. అన్నింటిపైనా స్పష్టత వచ్చే వరకూ నిర్ణయం తీసుకోవటం అంటూ ఉండదు. ఏ వాణిజ్య ఒప్పందమైనా ఇరుదేశాలకు లబ్ధి చేకూర్చాలి. దీనిపై ముందే తీర్పులు ప్రకటించేయటం అపరిపక్వత అవుతుంది’ అని పేర్కొన్నారు. కాగా, భారత్‌ సుంకాలు వేయబోనని చెప్పిందన్న ట్రంప్‌ ప్రకటనపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఎక్స్‌లో పలు ప్రశ్నలు సంధించారు. ‘కేంద్ర వాణిజ్యమంత్రి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ట్రంపేమో దోహా నుంచి మరో భారీ ప్రకటన చేశారు. ప్రధానమంత్రి ఈ వ్యవహారంపై ఏమీ మాట్లాడటం లేదు. ఇంతకూ ఆయన (మోదీ) దేనికి అంగీకరించారు? ఆపరేషన్‌ సిందూర్‌ నిలిపివేతకు ట్రంప్‌ ప్రకటనకు మధ్య ఏమైనా సంబంధం ఉందా?’ అని పేర్కొన్నారు. మరోవైపు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఖరారు కోసం చర్చలు జరిపేందుకు కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. భారత ఉత్పత్తుల మీద ట్రంప్‌ ఇటీవల 26 శాతం సుంకం విధించి, ఆ తర్వాత 90 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ గడువు ముగియకముందే ఇరుదేశాల వాణిజ్య ఒప్పందాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని భారత్‌ ప్రయత్నిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.


భారత్‌లో వద్దు.. అమెరికాలో నిర్మించండి

దోహా వాణిజ్య సదస్సులో ట్రంప్‌ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. చైనా నుంచి భారత్‌కు ఐఫోన్‌ ప్లాంట్లను భారీ ఎత్తున తరలిస్తున్న ఆపిల్‌ కంపెనీకి ఆ పని చేయవద్దని ట్రంప్‌ సూచించారు. ఆపిల్‌ సీఈఓ టిమ్‌కుక్‌తో అంతకుముందు రోజు జరిగిన సంభాషణ వివరాలను ఈ మేరకు వెల్లడించారు. భారత్‌లో నిర్మించేబదులు అమెరికాలో ఐఫోన్‌ తయారీ ప్లాంట్లను నిర్మించాలని టిమ్‌కు సూచించానని, భారత్‌ తన అవసరాలు తాను చూసుకోగలదని చెప్పానన్నారు. ఇక మీదట అమెరికాలో యాపిల్‌ కంపెనీల్లో ఉత్పత్తి పెరగనుందన్నారు. అయితే, భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి తమ ప్రణాళికలపై ట్రంప్‌ ప్రకటన ప్రభావం ఉండబోదని యాపిల్‌ కంపెనీ ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. యాపిల్‌ ఉత్పత్తుల తయారీ ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా భారత్‌ను చూస్తామని వారు తెలిపినట్లు పేర్కొన్నాయి.


భారత్‌-పాక్‌ యుద్ధం ఆపటానికి సాయపడ్డా

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లుగా పలుమార్లు చెప్పుకున్న ట్రంప్‌ తాజాగా కాస్త తగ్గారు. ఇరుదేశాల సమస్యను తానే మొత్తంగా పరిష్కరించకపోయినా, పరిష్కరించేందుకు సాయపడ్డానని తెలిపారు. ఖతార్‌లోని అల్‌ ఉదీద్‌ వైమానిక స్థావరంలో అమెరికా సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘భారత్‌ పాకిస్థాన్‌ మధ్య పరిస్థితి రోజురోజుకీ తీవ్రమవుతూ వచ్చింది. ఆ సమయంలో నేను వారితో.. యుద్ధం బదులు వ్యాపారం చేసుకోవాలని చెప్పాను. దానికి ఇరుదేశాలూ చాలా సంతోషించాయి. వాళ్లు వెయ్యేళ్లుగా కొట్లాడుకుంటున్నారు. నేను దాన్ని ఆపగలనని చెప్పా.. ఆపా. నేను దేన్నైనా ఆపగలను, పరిష్కరించగలను’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - May 16 , 2025 | 04:49 AM