యుద్ధం నేనే ఆపా
ABN, Publish Date - Jun 19 , 2025 | 03:01 AM
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని ట్రంప్‌కు ప్రధాని మోదీ స్పష్టం చేసిన నేపథ్యంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది
భారత్ వైపు ప్రధాని మోదీ, పాక్ వైపు ఆర్మీ చీఫ్ మునీర్ ప్రభావవంతంగా పనిచేశారు కాల్పుల విరమణతో అమెరికాకు సంబంధం లేదని మోదీ స్పష్టం చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య
న్యూఢిల్లీ, జూన్ 18: యుద్ధాన్ని ఆపడంలో భారత్ వైపు ప్రధాని మోదీ, పాకిస్థాన్ వైపు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రభావవంతంగా వ్యవహరించారని... అయితే యుద్ధాన్ని మాత్రం తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కాల్పుల విరమణకు అంగీకరిస్తే భారీగా వాణిజ్యం చేస్తామని, లేకుంటే వాణిజ్యం మొత్తంగా నిలిపివేస్తామని తాను చేసిన హెచ్చరికలతోనే భారత్, పాక్ యుద్ధం నిలిపివేశాయని గతంలో ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్ తరఫున మోదీ, పాక్ తరఫున ఆసిమ్ మునీర్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించారంటూ వారికి కొంత క్రెడిట్ ఇచ్చారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని ట్రంప్‌కు ప్రధాని మోదీ స్పష్టం చేసిన నేపథ్యంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. బుధవారం ట్రంప్ అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్, భారత్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను. ఐ లవ్ పాకిస్థాన్. మోదీ ఒక అద్భుత వ్యక్తి. గత రాత్రే నేను ఆయనతో మాట్లాడాను. భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నాం. పాకిస్థాన్ వైపు ఆ దేశ ఆర్మీ చీఫ్, భారత్ వైపు ప్రధాని మోదీ.. యుద్ధాన్ని ఆపడంలో ఇద్దరూ ప్రభావవంతమైన వ్యక్తులు. వారి పని వారు చేశారు. రెండూ అణ్వస్త్ర సామర్థ్యమున్న దేశాలు. వారి మధ్య యుద్ధాన్ని నేను ఆపాను’’ అని వ్యాఖ్యానించారు. తాను చేసిన గొప్పపనిని మీడియా సరిగా పట్టించుకోవడం లేదనే ఉద్దేశాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు
Updated Date - Jun 19 , 2025 | 04:18 AM