Trump India Tariff: టారిఫ్ బాంబుతో భారత్‌పై దాడి..రష్యా ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ షాక్
ABN, Publish Date - Aug 12 , 2025 | 08:28 AM
గతంలో భారత ఆర్థిక వ్యవస్థ గురించి వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రష్యాపై పడ్డారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను కట్టడి చేస్తే, రష్యా ఆర్థిక వ్యవస్థ పడిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి భారత్‌పై భారీ దిగుమతి సుంకాలు విధించడం ద్వారా మాత్రం కాదు, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటమే. వైట్ హౌస్‌లో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడిన ట్రంప్ దీన్ని రష్యా ఆర్థికవ్యవస్థపై పెద్ద దెబ్బగా పేర్కొన్నారు (Trump India Tariff). భారతదేశం రష్యాకు అతిపెద్ద లేదా రెండో అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా ఉంది. ఇలాంటి క్రమంలో ఇండియాపై 50% టారిఫ్ విధించి చమురు కొనుగోళ్లను ఆపితే, రష్యా ఆర్థిక వ్యవస్థ పడిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రెండు దఫాల్లో టారిఫ్
ఈ టారిఫ్ ఒక్కసారిగా రాలేదు. ముందుగా జూలై 30న 25% టారిఫ్ విధించగా, ఆగస్ట్ 7న మరో 25% పెంచి మొత్తాన్ని 50%కి తీసుకెళ్లారు. ఈ చర్యలు రష్యా ఎకానమీని కుదిపేశాయంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అది పెద్ద దేశం, 11 టైం జోన్‌లు ఉన్నాయి. కానీ ఇప్పుడు రష్యా ఆర్థిక వ్యవస్థ అంత బాగోలేదన్నారు.
భారత ప్రభుత్వం స్పందన
భారత ప్రభుత్వం ట్రంప్ చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ టారిఫ్‌లను అన్యాయం, కారణం లేని చర్యగా అభివర్ణించింది. భారత విద్యుత్, ఇంధన భద్రత కోసం చమురు కొనుగోళ్లు జరుగుతున్నాయని, దానిపై ఇతర దేశాలు ఒత్తిడి తేవడం సమంజసం కాదని పేర్కొంది.
అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీ
ఈ నేపథ్యంలో ఆగస్టు 15న శుక్రవారం అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ భేటీ కానున్నారు. 2015 తర్వాత పుతిన్ అమెరికాకు వస్తున్న మొదటి సందర్భం ఇది. ట్రంప్ దీన్ని గౌరవంగా భావిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు మా దేశానికి రావడం చాలా గౌరవంగా ఉందని, మేము వారి దేశానికి లేదా మూడవ ప్రదేశానికి వెళ్లడం కంటే ఇది బాగుందని పేర్కొన్నారు.
నిర్మాణాత్మక సంభాషణలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీతో కూడా మాట్లాడాలని ప్లాన్ చేస్తున్నారు. ముగ్గురితో సమావేశం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ భేటీలో ప్రధాన చర్చల అంశం రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడం.
చర్చల పిలుపు
ఈ టారిఫ్ చర్యలు, శాంతి చర్చల పిలుపు రెండూ కలిసి ఒక గొప్ప రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తున్నా, దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది వేచి చూడాల్సిందే. భారత్ వంటి కీలక మిత్రదేశాన్ని టారిఫ్‌లతో ఒత్తిడిలోకి తేవడం సరైనదా? లేక ఇది రష్యాపై ఒత్తిడి తీసుకురావడంలో ఫలిస్తుందా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 12 , 2025 | 09:10 AM