మా మధ్యవర్తిత్వం వల్లే కాల్పుల విరమణ: ట్రంప్
ABN, Publish Date - May 11 , 2025 | 03:55 AM
భారత్, పాకిస్థాన్ తక్షణమే కాల్పుల విరమణ అమలుకు అంగీకరించాయని, అమెరికా చేసిన మధ్యవర్తిత్వం వల్లే ఇది సాధ్యమైందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు.
వాషింగ్టన్, మే 10 : భారత్, పాకిస్థాన్ తక్షణమే కాల్పుల విరమణ అమలుకు అంగీకరించాయని, అమెరికా చేసిన మధ్యవర్తిత్వం వల్లే ఇది సాధ్యమైందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో కూడా ఇదే తరహా ప్రకటన చేశారు. భారత్, పాక్ సైన్యాలు సైనిక స్థావరాలపై పరస్పర దాడులకు తెగబడుతూ ఇరుదేశాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటనలు వెలువడ్డాయి. ‘‘అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రింతా సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం భారత్, పాకిస్థాన్ తక్షణమే పూర్తి స్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి.
ఈ విషయంలో విజ్ఞత, తెలివిగా వ్యవహరించిన ఇరుదేశాలకు శుభాకాంక్షలు’’ అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు చేశారు. భారత్, పాక్ విదేశాంగ శాఖ మంత్రులు ఎస్ జైశంకర్, ఇషాక్ దర్, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌తో రుబియో రుబియో మాట్లాడిన తర్వాత ట్రంప్ ప్రకటన వెలువడింది. భారత్, పాక్ ప్రభుత్వాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించేందుకు అంగీకరించాయని, వేర్వేరు అంశాలపై ఇరుదేశాలు తటస్థ వేదికలో చర్చలు ప్రారంభించబోతున్నాయి అని రుబియో ఓ ప్రకటన చేశారు. కాగా మధ్యవర్తిత్వం అంశంలో అమెరికా చేసిన ప్రకటనలను పాకిస్థాన్ స్వాగతించగా భారత్ తోసిపుచ్చింది.
Updated Date - May 11 , 2025 | 03:55 AM