Shubhamshu Shukla: 14న భూమికి రానున్న శుభాంశు
ABN, Publish Date - Jul 11 , 2025 | 04:17 AM
ప్రస్తుతం అంతరిక్ష యాత్ర చేస్తున్న వ్యోమగామి శుభాంశు శుక్లా, ఆయన సహచరులు ఈ నెల 14న భూమికి తిరిగి రానున్నారు.
నాసా ప్రకటన..అంతరిక్షంలో విధులు పూర్తి
230 సూర్యోదయాలు.. 60 ప్రయోగాలు
న్యూఢిల్లీ, జూలై 10: ప్రస్తుతం అంతరిక్ష యాత్ర చేస్తున్న వ్యోమగామి శుభాంశు శుక్లా, ఆయన సహచరులు ఈ నెల 14న భూమికి తిరిగి రానున్నారు. ఈ విషయాన్ని గురువారం నాసా ప్రకటించింది. రెండు వారాల పాటు సాగిన ఈ యాత్రలో వారు 230 సూర్యోదయాలు చూశారు. సుమారు కోటి కిలోమీటర్ల మేర ప్రయాణించారు. భూమికి 250 మైళ్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష ప్రయోగశాల ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ఐఎస్‌ఎస్)కు యాక్సియం-4 (ఏఎక్స్-4) మిషన్ ద్వారా శుభాంశుతో పాటు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ యుజాన్‌స్కీ విష్నేవ్‌స్కీ, టైబోర్ కపు వెళ్లిన విషయం విదితమే. అక్కడ వివిధ రకాల ప్రయోగాలు చేసిన ఆ నలుగురు వ్యోమగాములు గురువారం చివరిగా విధులు నిర్వర్తించారు. ఈ రెండు వారాల పాటు భూమి చుట్టూ 230 సార్లు ప్రదక్షిణ చేశారు. ఆ లెక్కన 96.5 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించారు. కఠినమైన పరిస్థితుల మధ్య 60 ప్రయోగాలు చేశారు. బయోమెడికల్ సైన్స్, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, న్యూరోసైన్స్, వ్యవసాయం, స్పేస్ టెక్నాలజీ రంగాల్లో ఈ ప్రయోగాలు కొనసాగాయి. ఇంతవరకు ప్రయివేటు స్పేస్ మిషన్ల ద్వారా జరిగిన ప్రయోగాల్లో ఇవే అధికం కావడం విశేషం. అంతరిక్షంలో మరిన్ని ఆవిష్కరణలకు, భూమిపై జీవనవిధానంలో మార్పులకు ఇవి సహకరిస్తాయి. మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధుల చికిత్సకు కూడా ఈ ప్రయోగాలు ఉపకరిస్తాయి. మధ్యమధ్యలో లభించిన విరామ సమయంలో భూమిని వీడియోల ద్వారా చిత్రీకరించారు. కావాల్సిన వారితో మాట్లాడారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి జూన్ 25న ఆకాశంలోకి దూసుకుపోయిన ఏఎక్స్-4 మిషన్ వ్యోమనౌక 28 గంటల ప్రయాణం అనంతరం అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమయింది.
Updated Date - Jul 11 , 2025 | 04:17 AM