Ajit Doval: ట్రంప్ హెచ్చరికల వేళ రష్యాలో అజిత్ డోభాల్
ABN, Publish Date - Aug 06 , 2025 | 09:14 AM
రష్యా నుంచి చమురు సరఫరాలతోపాటు మరిన్ని ఎస్-400 క్షిపణి వ్యవస్థలు, ఎస్‌యూ-57 యుద్ధ విమానాల కొనుగోలు వంటి కీలకాంశాలపై మాస్కో అధికారులతో డోభాల్ చర్చించే అవకాశాలున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు డోభాల్ మాస్కో పర్యటనకు ముందు రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ ఆ దేశ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ కల్నల్ జనరల్ అలెగ్జాండర్ ఫోమిన్‌తో సమావేశమయ్యారు.
మాస్కో: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (Ajit Doval) మాస్కో (Moscow) పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అయితే ఆయన పర్యటన ముందుగానే ఖరారైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇండియా-రష్యాల మధ్య వ్యూహాత్మాక భాగస్వామ్యం, రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా రష్యా పర్యటన అజిత్ డోభాల్ జరుపుతున్నట్టు చెబుతున్నారు.
రష్యా నుంచి చమురు సరఫరాలతోపాటు మరిన్ని ఎస్-400 క్షిపణి వ్యవస్థలు, ఎస్‌యూ-57 యుద్ధ విమానాల కొనుగోలు వంటి కీలకాంశాలపై మాస్కో అధికారులతో డోభాల్ చర్చించే అవకాశాలున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. డోభాల్ మాస్కో పర్యటనకు ముందు రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ ఆ దేశ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ కల్నల్ జనరల్ అలెగ్జాండర్ ఫోమిన్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య రక్షణ సహకారంపై చర్చించారు. కాగా, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సైతం ఈ నెలాఖరులో రష్యాలో పర్యటించనున్నారు.
బాదుడే బాదుడు..
భారత్‌కు ట్రంప్ రెండ్రోజుల క్రితం హెచ్చరికలు చేశారు. 'భారత్ పెద్దఎత్తున రష్యా చమురును కొనుగోలు చేయడం మాత్రమే కాదు, కొనుగోలు చేసిన దానిలో ఎక్కువ భాగం భారీ లాభాల కోసం బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటోంది. రష్యా వార్ మిషన్‌లో ఎంతమంది చనిపోయారో వాళ్లకు పట్టింపు లేదు. ఆ కారణంగా అమెరికాకు చెల్లించే టారిఫ్‌లను గణనీయంగా పెంచుకుంటూ వెళ్తున్నాం' అని అన్నారు. మరో 24 గంటల్లో సుంకాల పెంపు ఉంటుందన్నారు. ట్రంప్ ఆరోపణలపై భారత ప్రభుత్వం దీటుగా జవాబిచ్చింది. ఇండియాను అకారణంగా టార్గెట్ చేస్తూ మాట్లాడటం సరికాదని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల తరహాలోనే జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను భారత్ తీసుకుంటోందని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
భారత-రష్యా చమురు డీల్స్‌పై.. ట్రంప్ సర్కార్ ఒత్తిడి
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 06 , 2025 | 10:08 AM