Trump Warns Of More Tariffs : భారత్‌పై మరిన్ని సుంకాలు
ABN , Publish Date - Aug 05 , 2025 | 03:58 AM
భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే భారత్‌పై
రష్యా చమురు కొనుగోళ్లే కారణం
భారత్ నుంచి రష్యాకు భారీగా ఆర్థిక వనరులు.. దీంతోనే ఉక్రెయిన్ యుద్ధం: ట్రంప్
ఘాటుగా స్పందించిన భారత్
ఐరోపా సమాఖ్య, అమెరికా అన్యాయంగా టార్గెట్ చేస్తున్నాయని మండిపాటు
వాషింగ్టన్, ఆగస్టు 4: భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే భారత్‌పై 25% సుంకాలను విధించిన ట్రంప్.. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్నందుకు టారి్‌ఫలను పెంచుతానంటూ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్.. బహిరంగ మార్కెట్లో దాన్ని విక్రయించి.. భారీగా లాభాలను గడిస్తోందని విమర్శించారు. చమురు కొనుగోళ్లతో భారత్ నుంచి రష్యాకు ఆర్థిక వనరులు చేరుతున్నాయని, దాంతో ఉక్రెయిన్ యుద్ధం ఆగడం లేదని ఆక్షేపించారు. రష్యాతో యుద్ధం వల్ల ఎంత మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోతున్నారో భారత్‌కు అవసరం లేదని, అందుకే.. ఆ దేశంపై సుంకాలను మరింతగా పెంచబోతున్నామని స్పష్టంచేశారు. ట్రంప్ హెచ్చరికలపై భారత ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. అమెరికా సుంకాలతో భారత్‌పై స్వల్ప ప్రభావం ఉంటుందని, జీడీపీ తగ్గుదల 0.2శాతాన్ని మించదని వివరించాయి. రష్యా చమురు కొనుగోలును ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాయి. భారత విదేశాంగ శాఖ కూడా అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై సీరియస్ అయ్యింది. భారత్‌ను అమెరికా, ఐరోపా సమాఖ్య అన్యాయంగా లక్ష్యంగా చేసుకుంటున్నాయని విమర్శించింది. ‘‘ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత.. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతిని ప్రారంభించింది. యుద్ధం కారణంగా సంప్రదాయంగా వస్తున్న చమురు సరఫరా ఐరోపాకు మళ్లింది. ఆ సమయంలో ప్రపంచ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం కోసం రష్యా చమురు కొనుగోలుకు భారత్‌ను అమెరికానే ప్రోత్సహించింది’’ అని వివరించింది. భారత్‌లో వినియోగదారులకు అందుబాటు ధరల్లో చమురు లభించేలా భారత్ చర్యలు తీసుకుంటోందని చెప్పింది. భారత్‌ను విమర్శిస్తున్న దేశాలు కూడా రష్యాతో వ్యాపారం చేస్తున్నాయని వివరించింది. ‘‘2024లో రష్యాతో ఐరోపా సమాఖ్య 67.5 బిలియన్ యూరోల విలువైన వాణిజ్యం జరిపింది. 2023లో సేవల రంగంలో 17.2 బిలియన్ యూరోల వాణిజ్యాన్ని కొనసాగించింది. ఈ మొత్తం విలువ భారత్-రష్యా మధ్య జరిగే వాణిజ్యం కంటే చాలా తక్కువ. అమెరికా కూడా తన అణు పరిశ్రమ కోసం రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్‌ను.. ఈవీ పరిశ్రమల కోసం పల్లాడియం, ఎరువులు, రసాయనాలను దిగుమతి చేసుకుంటోంది’’ అనిపేర్కొంది.
ఇవి కూడా చదవండి..
శ్రీకృష్ణుడే మొదటి రాయబారి.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
గల్వాన్ వ్యాలీ వివాదంలో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి