Nikki Haley: భారత్‌ను అమెరికా కోల్పోతే ప్రమాదం.. ట్రంప్‌నకు దక్షిణ కెరొలీనా మాజీ గవర్నర్ వార్నింగ్
ABN, Publish Date - Aug 21 , 2025 | 10:29 AM
భారత్ వంటి మిత్ర దేశాన్ని కోల్పోవడం భారీ వ్యూహాత్మక తప్పిదమవుతుందని దక్షిణ కెరొలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ ట్రంప్ ప్రభుత్వానికి హితవు పలికారు. భారత్, అమెరికా దౌత్య బంధాన్ని తక్షణం చక్కదిద్దాలని సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌పై సుంకాలతో అకారణంగా ఇబ్బందులకు గురి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సొంత దేశంలోనే విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా దక్షిణ కెరొలీనా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ ట్రంప్ ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు చేశారు. భారత్‌ను దూరం చేసుకోవద్దని హితవు పలికారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ వ్యాసం ప్రచురించారు. సుంకాలు, రష్యా చమురు వివాదాలు ఇరు దేశాల మధ్య ఎడం పెంచకుండా ట్రంప్ ప్రభుత్వం జాగ్రత్త పడాలని హితవు పలికారు. ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు తెగే దశకు చేరుకున్నాయని అన్నారు. చైనాను కట్టడి చేయడం అమెరికా లక్ష్యం అయితే భారత్‌తో సంబంధాలను వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యాల గురించి మర్చిపోవద్దని చెప్పారు.
చైనాను ఎదుర్కొనేందుకు భారత్ లాంటి మిత్ర దేశం అవసరం ఉందని నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు. రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడం ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థిక ఇంధనంగా మారిందని అన్నారు. అయితే, భారత్‌ను ప్రత్యర్థిగా మాత్రం చూడకూడదని ట్రంప్ ప్రభుత్వానికి సూచించారు. 25 ఏళ్ల పాటు ఇరు దేశాల మధ్య బలోపేతమైన బంధాన్ని బలహీనపరిస్తే భారీ వ్యూహాత్మక తప్పిదమవుతుందని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఆర్థిక, రక్షణ రంగ లక్ష్యాలకు భారత్ అత్యవసరమని అభిప్రాయపడ్డారు.
వస్తు ఉత్పత్తి వ్యవస్థలను చైనా ఆవలకు తరలిచాలని ప్రయత్నిస్తున్న అమెరికాకు భారత్ అవసరం గుర్తు చేశారు. చైనా స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం భారత్‌కు ఉందని తెలిపారు. స్వేచ్ఛాయుత ప్రపంచ భద్రత కోసం అమెరికా, ఇజ్రాయెల్‌తో భారత్ రక్షణ రంగ బంధం బలోపేతం కావడం అవసరమని అన్నారు. భవిష్యత్తులో భారత్ ఆర్థికాభివృద్ధి చైనాను అధిగమిస్తుందని పేర్కొన్నారు. దిగజారుతున్న దౌత్య బంధాల్ని సరిదిద్దేందుకు భారత్, అమెరికా దేశాధినేతల మధ్య నేరుగా చర్చలు జరగాల్సిన అవసరం కూడా ఉందని తెలిపారు. భారత్, అమెరికా దారులు వేర్వేరు అయినా గమ్యం ఒక్కటే అన్న ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ మాటలను మర్చిపోరాదని అన్నారు.
ఇవి కూడా చదవండి:
చైనాను వదిలిపెట్టి భారత్‌పై సుంకాలు.. ఇలా ఎందుకో చెప్పిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి
అమెరికాతో వాణిజ్య చర్చలు వాయిదా.. భారత్‌పై 50 శాతం సుంకం తప్పదా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 21 , 2025 | 11:24 AM