Israel PM: ఇరాన్ అణుస్థావరాలపై దాడులు.. ట్రంప్‌పై నెతన్యాహూ ప్రశంసల వర్షం
ABN, Publish Date - Jun 22 , 2025 | 08:46 AM
ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో తొలిసారిగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. ఇది చారిత్రాత్మక క్షణమని అన్నారు. సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారని ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు.
ఇరాన్‌పై అమెరికా బాంబు దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తొలిసారిగా స్పందించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా దాడులు విజయవంతమయ్యాయని, ఇది చాలా సాహసోపేతమైన చర్య అని కితాబునిచ్చారు. ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా స్పిరిట్ బాంబర్లతో దాడులు చేసిన విషయం తెలిసిందే.
‘బలమైన శక్తి ద్వారానే శాంతి నెలకొంటుంది. ట్రంప్, నేను తరచూ ఇదే చెబుతుంటాము. నేడు, ట్రంప్ సారథ్యంలో అమెరికా శక్తిమంతమైన చర్యలు తీసుకుంది’ అని వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇది చరిత్రను మలుపు తిప్పే ఘటన అని వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ రైజింగ్ లయన్ సందర్భంగా ఇజ్రాయెల్ అద్భుతమైన చర్యలు తీసుకుందని నెతన్యాహూ తెలిపారు. కానీ అమెరికా తన తాజా చర్యలతో వాటన్నిటినీ మించిపోయిందని అన్నారు. భూమ్మీద మరే దేశం చేయలేని సాహసం చేసిందని అన్నారు. ప్రపంచంలో అత్యంత వినాశకర ఆయుధం అత్యంత ప్రమాదకర పాలకుల చేతిలో పడకుండా ట్రంప్ సాహసోపేత చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ట్రంప్ మరో చరిత్ర సృష్టించారని, శాంతిసౌభాగ్యాలతో కూడిన భవిష్యత్తు వైపు మధ్య ప్రాచ్యం ప్రయాణిస్తుందని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ఇరు దేశాల మధ్య ఉన్న పటిష్ఠ బంధానికి దేవుడి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఇరాన్‌లోని ఫర్డూ, నాటనాజ్, ఎస్ఫహాన్ ప్రాంతాల్లో గల అణు స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ చర్యలపై ట్రంప్ మాట్లాడుతూ.. ఫర్డో న్యూక్లియర్ సైట్‌పై ఆరు బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించామని అన్నారు. మిగతా రెండు స్థావరాలపై 30 టామహాక్ క్షిపణులను ప్రయోగించినట్టు తెలిపారు. ప్రపంచంలో మరే దేశ మిలిటరీ ఇలాంటిది చేయలేదని అన్నారు. అమెరికా వీరులకు శుభాకాంక్షలు తెలిపారు. దాడుల అనంతరం అన్ని అమెరికా విమానాలు క్షేమంగా తిరిగొచ్చాయని చెప్పారు.
అమెరికా, ఇజ్రాయెల్, ఇతర ప్రపంచ దేశాలకు ఇది చారిత్రాత్మక క్షణమని ట్రంప్ అభివర్ణించారు. యుద్ధం ముగించేందుకు ఇరాన్ అంగీకరించాలని స్పష్టం చేశారు. ఆపరేషన్ రైజింగ్ లయన్‌తో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వారం క్రితం మొదలైన విషయం తెలిసిందే. తాజా దాడితో అమెరికా కూడా నేరుగా రంగంలోకి దిగింది.
ఇవీ చదవండి:
గాల్లో ఉండగా హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు.. కిందపడి 8 మంది దుర్మరణం
ట్రంప్ వీసా ఆంక్షలతో వైద్య సిబ్బంది కొరత.. అందోళనలో అమెరికా ఆసుపత్రులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 22 , 2025 | 09:22 AM