Share News

US: ట్రంప్ వీసా ఆంక్షలతో వైద్య సిబ్బంది కొరత.. అందోళనలో అమెరికా ఆసుపత్రులు

ABN , Publish Date - Jun 21 , 2025 | 08:51 AM

ట్రంప్ వీసా ఆంక్షల కారణంగా అమెరికాలో విదేశీ వైద్యులకు కొరత ఏర్పడింది. ముఖ్యంగా అల్పాదాయ వర్గాలకు సేవలందించే ఆసుపత్రులు వైద్యులు లేక అల్లాడుతున్నాయి.

US: ట్రంప్ వీసా ఆంక్షలతో వైద్య సిబ్బంది కొరత.. అందోళనలో అమెరికా ఆసుపత్రులు
US Hospital Staffing Crisis

ఇంటర్నెట్ డెస్క్: విదేశీయుల రాకకు అడ్డుకట్ట వేసేందుకు ట్రంప్ ప్రయోగించిన వీసా ఆంక్షలు (US Visa Restrictions) వికటిస్తున్నాయి. వైద్య సిబ్బంది కొరతతో అమెరికా ఆసుపత్రులు అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా అల్పాదాయ, మైనారిటీ వర్గాలకు సేవలందించే ఆసుపత్రుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది (US Hospital Staffing Crisis).

అమెరికా మీడియా కథనాల ప్రకారం, ట్రంప్ ఆంక్షల కారణంగా అమెరికాలోని విదేశీ రెసిండ్ డాక్టర్ల రాకలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అమెరికా హెల్త్ కేర్ వ్యవస్థలో ముఖ్యమైన సేఫ్టీ నెట్ ఆసుపత్రులు పేదలకు, అల్పాదాయ వర్గాలకు సేవలు అందిస్తుంటాయి. ఈ హాస్పిటల్స్‌ విదేశీ రెసిడెంట్ వైద్యులపైనే అధికంగా ఆధారపడుతుంటాయి. వైద్య విద్యలో భాగంగా విదేశీ విద్యార్థులు ఏటా జులై నెలలో వీటిల్లో చేరుతారు. శిక్షణ పూర్తి చేసుకుని తిరిగెళ్లిపోయే వారి స్థానాన్ని భర్తీ చేస్తుంటారు.


అయితే, ట్రంప్ ఆంక్షల కారణంగా ఈ ప్రక్రియకు అవాంతరం ఏర్పడింది. వీసా రద్దులు, పర్యటనలపై నిషేధాలు, విదేశీయుల సోషల్ మీడియా అకౌంట్‌లపై నిఘా తదితర కారణాలతో అనేక మంది అమెరికాకు రాలేకపోతున్నారు. దీంతో, ఫారిన్ రెసిడెంట్ వైద్యులకు తీవ్ర కొరత ఏర్పడింది.

ఈ పరిస్థితిని తట్టుకోలేక ఆసుపత్రులు సతమతమవుతున్నాయి. భారీ సంఖ్యలో ఉన్న పేషెంట్లకు సేవలందించలేక ఇబ్బంది పడుతున్నాయి. వైద్య సేవల నాణ్యతలో కూడా లోపం ఏర్పడొచ్చన్న ఆందోళన కనిపిస్తోంది. ఇది పేద, అల్పాదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. కొవిడ్ సంక్షోభం, వైద్యుల కొరత కారణంగా అమెరికా వైద్య వ్యవస్థ ఇప్పటికే ఇబ్బందుల్లో కూరుకుపోయింది. దీనికి ఫారిన్ వైద్యుల కొరత కూడా తోడవడంతో ఆసుపత్రి నిర్వాహకుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.


విదేశీ వైద్యుల రాకకు అడ్డంకులన్నీ తక్షణం తొలగించాలంటూ ఆసుపత్రి యాజమాన్యాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ విషయంలో జాప్యం ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇవీ చదవండి:

కెనడాలో భారతీయ యువతి మృతి.. వెల్లడించిన కాన్సులేట్ కార్యాలయం

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌ లైన్ ఏర్పాటు

Read Latest and NRI News

Updated Date - Jun 21 , 2025 | 10:44 AM