Nepal Army Chief Statement: నేపాల్ జెన్ జీ నిరసనలు.. ప్రజలను రక్షించుకుంటామన్న ఆర్మీ చీఫ్
ABN, Publish Date - Sep 09 , 2025 | 11:07 PM
అన్ని వర్గాలు చర్చలు ప్రారంభించి నిరసనలకు ముగింపు పలకాలని నేపాల్ ఆర్మీ చీఫ్ పిలుపునిచ్చారు. ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. పరిస్థితి చేయిదాటితే కఠిన చర్యలకు పూనుకుంటామని కూడా హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: జెన్ జీ నిరసనలు నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్డేల్ కీలక ప్రకటన చేశారు. ప్రజల మానప్రాణాలను తాము రక్షణగా ఉంటామని అన్నారు. ఈ ఘర్షణల కారణంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారందరికీ ఆయన సంఘీభావం తెలిపారు. పౌరులు, దేశ ఆస్తులు, ఇతర దేశాల దౌత్య కార్యాలయాలను కాపాడటం నేపాల్ ఆర్మీ బాధ్యత అని అన్నారు. ఈ నిరసనలకు చర్చలతో ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. జాతి భద్రత, ప్రయోజనాలకే పెద్ద పీట వేయాలని అన్నారు. తమ నిరసనలు బాధ్యతాయుతంగా నిర్వహించాలని, హింసకు పాల్పడవొద్దని నిరసనకారులకు హితవుపలికారు. ఆస్తులు ధ్వంసానికి పాల్పడే వారితో కఠినంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరించారు (Nepal Army Chief Calls For Peace).
ప్రస్తుత ఉద్రిక్తతలను అడ్డు పెట్టుకుని ఆస్తుల ధ్వంసానికి పాల్పడే వారికి ఉపేక్షించబోమని జనరల్ అశోక్ హెచ్చరించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే లా అండ్ ఆర్డర్‌ను కాపాడేందుకు నేపాల్ ఆర్మీ నిర్ణయాత్మక చర్యలకు దిగాల్సి వస్తుందని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి చర్చించి ఈ నిరసనలకు ముగింపు పలకాలని అన్నారు. నిరసనకారులు తక్షణం తమ చర్యలకు ముగింపు పలికి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. చర్చలే సమస్యలకు పరిష్కారమని స్పష్టం చేశారు. ఈ నిరసనల్లో పలువురు మరణించడంతో శాంతి నెలకొల్పాలని నిరసనకారులకు పోలీసులు పిలుపునిచ్చారు. జాతియ భద్రత, నేరాలను అరికట్టడం ప్రశార్థకంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, చట్టబద్ధ పాలనను రక్షించేందుకు, ప్రజల పాలనను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు (Nepal Gen Z protests).
ఇదిలా ఉంటే నేపాల్‌కు సరిహద్దు రాష్ట్రమైన యూపీలో హైఅలర్ట్ ప్రకటించారు. సరిహద్దు వెంబడి ఉన్న అన్ని జిల్లాల్లో పోలీసులు రేయింబవళ్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. సరిహద్దు వెంబడి గస్తీ కోసం అదనపు దళాలను కూడా మోహరించారు. ఇప్పటికే భారత్ నేపాల్ మధ్య సరిహద్దు వద్ద మార్గాలన్నిటినీ కూల్చేశారు.
ఇవి కూడా చదవండి:
నేపాల్‌లో మరో దారుణం.. మాజీ ప్రధాని భార్య దుర్మరణం
భారత దౌత్య వ్యూహంపై అమెరికా ప్రొఫెసర్ ప్రశంసలు.. చాలా స్మార్ట్ అని కితాబు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 09 , 2025 | 11:07 PM