Ex Nepal PM Wife Death: నేపాల్‌లో మరో దారుణం.. మాజీ ప్రధాని భార్య దుర్మరణం
ABN , Publish Date - Sep 09 , 2025 | 07:23 PM
జెన్ జీ నిరసనల్లో మరో దారుణ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మాజీ ప్రధాని జలనాథ్ ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టడంతో ఆయన భార్య రాజ్యలక్ష్మి మరణించినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
కఠ్మాండూ: నేపాల్ నిరసనల్లో మరో దారుణ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మాజీ ప్రధాని జలనాథ్ ఖనాల్ ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టడంతో తీవ్రంగా గాయపడ్డ ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రకార్ మరణించినట్టు స్థానిక మీడియాలో సంచలన కథనాలు వెలువడుతున్నాయి (Ex-Nepal PM Jhalanath's wife). నేపాల్‌లో జెన్ జీ నిరసనల్లో ఇప్పటికే పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, కఠ్మాండూలోని దల్లూ ప్రాంతంలో జలనాథ్ నివాసం ఉంది. నిరసనకారులు రాజేసిన మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డ చిత్రకార్‌ను కీర్తీపూర్ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఆమె మరణించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది (Nepal Gen Z protests).
ఇటీవల నిరసనకారులు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇంటికీ నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. నిరసనలు తీవ్రతరం అవుతుండటంతో ఆయన మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇక నేపాల్ ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పాడేల్‌ను నిరసనకారులు వీధుల్లో పరిగెత్తించి మరీ కొట్టినట్టు కనిపిస్తున్న వీడియోలు నెట్టింట కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధంతో మొదలైన ఈ నిరసనల్లో ఇప్పటివరకూ 19 మంది మరణించారు. సోమవారమే నిషేధం ఎత్తివేసినా నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
నేపాల్ ప్రధాని, అధ్యక్షుల ఇళ్లపై దాడులు, పార్లమెంట్ భవనం దహనం
సైన్యం సూచనతో నేపాల్ ప్రధాని ఓలి రాజీనామా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి