Share News

Nepal Protest: నేపాల్‌ ప్రధాని, అధ్యక్షుల ఇళ్లపై దాడులు, పార్లమెంట్ భవనం దహనం

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:15 PM

నేపాల్‌ యువత ఆగ్రహం ఆ దేశ ప్రభుత్వాన్నే కూల్చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు దేశంలో భయోత్పాతాన్ని సృష్టించాయి. ప్రధాని ఓలి, అధ్యక్షుడి ఇళ్లు ధ్వంసం చేశారు నిరసనకారులు.

Nepal Protest: నేపాల్‌ ప్రధాని, అధ్యక్షుల ఇళ్లపై దాడులు, పార్లమెంట్ భవనం దహనం
Nepal PM President Houses Set On Fire

కఠ్మాండు(నేపాల్), సెప్టెంబర్ 9: నేపాల్‌లో జెన్ జెడ్ (Gen Z) యువత ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు ఆ దేశ ప్రభుత్వాన్నే కూల్చేశాయి. సోషల్ మీడియా ఆంక్షలు, అవినీతి, బంధువుల ప్రాధాన్యతలపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి ప్రధాని(Nepal PM) కె.పి.శర్మ ఓలి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాయి. ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రదర్శనలు హింసాత్మకంగా మారి దేశంలో భయోత్పాతాన్ని సృష్టించాయి.


ప్రధాని ఓలి(KP Sharma Oli), అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్(President Ram Chandra Poudel) ఇళ్లను ఆందోళన కారులు ధ్వంసం చేశారంటే నేపాల్‌లో పరిస్థితి అర్థం అవుతుంది. నిరసనకారులు మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ (ప్రచండ)(former Nepali Prime Ministers Pushpa Kamal Dahal alias Prachanda) ఇంటిని కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించడానికి దారితీసాయి. గత వారం నుంచి నేపాల్ ప్రభుత్వం ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఆంక్షలు విధించడంతో యువతలో కోపం రగిలింది.


అయితే, ఈ ఆంక్షలు ఎత్తివేసినా ప్రదర్శనలు మాత్రం ఆగలేదు. అవినీతి, బంధుప్రీతి రాజకీయాలు(నెపో కిడ్స్, నెపో బేబీస్)కు ప్రాధాన్యత అంటూ జనం గళమెత్తారు. 'అవినీతిని ఆపండి.. సోషల్ మీడియాను కాదు' అనే నినాదాలతో లక్షలాది మంది నిరసనకారులు కాఠ్మాండూ రోడ్లెక్కారు. నిరసనకారులు పార్లమెంట్ భవనంపై దాడి చేసి భవనాన్ని దహనం చేశారు. మాజీ ప్రధాని షేర్ బహాదుర్ దేవుబా, ఎనర్జీ మంత్రి దీపక్ ఖడ్కా ఇళ్లనూ నిరసనకారులు లక్ష్యంగా చేసుకున్నారు.


ప్రచండ ఇంటిపై రాళ్ల దాడి, ధ్వంసం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులతో జరిగిన ఘర్షణల్లో కనీసం 19 మంది నిరసనకారులు మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారని ఆరోపణలు వచ్చాయి. ప్రదర్శకుల్లో ఒకరైన నారాయణ్ అచార్య మాటల్లో.. 'మా యువత, స్నేహితులు చంపబడుతున్నారు. న్యాయం కావాలి, ఈ ప్రస్తుత పాలితవర్గం తొలగాలి. కె.పి.ఓలిని తరిమివేయాలి' అంటూ నినదించారు.


దుర్గనహ్ దహల్ అనే మరో నిరసనకారుడి మాటల్లో.. 'ఈ హిట్లర్‌లా ఉన్న కె.పి.ఓలి ప్రభుత్వం చేత యువత, విద్యార్థులు చంపబడుతున్నారు. ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మేం బాధపడతూనే ఉంటాం' అంటూ ధ్వజమెత్తారు. కాగా, #NepoKid, #NepoBabies #PoliticiansNepoBabyNepal వంటి హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వం సోషల్ మీడియా ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ, కర్ఫ్యూ విధించి పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించింది. మంత్రులు రాజీనామాలు చేస్తూ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తుండటంతో చివరికి ప్రధాని ఓలి సైన్యం సూచన మేరకు రాజీనామా సమర్పించారు. దుబాయ్ పారిపోవాలని ఓలి ప్లాన్ చేసుకున్నప్పటికీ ముందు రాజీనామా చేయండంటూ సైన్యం వారించడంతో చివరికి ఓలి దిగిరాక తప్పలేదు.

Nepal-Parliament-set-on-fir.jpg


ఇవి కూడా చదవండి..

సింహం vs చిరుత.. పిల్లలను కాపాడుకోవడం కోసం చిరుత ఫైటింగ్ చూశారా?


మీది డేగ చూపు అయితే.. ఈ 6ల మధ్య 9ని 5సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Sep 09 , 2025 | 04:46 PM