Share News

Nepal PM : సైన్యం సూచనతో నేపాల్ ప్రధాని ఓలి రాజీనామా

ABN , Publish Date - Sep 09 , 2025 | 02:26 PM

నేపాల్ ప్రధాని కే పీ శర్మ ఓలి ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. నేపాల్‌లో జెన్ జెడ్ (Gen Z)యువత ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు దేశ రాజకీయాలను తలకిందులు చేశాయి. సోషల్ మీడియా ఆంక్షలు, అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి..

Nepal PM : సైన్యం సూచనతో నేపాల్ ప్రధాని ఓలి రాజీనామా
Nepal PM Oli resigns

కఠ్మాండూ (నేపాల్) సెప్టెంబర్ 9 : సైన్యం సూచనతో నేపాల్ ప్రధాని కే పీ శర్మ ఓలి(K P Sharma Oli) ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. కొంచెం సేపటి క్రితమే ఆయన తన రాజీనామా సమర్పించారు. నేపాల్‌లో జెన్ జెడ్ (Gen Z) యువత ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు దేశ రాజకీయాలను తలకిందులు చేశాయి. సోషల్ మీడియా ఆంక్షలు, అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో ప్రధాని ఓలి అధికారం నుంచి తప్పుకోకతప్పలేదు.

Nepal PM Resign.jpg


గత వారం నుంచి నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఆంక్షలు విధించడంతో యువతలో కోపం కట్టలు తెంచుకుంది. దీనికి ప్రతిగా జరిగిన ప్రదర్శనలు ఖాఠ్మాండు, లాలిత్‌పూర్‌లో హింసాత్మకంగా మారాయి. పోలీసులు, సైన్యం చేతిలో 20 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ హింసాత్మక అణచివేతకు నిరసనగా నేపాల్ హోం మంత్రి రమేష్ లెఖక్(Home Minister Ramesh Lekhak), వ్యవసాయ మంత్రి రామ్‌నాథ్ అధికారి, ఆరోగ్య మంత్రి ప్రదీప్ పౌడెల్‌లు రాజీనామా చేశారు. ఓలి ప్రభుత్వాన్ని వాళ్లంతా 'అధికారవాదం'అని ఆరోపించారు.


ఈ సందర్భంలో నేపాల్(Nepal) సైన్యాధిపతి జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్ కీలక పాత్ర పోషించారు. ఓలిని రాజీనామా చేయమని సూచించారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో సైన్యం దేశవ్యాప్తంగా మోహరించినప్పటికీ అధికారులు ఓలి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి ఇష్టపడలేదు.సైన్యం.. యువత ప్రదర్శనలకు వ్యతిరేకంగా నిలబడజాలదని సైన్యాధికారులు తేల్చి చెప్పారు.


ఓలి దుబాయ్‌కు పారిపోవాలని భావించినప్పుడు కూడా, సైన్యం 'ముందు రాజీనామా చేయండి' అని స్పష్టం చేసిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఓలి తన రాజీనామా పత్రంలో 'ఈ కష్టకాలంలో అందరూ శాంతియుతంగా ఉండాలి' అని పిలుపునిచ్చారు.


అయితే, ఓలి రాజీనామా, సైన్య సూచనలు, మంత్రుల రాజీనామాలు, యువత ఒత్తిడి కారణంగా జరిగింది. ఇది నేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి దారి తీస్తుందా? లేదా మరో అస్థిరతకు దారితీస్తుందా? అనేది చూడాలి. మరోపక్క దేశవ్యాప్తంగా కర్ఫ్యూ, సైన్య మోహరింపు మధ్య పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.

Nepal-PM.jpg


Zen-Z-Nepal.jpg

Updated Date - Sep 09 , 2025 | 03:31 PM