Modi-Japan Tour: జపాన్ పర్యటన.. టోక్యోకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ABN, Publish Date - Aug 29 , 2025 | 08:36 AM
జపాన్-భారత్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ టోక్యోకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన జపాన్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఇరు దేశాల వార్షిక సమావేశంలో జపాన్ ప్రధానితో కలిసి పాల్గొంటారు. సెమీ కండక్టర్, బుల్లెట్ రైళ్ల తయారీ తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ పర్యటకు బయలుదేరిన భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాజధాని టోక్యోకు చేరుకున్నారు. దాదాపు ఏడేళ్ల తరువాత ప్రధాని ప్రత్యేకంగా జపాన్‌లో పర్యటిస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇరు దేశాల మధ్య సహకారం పెంపొందించేందుకు ప్రధాని ఈ పర్యటన చేపట్టారు. 15వ భారత్-జపాన్ వార్షిక సమావేశంలో జపాన్ ప్రధాని షిగెరూ ఇషిబాతో కలిసి ప్రధాని మోదీ పాల్గొంటారు. అమెరికాతో వాణిజ్య పరమైన ఉద్రిక్తతల నడుమ ప్రధాని మోదీ చేపడుతున్న ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
టోక్యో చేరుకున్న ప్రధానికి భారత్, జపాన్ రాయబారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎన్నారైలు మువ్వన్నెల జెండాతో మోదీకి ఆహ్వానం పలికేందుకు ఎయిర్‌పోర్టుకు విచ్చేశారు. టోక్యోలో దిగాక మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధాని ఇషిబాతో సమావేశమయ్యేందుకు ఉత్సుకతతో ఉన్నానని అన్నారు. ప్రధాని ఇషిబా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జపాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు.. ద్వైపాక్షిక అంశాలతో పాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో సుస్థిర శాంతి స్థాపనకు చర్యలపై చర్చిస్తారని జపాన్‌లో భారత రాయబారి సిబి జార్జ్ తెలిపారు. ట్రంప్ వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భౌగోళిక రాజకీయ ఆర్థిక అంశాలు కూడా చర్చకు రానున్నట్టు చెప్పారు. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య బుల్లెట్ రైలు తయారీ, సెమీ కండెక్టర్ రంగాలకు సంబంధించి ఒప్పందాలను ప్రకటించనున్నారు.
ఇక నేడు ప్రధాని మోదీ ఉదయం 10.30 - 11.00 మధ్య జపాన్, భారత్ వ్యాపార రంగ ప్రతినిధులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం బలోపేతం, పెట్టుబడులు, సాంకేతికత బదిలీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. భారత్‌లో బుల్లెట్ రైలు తయారీకి సంబంధించి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. వ్యాపార వర్గాలతో సమావేశం అనంతరం ప్రధాని జపాన్ ప్రముఖులతో సమావేశమవుతారు. ఆ తరువాత ప్రముఖ జెన్ బౌద్ధ ఆలయాన్ని సందర్శించిన అనంతరం 2.30 గంటల 5.15 గంటల మధ్య భారత్-జపాన్ వార్షిక సమావేశంలో పాల్గొంటారు. ఇక జపాన్ పర్యటన తరువాత మోదీ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు చైనాకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకూ ప్రధాని మోదీ చైనాలో పర్యటిస్తారు.
ఇవి కూడా చదవండి:
భారత్‌పై అక్కసు.. శ్వేతసౌధం సలహాదారు షాకింగ్ కామెంట్స్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 29 , 2025 | 08:49 AM