Indias Russian Oil Imports: రష్యా నుంచి పెరిగిన చమురు కొనుగోళ్లు
ABN, Publish Date - Aug 16 , 2025 | 02:43 AM
రష్యా నుంచి ముడిచమురును కొంటున్నందుకు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల కొరడా ఝళిపించినా మన దేశం మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. రష్యా చమురు కొనుగోళ్లను ఎప్పటిలాగే కొనసాగిస్తోంది. ...
రోజుకు 20 లక్షల బ్యారెళ్లకు పెరుగుదల
న్యూఢిల్లీ, ఆగస్టు 15: రష్యా నుంచి ముడిచమురును కొంటున్నందుకు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల కొరడా ఝళిపించినా మన దేశం మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. రష్యా చమురు కొనుగోళ్లను ఎప్పటిలాగే కొనసాగిస్తోంది. పైగా రష్యా ఆయిల్‌ను భారత్ కొనడం ఈ నెలలో కాస్త ఎక్కువైంది. ఆగస్టులో రష్యా చమురు కొనుగోళ్లు రోజుకు 20 లక్షల బ్యారెళ్లకు పెరిగాయి. ఈ నెల ప్రథమార్ధంలో రోజుకు దాదాపు 52 లక్షల బ్యారెళ్ల ముడిచమురును దిగుమతి చేసుకోగా ఇందులో 38 శాతం రష్యా నుంచే వచ్చినట్టు గ్లోబల్ రియల్ టైమ్ డేటా, అనలిటిక్స్ ప్రొవైడర్ కెప్లర్ చెబుతోంది. రష్యా నుంచి చమురు దిగుమతులు జూలైలో రోజుకు 16 లక్షల బ్యారెళ్లు ఉండగా.. ఈ నెలలో 20 లక్షల బ్యారెళ్లకు పెరిగాయి. జూలైలో ఇరాక్ నుంచి కొనుగోళ్లు రోజుకు 9.07 లక్షల బ్యారెళ్లు ఉండగా.. ఆగస్టులో 7.30 లక్షల బ్యారెళ్లకు తగ్గాయి. అలాగే సౌదీ అరేబియా నుంచి కొనుగోళ్లు రోజుకు 7 లక్షల బ్యారెళ్ల (జూలై) నుంచి 5.26 లక్షల బ్యారెళ్లకు తగ్గాయి. రోజుకు 2.64 లక్షల బ్యారెళ్లతో అమెరికా ఐదో అతిపెద్ద సరఫరాదారుగా ఉందని కెప్లర్ పేర్కొంది. జూలై చివర్లో ట్రంప్ యంత్రాంగం సుంకాల ప్రకటన చేసినప్పటికీ ఆగస్టులో ఇప్పటి వరకు భారత్‌లోకి రష్యా ముడిచమురు దిగుమతులు నిలకడగానే ఉన్నాయని తెలిపింది. అయితే ఆగస్టులో వచ్చిన చమురు జూన్, జూలై నెల ప్రారంభ కొనుగోళ్లకు సంబంధించినవని వివరించింది. సుంకాలు, చెల్లింపు సమస్యలతో దిగుమతుల్లో మార్పు సెప్టెంబరు చివర్లో, అక్టోబరులో కనిపించడం ప్రారంభమవుతుందని అభిప్రాయపడింది. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారు, దిగుమతిదారుగా ఉంది.
Updated Date - Aug 16 , 2025 | 02:43 AM