Indian American Leaders : న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ
ABN, Publish Date - Nov 06 , 2025 | 05:31 AM
అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్‌గా భారత సంతతి అమెరికన్ జోహ్రాన్ మమ్దానీ ఘన విజయం సాధించారు.
డెమొక్రాట్ అభ్యర్థి ఘన విజయం
భారత అమెరికన్ దర్శకురాలు మీరానాయర్ కుమారుడే
మరో 2 చోట్లా భారతసంతతి వ్యక్తుల గెలుపు
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా హష్మి
హైదరాబాద్‌లో పుట్టి.. నాలుగున్నరేళ్ల వయస్సులో యూఎస్ వెళ్లిన గజాలా
సిన్సినాటి పట్టణ మేయర్‌గా పంజాబీ ఆఫ్తాబ్
మమ్దానీ గెలుపుతో ట్రంప్‌కు ఎదురుదెబ్బ
స్థానిక ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ ఆధిపత్యం
బ్యాలెట్ పేపర్‌పై నా ఫొటో లేకే ఓటమి: ట్రంప్
‘ట్రంప్.. సౌండ్ పెంచుకుని చూడు’ అంటూ మమ్దానీ ప్రసంగం
గజాలా హష్మి
న్యూయార్క్/వాషింగ్టన్, నవంబరు 5: అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్‌గా భారత సంతతి అమెరికన్ జోహ్రాన్ మమ్దానీ ఘన విజయం సాధించారు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి అయిన మమ్దానీని ఓడించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడం గమనార్హం. 34 ఏళ్ల మమ్దానీ న్యూయార్క్ నగర మేయర్ అయిన అతిపిన్న వయస్కుడిగా, తొలి భారతీయ అమెరికన్ ముస్లింగా, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా రికార్డులు సృష్టించారు. జనవరి 1న మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మరో భారతీయ అమెరికన్ ముస్లిం గజాలా హష్మి వర్జినియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా, భారతీయ అమెరికన్ పంజాబీ ఆఫ్తాబ్ కర్మసింగ్ పురేవల్ సిన్సినాటి పట్టణ మేయర్‌గా విజ యం సాధించారు. ముగ్గురూ డెమొక్రాట్ పార్టీ తరఫునే గెలవడం విశేషం. న్యూయార్క్‌తోపాటు న్యూజె ర్సీ, వర్జీనియా, సిన్సినాటిలలో జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్లే విజయం సాధించడంపై ఆ పార్టీకి చెందిన అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, ఒబామా హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరి న్ని పెద్ద విజయాలు సాధిస్తామని ప్రకటించారు.
ట్రంప్‌ను ఎండగడుతూ..
జోహ్రాన్ మమ్దానీ తల్లి ప్రముఖ భారతీయ అమెరికన్ దర్శకురాలు మీరా నాయర్, తండ్రి ఉగాండాలో స్థిరపడిన గుజరాతీ ముస్లిం మహమ్మద్ మమ్దానీ. ఉగాండాలోనే 1991లో జన్మించిన జోహ్రాన్ మమ్దానీ తల్లిదండ్రులతో కలిసి ఏడేళ్ల వయసులో అమెరికాకు వచ్చారు. సామ్యవాదాన్ని అనుసరిస్తానని చెప్పే జోహ్రాన్ మమ్దానీ.. న్యూయార్క్ నగరంలో పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమమే లక్ష్యమని ప్రకటించారు. న్యూయార్క్ నగరంలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తానని ప్రకటించారు. నెలల పిల్లల నుంచి ఐదేళ్ల వయస్సు ఉన్న పిల్లల ఆలనాపాలనా చూసుకునేందుకు ఉచిత చైల్డ్ డే కేర్ సెంటర్లు ప్రారంభిస్తానని మరో హామీ ఇచ్చారు. సంపన్నులపై, కార్పొరేట్ సంస్థలపై పన్నులు పెంచుతానని.. ఇళ్ల అద్దెలపై నియంత్రణ విధిస్తానని హామీనిచ్చి పేదలను ఆకట్టుకున్నారు. అదే సమయంలో ట్రంప్ అమలు చేస్తున్న వలస వ్యతిరేక విధానాలను జోహ్రాన్ విపరీతంగా ఎండగట్టారు.
నిధులు ఇవ్వనని ట్రంప్ బెదిరించినా..
న్యూయార్క్‌లో డెమొక్రాట్ పార్టీకి బలం ఎక్కువగా ఉండటంతో.. మమ్దానీ గెలిచే అవకాశం ఉందని ముందునుంచే అంచనాలు వెలువడ్డాయి. దీనితో న్యూయార్క్‌కు చెందిన ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి, రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివా తరఫున ప్రచారం చేశారు. మమ్దానీ గెలిస్తే న్యూయా ర్క్ నగరానికి అందే ఫెడరల్ (కేంద్ర) నిధుల్లో కోతపెడతానని హెచ్చరించారు. గతంలో గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఖండించిన మమ్దానీని యూదు వ్యతిరేకుడని ట్రంప్ ప్రచారం చేశారు. న్యూయార్క్‌లో యూదు జనాభా గణనీయంగా ఉన్న నేపథ్యంలో.. మమ్దానీకి మద్దతు ఇచ్చే యూదులు మూర్ఖులని వ్యాఖ్యానించారు. అయినా మమ్దానీకే మద్దతు లభించింది. కాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడంపై ట్రంప్ స్పందించారు. బ్యాలెట్ పేపర్‌పై తన ఫొటో లేకపోవడం, బడ్జెట్ ఆమోదం పొందక ప్రభుత్వ ప్రతిష్ఠంభన కొనసాగుతుండటమే ఓటమికి కారణాలని పేర్కొన్నారు.
నెహ్రూ సూక్తులు.. ట్రంప్‌కు సవాళ్లు!
న్యూయార్క్ మేయర్‌గా విజయం సాధించిన తర్వాత జోహ్రాన్ మమ్దానీ ఆవేశంగా, ఉద్వేగంగా ప్రసంగించారు. తన భార్య రమా దువాజి, తల్లిదండ్రులు పక్కన ఉండగా, వేదికపై 25 నిమిషాల పాటు మాట్లాడారు. న్యూయార్క్ ఎన్నిక ఫలితాలు కొత్త తరహా రాజకీయాలకు నాంది పలికాయని చెప్పారు. భారత ప్రథమ ప్రధాని నెహ్రూ మాటలను గుర్తుచేసుకుంటూ.. ‘‘చరిత్రలో అరుదుగా ఇలాంటి సందర్భాలు వస్తాయి. ఒక శకం ముగిసినప్పుడు.. పాతశకాన్ని వదిలి కొత్త శకాన్ని అనుసరించినప్పుడు.. సుదీర్ఘంగా అణచివేతకు గురైన జాతి గళం విప్పినప్పుడు.. ఇలాంటి క్షణాలు వస్తాయి. ఇప్పుడు మనం ఒక నవ శకంలోకి అడుగుపెడుతున్నాం’’ అని పేర్కొన్నారు. వలసవాదులకు తాను అండగా నిలిచిపోరాడుతానని ప్రకటించారు. అదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్‌కు సవాళ్లు విసిరారు. ‘‘ట్రంప్.. మీరు ఇది చూస్తున్నారని నాకు తెలుసు. సౌండ్ పెంచుకుని నా మాటలు వినండి. దేశాన్ని వంచించిన ట్రంప్‌ను ఎలా ఓడించాలన్న దానిని ఆయన పెరిగిన న్యూయార్క్ చేసి చూపించింది. ఒక నియంతను అతనికి అధికారాన్ని అందించిన పరిస్థితులను మార్చడంతోనే భయపెట్టగలం. ఇది ట్రంప్‌ను ఆపేందుకు మాత్రమే కాదు. ఆయనలా తర్వాత వచ్చే వారిని ఆపేందుకు కూడా.. ట్రంప్ వంటి బిలియనీర్లు పన్నులను తప్పించుకునేందుకు, రాయితీలను అక్రమంగా పొందేందుకు వీలు కల్పించే అవినీతి సంస్కృతికి ముగింపు పలుకుతాం. వలసదారులకు, కార్మికులకు అండగా నిలుస్తాం. వలసవాదులు నిర్మించిన, వలసదారులు నడిపిస్తున్న నగరంగా న్యూయార్క్ ఉంటుంది. మీరు వలసదారులు కావొచ్చు, ట్రంప్ ఉద్యోగాల్లోంచి తొలగించిన నల్లజాతి మహిళలైనా, కనీస అవసరాలు తీర్చుకునేందుకు అల్లాడుతున్న తోడులేని తల్లి అయినా.. మీ సమస్య ఇప్పుడు మా సమస్య కూడా. ఇకపై ఇది ఇస్లామోఫోబియాను రాజకీయ ఆయుధంగా వాడుకునేవారి ప్రాంతం కాదు. పది లక్షలకుపైగా ముస్లింలు ఉన్న ఈ ప్రాంతం పాలనలోనూ వారికి చోటు ఉందని తెలుసుకుంటారు. అధ్యక్షుడు ట్రంప్ శ్రద్ధగా వినండి. మీరు మాలో ఎవరినైనా ఏమైనా చేయాలి అంటే.. ముందు మా అందరినీ దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది’’ అని జోహ్రాన్ మమ్దానీ పేర్కొన్నారు. స్థానికులతోపాటు దేశ విదేశాల నుంచి వచ్చిన వలసదారులకు ధన్యవాదాలు తెలిపారు.
టిబెట్ తల్లి.. పంజాబీ తండ్రి..
ఆఫ్తాబ్ కర్మసింగ్ పురేవాల్ కూడా చిన్న వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చినవారే. ఆయన తల్లి చైనా ఆక్రమణ సమయంలో టిబెట్ నుంచి భారత్‌కు శరణార్థిగా వచ్చారు. భారత్‌లోనే చదువుకున్నారు. పంజాబీ వ్యక్తి పురేవాల్‌ను వివాహం చేసుకున్నారు. కర్మసింగ్ జన్మించిన తర్వా త కొన్నేళ్లకు ఆ కుటుంబం అమెరికాలోని ఓహియోకు వెళ్లి స్థిరపడింది. అమెరికాలో తమ కుమారుడి జీవితం ఉజ్వలంగా ఉండాలన్న ఆకాంక్షతో ఆఫ్తాబ్ అని పేరుపెట్టారు. పర్షియన్‌లో ఆ పదానికి ‘సూర్యకాంతి’ అని అర్థం. పొలిటికల్ సైన్స్, న్యాయశాస్త్రం చదివిన ఆఫ్తాబ్ పురేవాల్.. 2021లోనే సిన్సినాటి పట్టణ మేయర్‌గా ఎన్నికయ్యారు. తాజాగా రిపబ్లికన్ అభ్యర్థి కోరీ బోమాన్‌పై విజయం సాధించారు.
ప్రఖ్యాత దర్శకురాలు మీరా నాయర్ కుమారుడే..
న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. 1957లో ఒడి సాలో అమృత్‌లాల్ నాయర్ (ఐఏఎస్), ప్రవీణ్ నాయర్ దంపతులకు జన్మించారు. పాఠశాల విద్య ఇక్కడే చదివిన ఆమె.. అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీలో స్కాలర్‌షిప్ సాధించి ‘విజువల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్’ స్టడీ్‌సలో గ్రాడ్యుయేషన్ చేశారు. 1977లో ఫొటోగ్రాఫర్ మిచ్ ఎప్‌స్టైన్‌తో వివాహమైనా, కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. తర్వాత భారత్‌లో జన్మించి ఉగాండాలో స్థిరపడిన మహ్మద్ మమ్దానీని పెళ్లి చేసుకున్నారు. వారికి 1991లో జోహ్రాన్ పుట్టారు. మీరా నాయర్ తొలి చిత్రం ‘సలామ్ బాంబే’ 1988లో విడుదలైంది. వీధి బాలల జీవితాన్ని హృద్యంగా ఆవిష్కరించిన ఆ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయింది కూడా. ఆ తర్వాత 1991లో ఇండో అమెరికన్ అమ్మాయి, ఆఫ్రికన్ అబ్బాయి ప్రేమకథతో ‘మిస్సిస్సిప్పీ మసాలా’ చిత్రం తీశారు. 2001లో ఆమె రూ పొందించిన ‘మాన్‌సూన్ వెడ్డింగ్’ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు, అవార్డులు దక్కించుకుంది. మమ్దానీ న్యూయార్క్ మేయర్ అయ్యారని తెలియగానే హాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి.
Updated Date - Nov 06 , 2025 | 05:32 AM