UK Indian Goods Tariff Free: బ్రిటన్‌లో సుంకాల్లేవ్
ABN, Publish Date - Jul 25 , 2025 | 02:45 AM
భారత్ బ్రిటన్ మధ్య వాణిజ్యానికి సంబంధించి చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది.
99% భారత ఉత్పత్తులకు సుంకాల నుంచి మినహాయింపు!
భారత్-బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం
మోదీ, స్టార్మర్ సమక్షంలో సంతకాలు
ఇక బ్రిటన్ విస్కీ, కార్లు, చాక్లెట్లు మన దగ్గర చౌకగా అందుబాటులోకి..
ఒప్పందంతో ఇరుదేశాల మధ్య ఏటా రూ.2.94 లక్షల కోట్ల వ్యాపారం!
సరికొత్త అధ్యాయాన్ని లిఖించాం
భారత యువత, రైతులు, ఎంఎస్ఎంఈలకు లబ్ధి: మోదీ
ఇరు దేశాల్లో ఉద్యోగాలకు, వ్యాపారాలకు లాభం: స్టార్మర్
రానున్న మూడేళ్లలో బ్రిటన్‌కు భారత వ్యవసాయ ఎగుమతుల్లో 20% వృద్ధి!
లండన్, జూలై 24: భారత్-బ్రిటన్ మధ్య వాణిజ్యానికి సంబంధించి చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఇరుదేశాలు ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. ‘సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ)’ పేరిట రూపొందించిన ఈ ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో గురువారం ఇరుదేశాల వాణిజ్య శాఖల మంత్రులు పీయూష్ గోయెల్, జోనాథన్ రెనాల్డ్స్ సంతకాలు చేశారు. లండన్‌లోని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ అధికారిక నివాసంలో ఈ ఒప్పందం జరిగింది. దీని ద్వారా భారత్-బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతోపాటు ఇరు దేశాల మధ్య ఏటా దాదాపు రూ.2.94 లక్షల కోట్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2030నాటికి ఇది రూ.9.75 లక్షల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2020లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్రిటన్ చేసుకున్న భారీ వాణిజ్య ఒప్పం దం ఇదేకావడం గమనార్హం. మూడేళ్లు చర్చలు జరిగిన తర్వాత ఇరుదేశాలు సీఈటీఏపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో భారత్‌కు చెందిన అన్ని రకాల వస్తువులకు బ్రిటన్ మార్కెట్‌లో ప్రవేశం దక్కడమే గాక, సుంకాల భారం కూడా తప్పనుందని అధికారులు తెలిపారు. 99 శాతం భారతీయ ఉత్పత్తులకు యూకే మార్కెట్‌లో సుంకాలు ఉండవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంయుక్త విలేకరుల సమావేశంలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ మాట్లాడుతూ.. ‘‘ఇరు దేశాలకు ఇదో చరిత్రాత్మక దినం. పరస్పర చిత్తశుద్ధికి నిదర్శనం.ఇలాంటి శుభసందర్భంలో మీకు స్వాగతం పలకడం నాకెంతో సంతోషంగా ఉంది’’ అని మోదీకి అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్-బ్రిటన్‌లు సహజ భాగస్వాములని చెప్పారు. ఇరుదేశాలు చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయన్నారు. తాజా ఒప్పందంతో భారతీయ దుస్తులు, పాదరక్షలు, వజ్రాలు, ఆభరణాలు, సముద్ర ఆహారోత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులకు యూకే మార్కెట్‌లో మరింత చోటు లభించనుందని పేర్కొన్నారు. ‘‘ఈ ఒప్పందం ప్రత్యేకించి భారత యువత, రైతులు, మత్స్యకారులతోపాటు ఎంఎ్‌సఎంఈ రంగానికి లబ్ధి చేకూర్చుతుంది. అదే సమయంలో యూకేలో తయారయ్యే వైద్య పరికరాలు, ఏరోస్పేస్ విడిభాగాలువంటి ఉత్పత్తులు భారతీయులకు అందుబాటు ధరల్లో లభిస్తాయి’’ అని మోదీ చెప్పారు. ‘‘భారత్-బ్రిటన్ భాగస్వామ్యంలో విజన్-2035 లక్ష్యంగా సాగుతున్నాం. ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల్లో కలిసి సాగుతాం. బ్రిటన్, భారత్ భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కనుంది.
ఆరు బ్రిటన్ యూనివర్సిటీలు భారత్‌లో క్యాంప్‌సలు ఏర్పాటు చేస్తున్నాయి. ఆర్థిక, సాంకేతిక రంగాల్లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించాం’’ అని మోదీ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బ్రిట న్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. బ్రిటిష్ గడ్డపై ఖలిస్థానీ అనుకూల శక్తులు పెరుగుతున్న నేపథ్యం లో ప్రధాని పరోక్షంగా వారికి చురకలంటించారు. ప్రపంచదేశాల మధ్య శాంతిని నెలకొల్పే విషయంలో భారత్-బ్రిటన్‌లు కలిసి ముందుకు సాగుతాయని మోదీ చెప్పారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన బ్రిటన్ పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్టార్మర్‌ను భారత పర్యటనకు రావాలని ఆహ్వానించారు.
ఇరుదేశాలకు భారీ ప్రయోజనం: స్టార్మర్
వాణిజ్య ఒప్పందంతో బ్రిటన్, భారత్‌కు భారీ ప్రయోజనాలు కలుగుతాయని స్టార్మర్ చెప్పారు. ఈ ఒప్పందం ఉద్యోగాలకు, వ్యాపారాలకు మంచిదని.. సుంకాలు తగ్గిపోతాయని, వాణిజ్యం చౌకగా, వేగంగా, సులభంగా మారుతుందని పేర్కొన్నారు. ఒప్పందం అమల్లోకివస్తే..యూకే ఉత్పత్తులపై భారత్ ప్రస్తుతం విధిస్తున్న సగటు సుంకం 15 నుంచి 3 శాతానికి తగ్గనుందని బ్రిటన్ అధికారులు తెలిపారు. సాఫ్ట్ డ్రింక్స్, చాక్లెట్లు, కాస్మెటిక్స్, కార్లు, వైద్య పరికరాలు వంటివి బ్రిటన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. బ్రిటన్‌లోని విస్కీ తయారీదారులకు భారీగా లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం 150ు ఉన్న సుంకం 75శాతానికి తగ్గనుంది. వచ్చే పదేళ్లలో ఇది 40శాతానికి తగ్గనుందని బ్రిటన్ అధికారులు తెలిపారు. ఈ ఒప్పందం వల్ల విస్కీ, కార్లు, ఇతర ఉత్పత్తులను భారత్‌కు ఎగుమతి చేసే బ్రిటన్ తయారీదారులకు ఎంతోమేలు చేకూరనుంది. భారత్, బ్రిటన్‌లు రక్షణ పారిశ్రామిక రోడ్‌మ్యా్‌పకు ఆమోదం తెలిపాయి.
ఒప్పందంలో కీలక అంశాలు..
భారత్‌కు చెందిన అనేక వ్యవసాయ ఉత్పత్తులకు యూకే మార్కెట్లో పన్నులు ఉండవు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పసుపు, మిరియాలు, యాలకులు, శుద్ధిచేసిన ఆహారం, మామిడి గుజ్జు, పచ్చళ్లు, పప్పులు వంటి వాటికి ఎలాంటి పన్నులూ వేయరు. మఖానా, షాహీలిచి, అరకు కాఫీ, కశ్మీరీ కుంకుమపువ్వు వంటివి యూకే మార్కెట్‌లో మరింత ఎక్కువగా అమ్ముడుపోతాయని, తద్వారా సంబంధిత రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు తెలిపారు. పన్నులు లేకపోవడంవల్ల వచ్చే మూడేళ్లలో బ్రిటన్‌కు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 20శాతం పెరుగుతాయని అంచనా. డెయిరీ ఉత్పత్తులు, వంట నూనెలు, యాపిల్‌లను ఈ ఒప్పందం నుంచి మినహాయించారు. ఓట్స్‌కూ పన్ను రాయితీలు లేవు. ఫార్మా, రసాయనాలు, ప్లాస్టిక్స్, క్రీడా ఉత్పత్తులు, బొమ్మలు, వజ్రాలు, ఆభరణాలు, తోలు ఉత్పత్తులు వంటి వాటికీ భారీగా లబ్ధి చేకూరనుంది.
Updated Date - Jul 25 , 2025 | 02:45 AM