Afghanistan Earthquake: అప్ఘానిస్థాన్‌లో భూకంపం.. బాధితులకు అండగా ఉంటామన్న భారత్
ABN, Publish Date - Sep 01 , 2025 | 09:48 PM
అప్ఘానిస్థాన్‌లో భూకంప బాధితులకు భారత్ మానవతా సాయాన్ని పంపించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అప్థానిస్థాన్‌లో భూకంపం కారణంగా భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ విపత్తుపై భారత్ విచారం వ్యక్తం చేసింది. క్షతగాత్రులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని పేర్కొంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అప్ఘానిస్థాన్‌కు ఎక్స్ వేదికగా సంఘీభావం తెలిపారు. బాధితులకు మానవతాసాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
జలాలాబాద్‌కు సమీపంలో ఆదివారం భూకంపం సంభవించింది. భూప్రకంపనల కారణంగా కునార్ ప్రావిన్స్, నన్గర్‌హార్ ప్రావిన్స్ అతలాకుతలమయ్యాయి. ఈ విపత్తుకు 800 మంది బలయ్యారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. 2500 మంది గాయాలపాలయ్యారని అన్నారు. కునార్ ప్రావిన్స్‌లోనే ఎక్కువ ప్రాణనష్టం జరిగిందని అన్నారు.
అప్ఘానిస్థాన్‌కు భారత్ మానవతా సాయం పంపించడం ప్రారంభించిందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అప్ఘానిస్థాన్ విదేశాంగ మంత్రితో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిపారు. వెయ్యి టెంట్స్‌ను కాబూల్‌కు పంపించిన విషయాన్ని చెప్పానని అన్నారు. మరో 15 టన్నుల ఆహార పదార్థాలను కూడా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిపారు. మంగళవారం వీటిని పంపిస్తామని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో అప్ఘానిస్థాన్‌కు భారత్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రెక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత కలిగిన ఈ భూకంపం కారణంగా అప్ఘానిస్థాన్‌లో పలు గ్రామాల్లో నివాసాలు నేలమట్టమయ్యాయి. చిన్నారులు సహా అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. అక్కడి ఇళ్లు అన్నీ మట్టి చెక్కతో నిర్మించి ఉండటంతో విధ్వంసం మరింత తీవ్రమైంది. అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. స్థానికులు, విపత్తు నిర్వహణ బృందాలు, మిలిటరీ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
భారత్ ఇప్పటికే చాలా ఆలస్యం చేసింది: డొనాల్డ్ ట్రంప్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 01 , 2025 | 09:57 PM