Donald Trump: భారత్ ఇప్పటికే చాలా ఆలస్యం చేసింది: డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Sep 01 , 2025 | 09:14 PM
భారత్ అమెరికాపై సుంకాలను పూర్తిగా తగ్గించేందుకు ముందుకొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇప్పటికే భారత్ చాలా ఆలస్యం చేసిందని కామెంట్ చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఈ మేరకు పోస్టు పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను మరోసారి టార్గెట్ చేసుకున్నారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో తన అక్కసును వెళ్లగక్కారు.
‘చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే.. భారత్ అమెరికాకు భారీగా ఉత్పత్తులు విక్రయిస్తుంది. మనం వాళ్లకు అతి పెద్ద క్లయింట్. కానీ మన ఉత్పత్తులను మాత్రం వారికి చాలా తక్కువగా ఎగుమతి చేస్తాము. ఇది చాలా ఏకపక్ష సంబంధం. కొన్ని దశాబ్దాలుగా పరిస్థితి ఇలాగే ఉంది. భారత్ మనపై అత్యధిక సుంకాలు విధిస్తోంది. ఫలితంగా మన వ్యాపార సంస్థలు అక్కడ తమ ఉత్పత్తులను విక్రయించలేకపోతున్నాయి. ఇది మనకు పెద్ద విపత్తు. ఇదిలా ఉంటే.. భారత్ మాత్రం రష్యా నుంచి మిలిటరీ ఉత్పత్తులు, చమురును కొనుగోలు చేస్తుంది. మన నుంచి మాత్రం చాలా తక్కువగా దిగుమతి చేసుకుంటోంది. అమెరికాపై సుంకాలను దాదాపు పూర్తిగా తగ్గిస్తామని వాళ్లు ఆఫర్ చేశారు. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కొన్నేళ్ల క్రితమే వాళ్లు ఇలా చేసుండాలి. జనాలు ఆలోచించేందుకు ఈ విషయాలను పంచుకుంటున్నా’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఈ పోస్టు పెట్టారు.
వాణిజ్య లోటు పేరిట అమెరికా తొలుత భారత్‌పై 25 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు పెనాల్టీగా మరో 25 శాతం సుంకం విధించింది. ఆగస్టు 27 నుంచి మొత్తం 50 శాతం సుంకం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. మరోవైపు, భారత్ మాత్రం అమెరికా వాదనలను కొట్టిపారేస్తోంది. చైనా చమురు కొనుగోళ్లతో పోలిస్తే భారత కొనుగోళ్లు చాలా తక్కువని చెబుతోంది. భారత రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడలేనని ప్రధాని మోదీ కూడా ఇటీవల స్పష్టం చేశారు. ఈ ఉద్రికత్తల నేపథ్యంలో చైనాలో జరుగుతున్న షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా సమావేశమయ్యారు.
ఇవి కూడా చదవండి:
భారత పర్యటనను ట్రంప్ రద్దు చేసుకున్నారా.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి