US remittance tax: లక్షకు ఐదు వేలు
ABN, Publish Date - May 17 , 2025 | 05:02 AM
అమెరికాలో ప్రవాస భారతీయుల నగదు బదిలీలపై 5% పన్ను విధించే ప్రతిపాదిత బిల్లు తీవ్ర చర్చలకు గురైంది. ఇది అమలవితే భారతదేశానికి వచ్చే రిమిటెన్స్ తగ్గి రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
అమెరికా నుంచి డబ్బు పంపితే ఇకపై పన్ను బాదుడే
విదేశాలకు నగదు బదిలీలపై 5ు పన్ను విధిస్తూ బిల్లు
తిరస్కరించిన ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ
సవరణలు చేసి మళ్లీ ప్రవేశపెడతామన్న స్పీకర్
బిల్లు అమలైతే ప్రవాస భారతీయులకు భారమే
ప్రస్తుతం అమెరికాలో 45 లక్షల మంది భారతీయులు
కొత్త పన్నుతో వీరిపై రూ.13,688 కోట్ల మేర భారం
అమెరికా నుంచి దేశంలోకి తగ్గనున్న నగదు బదిలీలు
భారత రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ, మే 16: అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు అక్కడి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. అమెరికా నుంచి ఇతర దేశాలకు జరిగే నగదు బదిలీలపై 5 శాతం పన్ను వసూలు చేసేందుకు వీలుగా ‘‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పేరిట బిల్లును తీసుకొచ్చింది. అయితే, ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు 21-16 ఓట్ల తేడాతో వ్యతిరేకించింది. అయిదుగురు రిపబ్లికన్లు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. దాంతో సవరణలు చేసి బిల్లును తిరిగి ప్రతినిధుల సభలో ప్రవేశపెడతామని స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపారు. ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే .. అమెరికాలో సంపాదించిన డబ్బును.. వేరే దేశాల్లో ఉన్న తమ వారికి పంపే విదేశీయులు పన్నుల రూపంలో భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిపాదిత విధానం ప్రకారం.. అమెరికాలో ఉన్న భారతీయులు.. స్వదేశంలో ఉన్న తమ వారికి 1160 డాలర్లు అనగా దాదాపు రూ.లక్ష పంపిస్తే అందులో ఐదు శాతం.. రూ.5000ను పన్నుగా చెల్లించాలి. ఈ పన్నును నగదు బదిలీ సేవలను అందించే వెస్ట్రన్ యూనియన్, మనీగ్రామ్ లేదా అమెరికా ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకులు వసూలు చేస్తాయి. హెచ్-1బీ, ఎఫ్-1 లేదా జే-1 తదితర వీసాదారులు, గ్రీన్ కార్డుదారులు, తగిన గుర్తింపు పత్రాలు లేనివారు నగదు బదిలీలు చేసినప్పుడు ఈ పన్ను చెల్లించాల్సిందే.
గుర్తింపు పొందిన అమెరికా పౌరులకు మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. పౌరసత్వ నిర్ధారణ సదుపాయం ఉండి ప్రభుత్వ గుర్తింపు కలిగిన సర్వీస్ ప్రొవైడర్ ద్వారానగదు బదిలీ చేస్తేనే వారికి కూడా మినహాయింపు లభిస్తుంది. కాగా, ఈ నూతన విధానం అమలులోకి వస్తే ప్రవాస భారతీయులపైన, భారత రియల్ ఎస్టేట్ రంగంపైనా ప్రభావం చూపనుంది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 2023-24లో భారతదేశానికి విదేశాల నుంచి 118.7 బిలియన్ డాలర్ల మేర నగదు బదిలీలు జరిగాయి. ఇందులో 32 బిలియన్ డాలర్లు.. 28 శాతానికి పైగా మొత్తం అమెరికా నుంచి వచ్చినవే. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం దాదాపు 45 లక్షల మంది భారతీయులు(ఇందులో 32 లక్షల మంది భారత సంతతి వారు) అమెరికాలో ఉన్నారు. వీరంతా భారత్‌లోని తమ కుటుంబసభ్యులకు గృహ, విద్య, వైద్య అవసరాలకు, పెట్టుబడులు పెట్టేందుకు డబ్బు పంపిస్తుంటారు. ఎప్పట్లానే వీరు నగదు బదిలీలు కొనసాగిస్తే 5 శాతం పన్ను నిబంధన కింద వీరంతా 1.6 బిలియన్ డాలర్లు నష్టపోనున్నారు.
దీంతో నూతన పన్ను విధానం అమలులోకి వస్తే అమెరికా నుంచి భారత్‌కు జరిగే నగదు బదిలీలు తగ్గుతాయి. ఇది భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులపై ప్రభావం చూపనుంది. విదేశాల్లో ఉన్న తమ వారు పంపే డబ్బును భారత్‌లో చాలామంది ముంబై, హైదరాబాద్, కొచ్చి తదితర నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెడుతుంటారు. అనరాక్స్ 2024 వార్షిక రెసిడెన్షియల్ నివేదిక ప్రకారం.. కొత్త హౌసింగ్ ప్రాజెక్టుల్లో న్యూఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని 59 శాతం, హైదరాబాద్‌లో 18 శాతం, ముంబై మెట్రోపాలిటిన్ రిజీయన్‌లో 12 శాతం విలాసవంతమైన ఇళ్ల ధరలు రూ.2.5 కోట్లకు పైగానే పలుకుతున్నాయి. ధనిక వర్గాలు ఎక్కువ ఆసక్తికి చూపే ఈ ప్రాజెక్టుల్లో ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులే చాలా కీలకం. అయితే, అమెరికా 5 శాతం పన్ను విధానం అమలు చేస్తే ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులు తగ్గుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News
Updated Date - May 17 , 2025 | 07:30 AM