H-1b: వీసా ఫీజు పెంపు.. కాలిఫోర్నియాలో బెంబేలెత్తిస్తున్న టీచర్ల కొరత
ABN, Publish Date - Dec 22 , 2025 | 10:29 AM
హెచ్-1బీ వీసా ఫీజు పెంపుతో కాలిఫోర్నియాలో టీచర్లకు కొరత ఏర్పడింది. దీంతో, అక్కడి స్కూలు యాజమాన్యాలు ట్రంప్ ప్రభుత్వంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఇప్పటికే కాలిఫోర్నియా ప్రభుత్వం న్యాయ పోరాటం కూడా ప్రారంభించింది.
ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా అనగానే ముందుగా గుర్తొచ్చేది ఐటీ ఉద్యోగులు, డాక్టర్లే. కానీ ట్రంప్ హెచ్-1బీ వీసా ఆంక్షల కారణంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో టీచర్‌లకు కొరత మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. దీంతో, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమెరికా కేంద్ర ప్రభుత్వంపై కోర్టులో కేసు కూడా వేసింది. టెక్సాస్, నార్త్ కెరొలీనా తరువాత అత్యధిక సంఖ్యలో హెచ్-1బీ టీచర్లు కాలిఫోర్నియాలోనే ఉన్నారు (H-1b Visa Fee Hike California Teachers Shortage).
కాలిఫోర్నియా రాష్ట్రం ఇప్పటికే టీచర్ల కొరతతో సతమతం అవుతోంది. ముఖ్యంగా కే-12 స్కూళ్లల్లో టీచర్ల కొరత ఎక్కువగా ఉంది. ఫలితంగా 2023లో అక్కడి ప్రభుత్వం 46,982 పోస్టుల్లో పూర్తిస్థాయి అర్హతలు లేని వారిని నియమించుకోవాల్సి వచ్చింది. ఇంత చేసినా ఆ ఏడాది 22,012 పోస్టుల భర్తీ సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో అక్కడి స్కూళ్లు విదేశీ టీచర్ల వైపు మళ్లుతున్నాయి. ముఖ్యంగా ఫిలిప్పీన్స్, స్పెయిన్, మెక్సికోకు చెందిన టీచర్లకు హెచ్-1బీ వీసాలను స్పాన్సర్ చేసి నియమించుకున్నాయి. ద్విభాష, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లల్లో వీరిని నియమించుకున్నాయి.
అయితే, తాజాగా హెచ్-1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచడంపై కాలిఫోర్నియాలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కొత్త దరఖాస్తులకే ఈ ఫీజు పరిమితమైనా కూడా అనేక మంది విదేశీయులు తమకు వివక్ష, నిరాదరణకు గురవుతున్నామన్న భావన కలుగుతోందని అంటున్నారు. టీచర్స్‌పై ఏకంగా లక్ష ఫీజు భారం మోపడం ఒకరకంగా వివక్షే అని వెస్ట్ కాంట్రా కోస్టా యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లోని ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఒకరు వ్యాఖ్యానించారు. ఐదేళ్ల క్రితం తాను జే-1వీసాతో అమెరికాకు వచ్చి ఆ తరువాత హెచ్-1బీ వీసాకు మారానని చెప్పారు. ఇక తాజా ఫీజు నేపథ్యంలో అనేక మంది విదేశీ టీచర్ల భవిత్యం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 18 రాష్ట్రాలు వేసిన కేసు ఫలితంపై వీరి భవిష్యత్తు ఆధారపడి ఉందని అక్కడి స్కూల్ యాజమాన్యాలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి:
విమర్శలకు వెనక్కుతగ్గిన అమెరికా న్యాయశాఖ.. ట్రంప్ ఫొటోల పునరుద్ధరణ
శ్వేత సౌధం సలహాదారు శ్రీరామ్ కృష్ణన్‌పై ట్రంప్ ప్రశంసలు! అతడు లేకపోతే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 22 , 2025 | 10:50 AM