Virginia Giuffre: వర్జీనియా గియుఫ్రే ఆత్మహత్య
ABN, Publish Date - Apr 26 , 2025 | 10:51 AM
Virginia Giuffre: తీవ్ర లైంగిక వేధింపులకు గురైన వర్జీనియా గియు ఫ్రే ఆత్మహత్య చేసుకొంది. ఆస్ట్రేలియాలోని తన వ్యవసాయ భూమిలో ఈ ఘటనకు ఆమె పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
సిడ్నీ,,ఏప్రిల్ 26: అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్,బ్రిటన్ యువరాజు ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వర్జీనియా గియుఫ్రే (41) ఆత్మహత్య చేసుకొంది. ఆస్ట్రేలియాలోని తన పొలంలో ఈ ఆత్మహత్యకు గియుఫ్రే పాల్పడిందని ఆమె కుటుంబం సభ్యులు వెల్లడించారు. లైంగిక వేధింపులతోపాటు లైంగిక అక్రమ రవాణాకు జీవితాంతం బాధితురాలిగా ఉన్న ఆమె.. చివరకు ఆత్మహత్య చేసుకొందని తెలిపారు.
శుక్రవారం రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకొందన్నారు. లైంగిక వేధింపులు, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా గియుఫ్రే బలమైన గొంతుకను వినిపించారని వారు గుర్తు చేసుకొన్నారు. మరి ముఖ్యంగా ఎప్స్టీన్‌తోపాటు అతడి అనుచరులకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పారు. ఇది ఎప్స్టీన్ బాధితులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. లైంగిక వేధింపులు, లైంగిక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో గియుఫ్రే ఒక యోధురాలని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు.. ఆమెను అభివర్ణించారు.
ఇక ఎప్స్టీన్ సహచరుడు గిస్లైన్ మాక్స్వెల్ దోషిగా నిర్ధారించేందుకు పోలీసులకు సమాచారం అందించడంలో గియుఫ్రే కీలక పాత్ర పోషించారు. అలాగే న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన న్యాయ పోరాటంలో.. యూఎస్ అటర్నీ పలుమార్లు జరిపిన విచారణకు సైతం ఆమె తన సహాయ, సహకారాలు అందించింది.
న్యాయం కోసం సాహసంతో కూడిన పోరాటం
న్యాయం కోసం గియుఫ్రే చిన్ననాటి నుంచి దుర్భరమైన జీవితాన్ని గడిపింది. ఫ్లోరిడాలో పెరిగిన ఆమె.. ఫ్యామిలీ ఫ్రెండ్ చేతిలో లైంగిక వేధింపులకు గురైంది. చివరకు ఆమె వీధుల్లో నివసించేలా చేసింది. ఇక యుక్త వయసులో ఆమె మాక్స్‌వెల్‌ను కలిసింది. అతను 1999 నుంచి 2002 మధ్య ఎప్స్టీన్ చేత లైంగిక వేధింపులకు గురిచేయబడ్డానని ఆరోపించింది. ఎప్స్టీన్ తనను ప్రిన్స్ ఆండ్రు, మోడలింగ్ ఏజెంట్ జీన్-లూక్ బ్రూనెల్ వంటి శక్తివంతమైన వ్యక్తులకు అక్రమ రవాణా చేశాడని గియుఫ్రే ఆరోపించిన విషయం విధితమే.
లైంగిక అక్రమ రవాణా కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఫైనాన్షియర్ ఎప్స్టీన్.. విచారణను ఎదుర్కొంటూ 2019లో ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఎప్స్టీన్ కోసం మైనర్ బాలికలను నియమించడంలో 2021లో దోషిగా తేలిన మాక్స్‌వెల్‌కు సైతం జైలు శిక్ష ఖరారైంది. అయితే గియుఫ్రే 2021లో ప్రిన్స్ ఆండ్రూపై దావా వేసింది. ఆమె తన 17 ఏళ్ల వయసులో తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ అందులో ఆరోపించింది. ఈ ఆరోపణలను ఆండ్రూ తిరస్కరించాడు. కానీ ఈ కేసు చివరకు పరిష్కారమైంది.
మరోవైపు 2021లో గియుఫ్రే ఫ్రాన్స్‌లోని కోర్టులో బ్రూనెల్‌కు వ్యతిరేకంగా ధైర్యంగా సాక్ష్యం చెప్పింది. తనతోపాటు ఇతర బాధితులకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆమెను కోరింది. ఇక ఎప్స్టీన్ అరెస్టుకు ముందు గియుఫ్రే తన భర్త, పిల్లలతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లింది.
ఇవి కూడా చదవండి..
India Vs Pakistan: సరిహద్దు వద్ద పాక్ మళ్లీ కాల్పులు..
Pahalgam Terror Attack: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం
Letter to CM: మావోయిస్టులతో చర్చలకు ముగ్గురు పేర్లు ప్రతిపాదన
For International News And Telugu News
Updated Date - Apr 26 , 2025 | 11:01 AM