US China Trade Tensions: చైనాతో తొలగిన ప్రతిష్టంభన.. శ్వేత సౌధం కీలక ప్రకటన
ABN, Publish Date - Nov 02 , 2025 | 10:37 AM
రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలను నిలుపుదల శ్వేత సౌధం తాజాగా పేర్కొంది. అమెరికా, చైనా అధినేతల మధ్య ఇటీవల కుదిరిన అంగీకారానికి సంబంధించి పలు అంశాలను శనివారం వెల్లడించింది. ఈ ప్రకటనపై చైనా ఇంకా స్పందించాల్సి ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతులపై విధించిన అదనపు ఆంక్షలను చైనా నిలుపుదల చేసిందని అమెరికా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అమెరికా సెమీ కండక్టర్ కంపెనీలపై విచారణను కూడా చైనా నిలిపివేసినట్టు పేర్కొంది. అయితే, ఈ ప్రకటనపై చైనా ఇంకా స్పందించాల్సి ఉంది (China Rare Earth Export Ban Lifted).
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), చైనా అధినేత జీ జిన్‌పింగ్ (Xi jinping) మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలోని కొన్ని కీలక అంశాలను శ్వేత సౌధం వెల్లడించింది. ఈ డీల్ ప్రకారం, గేలియం, జర్మేనియం, యాంటిమొనీ, గ్రాఫైట్ వంటి రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతుల కోసం చైనా సాధారణ లైసెన్సులు జారీ చేస్తుంది. లైసెన్సులకు సంబంధించి గతంలో విధించిన ఆంక్షల అమలును మరో ఏడాది పాటు వాయిదా వేసింది. దీనికి బదులుగా అమెరికా కూడా చైనాపై విధించిన పలు ఆంక్షల అమలును వాయిదా వేయనుంది (US China Trade Deal).
ఈ ఒప్పందం ప్రకారం, ఈ ఏడాది చైనా 12 మిలియన్ మెట్రిక్ టన్నుల అమెరికా సోయాబీన్స్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఆ తరువాత మూడేళ్లల్లో ఏటా కనీసం 25 మిలియన్ మెట్రిక్ టన్నుల సోయాబీన్స్‌ను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది. చైనాలోని డచ్ సంస్థ నెక్స్‌పీరియా బీవీ నుంచి ఎగుమతులకు కూడా అడ్డంకులు తొలగిపోతాయి. ఇక చైనా నుంచి దిగుమతి అయ్యే ఫెంటనైల్ ఆధారిత ఉత్పత్తులపై సుంకాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించేందుకు అమెరికా సైతం అంగీకరించింది. డ్రగ్స్ ఎగుమతులపై చైనా మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటే ఆ 10 శాతం సుంకాన్ని కూడా తొలగిస్తామని డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ప్రకటించారు. తమ నుంచి చైనా చమురు, సహజవాయువును దిగుమతి చేసుకుంటుందని కూడా ట్రంప్ తెలిపారు.
అమెరికా కూడా చైనాపై ప్రతీకార సుంకాల విధింపును ఏడాది పాటు వాయిదా వేసిందని శ్వేత సౌధం తన ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా, చైనాపై అదనంగా విధించిన 100 శాతం సుంకాన్ని కూడా మరో ఏడాది పాటు తాత్కాలికంగా నిలుపుదల చేశామని చెప్పింది. సెక్షన్ 301 కింద కొన్ని చైనా దిగుమతులకు ఇచ్చిన మినహాయింపులను మరో ఏడాది పాటు పొడిగించింది.
ఈ ప్రకటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొంత సద్దుమణిగినప్పటికీ ఇది తాత్కాలిక పరిష్కారమే అని నిపుణులు చెబుతున్నారు. వాణిజ్యానికి సంబంధించిన అనేక అంశాలు ఇరు దేశాల మధ్య అపరిష్కృతంగానే ఉన్నాయని అంటున్నారు. టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను స్థానిక సంస్థల కన్సార్షియం టేకోవర్ చేసేందుకు అమెరికా అనుమతించినా ఈ విక్రయానికి చైనా ఇంకా ఆమోదముద్ర వేయలేదు.
ఇవి కూడా చదవండి:
అమెరికా అధ్యక్షుడికి సారీ చెప్పా.. కెనడా ప్రధాని
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 02 , 2025 | 10:59 AM