Gunmen attack in Peshawar: పాక్‌లో ఆత్మాహుతి దాడి.. పలువురి మృతి
ABN, Publish Date - Nov 24 , 2025 | 11:07 AM
పాక్ పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంపై బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు మృతిచెందారు. దీంతో అధికారులు అప్రమత్తమై పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో గల పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంపై బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. రెండు సార్లు జరిగిన ఈ బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటివరకూ ముగ్గురు కమాండోలు సహా మొత్తం ఆరుగురు మృతిచెందారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు. అయితే.. ఇది ఆత్మాహుతి బాంబు దాడేనని అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.
పెషావర్‌లోని పాక్ పారామిలిటరీ దళాలకు చెందిన ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని సోమవారం ఉదయం సాయుధ బలగాలు బాంబు దాడికి పాల్పడినట్టు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వారు కార్యాలయం ఆవరణలోకి చొరబడి భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గురు కమాండోలతో పాటు దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు చనిపోయారని పేర్కొన్నారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడి రోడ్లను బంద్ చేశారు. ఈ ఘటన అక్కడి భద్రతా చర్యలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతేకాకుండా.. ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.
ఈ దాడి.. పాక్ వ్యాప్తంగా ముఖ్యంగా ఖైబర్ పఖ్తున్ఖ్వా సహా బలూచిస్థాన్‌లలో తీవ్రవాద హింస పెరుగుదలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనూ క్వెట్టాలోని పారామిలిటరీ ప్రధాన కార్యాలయం వెలుపల జరిగిన కారు బాంబు దాడిలో సుమారు 10 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. తాజా ఘటనతో ఆ ప్రాంతంలోనూ భద్రతా చర్యలను పటిష్ఠం చేశారు అక్కడి అధికారులు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ పాక్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో మొత్తం 430 మందికిపైగా మరణించారు. మృతుల్లో అధిక భాగం భద్రతా సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యం
'సింధ్' భారత్‌లోకి రావచ్చన్న రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై పాక్ ఆగ్రహం
Updated Date - Nov 24 , 2025 | 11:21 AM