ALM Fazlur Rahman: భారత ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలి.. బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ ఆధికారి సంచలన వ్యాఖ్య
ABN, Publish Date - May 03 , 2025 | 01:52 PM
పాక్‌పై భారత్ దాడి చేస్తే బంగ్లాదేశ్ చైనాతో కలిసి భారత ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలంటూ బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మాజీ ఆర్మీ అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌పై అక్కసు వెళ్లబోసుకుంటున్న పాక్ నేతలకు తోడుగా బంగ్లాదేశ్ జాతీయులు కూడా వచ్చి చేరుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ అధికారి మేజర్ జనరల్ ఏఎల్ఎమ్ ఫజ్‌లుర్ రహ్మాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్‌పై భారత్ దాడి చేస్తే బంగ్లాదేశ్ భారత ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని సూచించారు. ‘‘భారత్ పాక్‌పై దాడి చేస్తే బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలి. చైనాతో కలిసి సంయుక్తంగా ఈ దాడి చేసేందుకు ఆ దేశంతో చర్చించాలి’’ అని చెప్పుకొచ్చారు. పహల్గాం దాడి తరువాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో ఓ బంగ్లాదేశీ మాజీ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
ఈ కామెంట్స్‌పై బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఇది ప్రభుత్వ అధికారిక అభిప్రాయం కాదని తేల్చి చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. ఫజ్లుర్ రహ్మాన్ గతంలో బంగ్లాదేశ్ రైఫిల్స్ విభాగానికి నేతృత్వం వహించారు. 2009లో బంగ్లాదేశ్ రైఫిల్స్ ప్రధాన కార్యాలయంలో 74 మంది మృతికి కారణమైన పిల్ఖానా మారణహోమంపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.
ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనిస్ చైనా పర్యటన సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాల్లో చైనా తన ప్రాబల్యం పెంచుకోవాలంటూ పిలుపునివ్వడం వివాదాస్పదంగా మారింది. దీనిపై అప్పట్లో భారత్ ఘాటుగా స్పందించింది. ఉద్రిక్తతలు పెంచే వ్యాఖ్యలను మానుకోవాలని ప్రధాని మోదీ స్వయంగా బంగ్లాదేశ్‌కు సూచించారు. ఆ తరువాత భారతీయ పోర్టుల వినియోగించుకోకుండా కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్‌పై నిషేధం విధించింది.
షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తరువాత బంగ్లాదేశ్‌లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం అటు చైనా, ఇటు పాకిస్థాన్‌తో అంటకాగుతున్న విషయం తెలిసిందే.
ఇక పహల్గాం దాడి తరువాత భారత్ పాక్‌పై క్రమంగా ఒత్తిడి పెంచుతోంది. అంతర్జాతీయంగా దాయాది దేశాన్ని ఏకాకిని చేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా పాక్ దిగుమతులన్నిటిపైనా నిషేధం విధించింది.
ఇవి కూడా చదవండి:
భారత్, పాక్ సైన్యాల శక్తిసామర్థ్యాలు ఇవీ..
ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.. భారత్, పాక్‌లకు అమెరికా పిలుపు
పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఓ మాజీ పాక్ పారా కమాండో!
మరిన్ని ఉగ్రదాడులకు ఛాన్స్.. కశ్మీర్‌లో పలు పర్యాటక స్థలాల మూసివేత
Read More Latest Telugu News and International News
Updated Date - May 03 , 2025 | 01:54 PM