Pahalgam Terror Attack: ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.. భారత్, పాక్‌లకు అమెరికా పిలుపు
ABN , Publish Date - May 01 , 2025 | 07:34 AM
భారత విదేశాంగ మంత్రి, పాక్ ప్రధానిలకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఫోన్ చేశారు. ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నించాలని భారత్, పాక్ దేశాలకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో సూచించారు. ఈ మేరకు ఆయన భారత విదేశాంగ మంత్రి జయ్‌శంకర్‌కు, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌కు బుధవారం ఫోన్ చేశారు.
మంత్రి జయ్‌శంకర్‌తో ఫోన్ కాల్ సందర్భంగా మార్కో రూబియో.. పహల్గాం దాడిపై సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై ప్రపంచస్థాయిలో జరుగుతున్న పోరులో అమెరికా భారత్‌కు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దక్షిణాసియాలో శాంతి నెలకొల్పేందుకు చర్చ ద్వారా ప్రయత్నించాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చారు.
మంత్రి మార్కోతో ఫోన్ కాల్‌పై పాక్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దక్షిణాసియాలో పరిణామాలపై తమ దృక్కోణాన్ని వెల్లడించినట్టు తెలిపింది. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే విధంగా తమను భారత్ రెచ్చగొడుతోందని పాక్ ప్రధాని వివరించారు. భారత్ చర్యలు తమను ఉగ్రవాద చర్యల కట్టడి నుంచి దృష్టి మళ్లిస్తాయని అన్నారు. పహల్గాం దాడికి పాక్‌కు సంబంధం ఉందన్న భారత ఆరోపణలను ప్రధాని షహబాస్ తోసిపుచ్చారు. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. రెచ్చగొట్టే వ్యా్ఖ్యలను చేయకుండా భారత్‌ను అమెరికా కోరాలని కూడా విజ్ఞప్తి చేశారు.
పాక్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేస్తున్నట్టు భారత్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు నోటామ్ విడుదల చేసింది. ఏప్రిల్ 30 నుంచి పాక్ కమర్షియల్ విమానాలతో పాటు మిలిటరీ విమానాలకు భారత్ గగనతలంలో అనుమతి లేదని పేర్కొంది. మే 23 వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. అయితే, భారత్ ప్రతిదాడి చేయొచ్చన్న భయంతో ఇప్పటికే పాక్ విమానాలు భారత గగనతలంలోకి రావట్లేదు.
పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ ఇప్పటికే పాక్‌పై భారత్ పలు కఠిన చర్యలకు దిగింది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు అట్టారీ వాఘా సరిహద్దును కూడా మూసేసింది. భారత్‌లో ఉంటున్న పాకిస్థానీలందరినీ తప్పిపంపించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక పాక్ కూడా తమ గగనతలంలో భారత విమానాలకు అనుమతిని నిరాకరించడంతో పాటు షిమ్లా ఒప్పందాన్ని కూడా నిలుపుదల చేసింది.
ఇవి కూడా చదవండి:
పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఓ మాజీ పాక్ పారా కమాండో!
మరిన్ని ఉగ్రదాడులకు ఛాన్స్.. కశ్మీర్‌లో పలు పర్యాటక స్థలాల మూసివేత
మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Read More Latest Telugu News and International News