Jet Crashes: పాఠశాలపై కూలిన విమానం.. 19 మంది మృతి
ABN, Publish Date - Jul 21 , 2025 | 02:36 PM
బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానం ఓ పాఠశాలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భారీఎత్తున ప్రాణనష్టం జరిగింది.
ఢాకా, జులై 21: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానం ఎఫ్-7BGI ఎయిర్ క్రాఫ్ట్ ఓ పాఠశాల, కళాశాల భవనంపై ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మెుత్తం 19 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల్లో 16మంది విద్యార్థులు ఉండగా.. ఇద్దరు టీచర్లు, పైలట్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, విమానం కూలిపోవడంతో భారీ పేలుడు సంభవించింది. పెద్దఎత్తున మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ శిక్షణ విమానం.. మైల్ స్టోన్ పాఠశాల, కళాశాల భవనంపై కూలింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ పాఠశాల, కళాశాల భవనాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. కాగా, ప్రమాదానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ల్యాండ్ పూలింగ్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 21 , 2025 | 05:53 PM