Khawaja Asif Statement: అఫ్ఘానిస్థానీలు మా దేశాన్ని విడిచి వెళ్లాల్సిందే: పాక్ రక్షణ శాఖ మంత్రి
ABN, Publish Date - Oct 18 , 2025 | 02:37 PM
అఫ్ఘానిస్థాన్‌తో ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో ఉంటున్న అఫ్ఘానిస్థానీలు అందరూ దేశాన్ని వీడాల్సిందేనని స్పష్టం చేశారు. ఆత్మగౌరవం ఉన్న వారు ఇతర దేశాలు భూభాగాలు, వనరులపై ఆధారపడరని అన్నారు.
ఇంటర్నె్ట్ డెస్క్: అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో ఉంటున్న అఫ్ఘానిస్థానీలు వెంటనే దేశాన్ని వీడాలని తేల్చి చెప్పారు. పాక్ భూభాగం, ఇక్కడి వనరులు 250 మిలియన్‌ల మంది పాక్ పౌరులకేనని స్పష్టం చేశారు. ఆత్మగౌరవం ఉన్న ఏ దేశం విదేశీ భూమి, వనరులపై ఆధారపడదని అన్నారు. అఫ్ఘానిస్థానీల కోసం కాబుల్‌లో ఇస్లామిక్ ప్రభుత్వం ఒకటి ఉందని వ్యాఖ్యానించారు (Pak Minister Khawaja Asif on Afghanistanis).
తమ పాలనను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)కి చెక్ పెట్టేందుకు పాక్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. టీటీపీని తాలిబాన్ ప్రోత్సహింస్తోందని కూడా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే పాక్ తొలుత కాబుల్‌లోని టీటీపీ వర్గాలపై దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. తాజాగా 48 గంటల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకారానికి వచ్చినా పాక్ మళ్లీ దాడులకు తెగబడింది. అఫ్ఘానిస్థాన్‌లోని పట్కాయ్ ప్రావిన్స్‌లో నిన్న జరిగిన దాడిలో ముగ్గురు క్రికెటర్లు మృతి చెందడంతో పరిస్థితి మరింత దిగజారింది. పాక్‌తో జరగాల్సిన టీ20 క్రికెట్ టోర్నీ నుంచి అఫ్ఘానిస్థాన్ వైదొలగింది.
ఈ నేపథ్యంలో భారత్‌పై కూడా పాక్ ఆరోపణలు గుప్పించింది. అప్ఘానిస్థాన్‌ను భారత్ ఉసిగొల్పుతోందని అవాకులు చవాకులు పేలింది. అటు భారత్, ఇటు అప్ఘానిస్థాన్‌తో తాము తలపడాల్సి వస్తోందని చెప్పుకొచ్చింది. కాబూల్ పాలకులు భారత్ పంచన చేరి పాక్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని పాక్ విదేశాంగ మంత్రి నఖ్వీ ఆరోపించారు.
ఇక పాక్ ఆరోపణలను అప్ఘానిస్థాన్ తిప్పికొట్టింది. తమ భూభాగంలో ఏ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు స్థానం లేదని స్పష్టం చేసింది. పొరుగు దేశాలన్నిటితో తాము సత్సంబంధాలను మాత్రమే కోరుకుంటున్నామని తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి ముత్తకీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
భారతీయులకు ట్రంప్ షాక్..ఆ గ్రీన్ కార్డ్ లాటరీలో నోఛాన్స్
పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపిస్తున్న టీటీపీ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 18 , 2025 | 03:34 PM