New Dam Construction: పాక్‌కు అఫ్గాన్ జలాలు కట్
ABN, Publish Date - Oct 25 , 2025 | 04:42 AM
దాయాది పాకిస్థాన్‌తో సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న భారత్ బాటలోనే అఫ్గానిస్థాన్ కూడా నడుస్తోంది.
కునార్ నదిపై డ్యామ్ నిర్మాణానికి అఫ్గాన్ నిర్ణయం
న్యూఢిల్లీ, అక్టోబరు 24: దాయాది పాకిస్థాన్‌తో సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న భారత్ బాటలోనే అఫ్గానిస్థాన్ కూడా నడుస్తోంది. యుద్ధం నేపథ్యంలో సరిహద్దుల గుండా ప్రవేశించే కునార్ నదీ జలాలు పాక్ భూభాగంలోకి ప్రవేశించకుండా కట్టడి చేయాలని అఫ్ఘాన్ నిర్ణయం తీసుకుంది. దీనికోసం కునార్ నదిపై అతి త్వరలోనే డ్యామ్‌ను నిర్మిస్తామని తాలిబన్ సుప్రీం లీడరు మౌలావీ హిబాతుల్లా అఖుంద్‌జాదా ప్రకటించారు. డ్యామ్ నిర్మాణం విషయంలో అఫ్గాన్ పాలకులు పట్టుదలగా ఉన్నారని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఆ దేశ జర్నలిస్టు సమీ యూస్‌ఫజయ్ తెలిపారు. విదేశీ నిర్మాణ సంస్థల కోసం వేచి చూడకుండా దేశీయ కంపెనీలకే కాంట్రాక్టు ఇచ్చి కునార్ నది వద్ద పనులు వెంటనే మొదలుపెట్టాలని జల వనరులు, ఇంధన మంత్రిత్వశాఖను సుప్రీం లీడరు ఆదేశించారని పేర్కొన్నారు. ఈశాన్య అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్ పర్వతాల్లో జన్మించిన కునార్ నది 480 కిలోమీటర్లు ప్రవహించి బ్రోఘిల్ పాస్ వద్ద పాక్ భూభాగంలోకి ప్రవేశిస్తుంది. చిత్రాల్‌గా పాక్‌లో పిలిచే ఈ నది ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రాంత సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తోందని సమీ యూస్‌ఫజయ్ ‘ఎక్స్’లో తెలిపారు. కాగా, యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ల మధ్య సరిహద్దులు మూసుకుపోయాయి. రెండు దేశాల్లోనూ నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. పాక్‌లో ఎక్కువగా వినియోగించే టమాటా కేజీ రూ.187 పలుకుతోంది. సరుకులతో నిండిన దాదాపు 5000 కంటైనర్లు సరిహద్దుకు అటూఇటూ నిలిచిపోయాయి.
Updated Date - Oct 25 , 2025 | 04:42 AM