Afghan Minister Ind Visit: త్వరలో అప్ఘానిస్థాన్ విదేశాంగ మంత్రి భారత పర్యటన
ABN, Publish Date - Oct 02 , 2025 | 09:21 PM
అప్ఘానిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితి ఆంక్షల నడుమ ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇంటర్నెట్ డెస్క్: అప్ఘానిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి అమిర్ ఖాన్ ముత్తఖీ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారమే ఆయన భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. 2021లో అప్ఘానిస్థాన్‌లో అధికారం చేపట్టిన తరువాత తాలిబన్ మంత్రి భారత్‌లో పర్యటనకు సిద్ధం కావడం ఇదే తొలిసారి.
తాలిబాన్‌లతో భారత్ పరిమితమైన దౌత్య సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా సంబంధాలు, మానవతా సాయం కోణంలో భారత్, తాలిబాన్‌లతో టచ్‌లో ఉంటోంది. ఉగ్రవాదం, మానవహక్కుల ఉల్లంఘనలపై తన గళం వినిపిస్తూనే ఉంది.
ముత్తకీపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విధించిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆయన పర్యటనలపై కూడా నిషేధం ఉంది. విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక మినహాయింపులు అవసరం. దీంతో, ఇతర దేశాలతో దౌత్యసంబంధాలను బలోపేతం చేసుకునేందుకు అప్ఘానిస్థాన్‌కు కష్టంగా మారింది. ఆగస్టులో ముత్తకీ పాకిస్థాన్ పర్యటన ఆంక్షల కారణంగా రద్దయిపోయింది. మినహాయింపు ఇచ్చేందుకు యూఎస్ అంగీకరించకపోవడంతో పర్యటన రద్దయిపోయింది.
తాలిబన్ ప్రభుత్వాన్ని ఇండియా సహా మెజారిటీ దేశాలు ఇప్పటికీ గుర్తించలేదు. అయితే, భారత్ మాత్రం మానవతాసాయం, భద్రతా కారణాల రీత్యా ప్రత్యామ్నాయ మార్గాల్లో తాలిబాన్‌లతో టచ్‌లో ఉంటోంది.
అష్రాఫ్ ఘాని ప్రభుత్వ హయాంలో భారత్ అప్ఘానిస్థాన్ పునర్ నిర్మాణానికి భారీగా పెట్టుబడులు పెట్టింది. తాలిబాన్‌లు అధికారంలోకి వచ్చాక భారత దౌత్యవేత్తలు, పౌరులను కేంద్రం వెనక్కు పిలిపించింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2022లో కాబుల్ టెక్నికల్ మిషన్‌ను ప్రారంభించింది. భారత చేపట్టే సహాయక కార్యక్రమాలు టెక్నికల్ మిషన్ ఆధ్వర్యంలో సాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఐరోపా గగనతలంలో ప్రయాణించని ఇజ్రాయెల్ ప్రధాని..అరెస్టు భయమే కారణమా..
చైనా కన్నెర్ర చేస్తే అమెరికాలో టాయిలెట్ పేపర్ కూడా ఉండదు: ఫైనాన్షియల్ ప్లానర్ కామెంట్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 02 , 2025 | 09:57 PM