India's Geopolitical Strategy: చైనా కన్నెర్ర చేస్తే అమెరికాలో టాయిలెట్ పేపర్ కూడా ఉండదు: ఫైనాన్షియల్ ప్లానర్ కామెంట్
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:28 PM
భౌగోళిక రాజకీయ పరంగా భారత్ ప్రస్తుతం క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటోందని ఓ ఫైనాన్సియల్ ప్లానర్ ఎక్స్ వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రీడలు భారత్ ముందున్న ప్రత్యామ్నాయాలు చాలా స్వల్పమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: భౌగోళిక రాజకీయ క్రీడలో దీటుగా తలపడేందుకు కావాల్సిన సాధనా సంపత్తి భారత్ వద్ద తక్కువగా ఉందని ఓ ఫైనాన్షియల్ ప్లానర్ తాజాగా కామెంట్ చేశారు. ప్రమాదకర స్థాయిలో భారత దేశ బలహీనతలు ఉన్నాయని అన్నారు. డి. మురళీధరన్ అనే ఫైనాన్సియల్ ప్లానర్ పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది (Indias Geopolitical vulnerabilities).
భారత్ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయన నిర్మొహమాటంగా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ‘చైనాపై ఆంక్షలను అమెరికా ఇప్పటికీ అమలు పరచలేదు. వాయిదా వేస్తూనే ఉంది. ఎవరో గతంలో అన్నట్టు చైనా ఉత్పత్తుల సరఫరా నిలిచిపోతే అమెరికాలో టాయిలెట్ పేపర్‌కు కూడా కొరత ఏర్పడుతుంది. అమెరికా చైనాపై బాగా ఆధారపడి ఉంది. అమెరికాతో వాణిజ్య బంధం తెగిపోయినా చైనా లెక్క చేయదు. చైనా స్వావలంబన సాధించింది. అమెరికా తమకు పూర్తి వ్యతిరేకంగా మారినా చైనా మనగలుగుతుంది (Russia China Self Reliance)’
‘విదేశాల్లో రష్యా ఆస్తులపై ఆంక్షలు కొనసాగుతున్నా, వాణిజ్యంపై నిషేధం ఉన్నా దేశం నిలదొక్కుకోవడమే కాకుండా ఎదుగుతోంది. మనం చైనాను నమ్మలేము. చైనా ఉత్పత్తులు నిలిచిపోతే భారత్ కూడా స్తంభించే ప్రమాదం ఉంది. మేడ్ ఇన్ ఇండియా వస్తువుల్లో కూడా చైనా విడిభాగాలు ఉంటున్నాయన్నది వాస్తవం. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపి వేసినా ఆయుద్ధ సంపత్తి కోసం ఆధారపడక తప్పదు. ఆపరేషన్ సింధూర్‌లో కీలక పాత్ర పోషించిన ఎస్ 400 వ్యవస్థ కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకున్నదే. మనకు నమ్మకమైన భాగస్వామి రష్యా మాత్రమే’
‘భౌగోళికంగా మనం క్లిష్టమైన స్థితిని ఎదుర్కుంటున్నాము. తయారీ రంగంలో స్వావలంబన సాధించడంలో విఫలమయ్యాము. ప్రపంచంలో ప్రతి దేశంతో కయ్యం వచ్చినా చైనా, రష్యాలు తట్టుకుని నిలబడ గలవు. ఈ ఆటలో మనకు పెద్దగా మార్గాలు లేవు. ఇతర దేశాలపై చాలా ఆధారపడ్డాము. మనం మరింత శక్తిమంతంగా మారాలి’ అని పోస్టు పెట్టారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతుండగా జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
భారత్‌పై సుంకాలు.. రష్యాపై తీవ్ర ప్రభావం: నాటో చీఫ్
ఐరోపా గగనతలంలో ప్రయాణించని ఇజ్రాయెల్ ప్రధాని..అరెస్టు భయమే కారణమా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి