Share News

Netanyahu Flight Route: ఐరోపా గగనతలంలో ప్రయాణించని ఇజ్రాయెల్ ప్రధాని..అరెస్టు భయమే కారణమా..

ABN , Publish Date - Sep 26 , 2025 | 10:18 AM

ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేయండో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూూ ఐరోపా దేశాలకు దూరంగా మధ్యధరా సముద్రం మీదుగా ప్రయాణించి అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన భిన్నమైన మార్గం ప్రయాణించినట్టు ఫ్లైట్ రాడార్ డాటా చెబుతోంది.

Netanyahu Flight Route: ఐరోపా గగనతలంలో ప్రయాణించని ఇజ్రాయెల్ ప్రధాని..అరెస్టు భయమే కారణమా..
Netanyahu unusual Flight Route

ఇంటర్నెట్ డెస్క్: యుద్ధ నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ ఇటీవల అమెరికాకు వెళ్లేందుకు ఎంచుకున్న మార్గంపై పెద్ద చర్చ జరుగుతోంది. తన పేరిట అరెస్టు వారెంట్ జారీ కావడంతో ఆయన అమెరికా వెళ్లేందుకు కొత్త మార్గం ఎంచుకున్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ ప్రధాని తన అధికారిక వింగ్స్ ఆఫ్ జయాన్ విమానంలో వెళ్లారు. అయితే, ఐరోపా దేశాల గగనతలం మీదుగా కాకుండా మధ్యధరాసముద్రం మీదుగా ప్రయాణించారు.

సాధారణంగా ఇజ్రాయలీ విమానాలు ఐరోపా దేశాల మీదుగా వెళతాయి. అమెరికాకు వెళ్లేందుకు ఇది సులువైన మార్గం. కానీ ఇజ్రాయెల్ ప్రధాని విమానం ఇందుకు భిన్నమైన మార్గంలో ప్రయాణించడం ఆసక్తి రేపుతోంది. కొత్త మార్గం కారణంగా ఇజ్రాయెల్ ప్రధాని విమానం అదనంగా 373 మైళ్లు ప్రయాణించాల్సి వచ్చిందని పరిశీలకులు చెబుతున్నారు (Netanyahu unusual flight route).

గాజాలో యుద్ధ నేరాల అభియోగాలు ఎదుర్కొంటున్న బెంజమిన్ నేతన్యాహూపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) గతేడాది నవంబర్‌లో అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అనవసర చిక్కులు వద్దన్న ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ ప్రధాని ఐరోపా దేశాల గగనతలం మీదుగా ప్రయాణించలేని విశ్లేషకులు చెబుతున్నారు.


ఐసీసీలో సభ్యత్వం ఉన్న పలు ఐరోపా దేశాలు ఇప్పటికే బెంజమిన్ నేతన్యాహూపై గుర్రుగా ఉన్నాయి. తమ దేశంలో కాలుపెడితే ఆయనను అదుపులోకి తీసుకుంటామని పలు దేశాలు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాయి. తన భూభాగంపైకి ఇజ్రాయెల్ ప్రధాని వస్తే కచ్చితంగా అరెస్టు చేస్తామని ఐర్‌ల్యాండ్ ప్రకటించింది. యుద్ధ నేరాలపై దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని స్పెయిన్ స్పష్టం చేసింది. అయితే, ఫ్రాన్స్ మాత్రం బెంజమిన్‌ను అదుపులోకి తీసుకోబోమంటూ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఇక ఇజ్రాయెల్ ప్రధాని అరెస్టు సాధ్యమేనా అని ఇటలీ సందేహం వ్యక్తం చేసింది (Netanyahu avoids Europe arrest route).

కొత్త ప్రయాణ మార్గం ఎంపికపై ఇజ్రాయెల్ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. అయితే, తమ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు ఇజ్రాయెల్ అనుమతి కోరిందని ఫ్రాన్స్ దౌత్య వేత్త ఒకరు తెలిపారు. తాము అనుమతులు ఇచ్చినా ఇజ్రాయెల్ బృందం మరోమార్గంలో వెళ్లిందని అన్నారు. ఇందుకు గల కారణాలు మాత్రం తమకు తెలియదని అన్నారు. ఇక ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ శుక్రవారం ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించనున్నారు. ఆ తరువాత వచ్చే వారం వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం అవుతారు.


ఇవి కూడా చదవండి:

కశ్మీర్ అంశం.. భారత్, పాక్‌ల ద్వైపాక్షిక వ్యవహారమే: శ్వేత సౌధం అధికారి

ట్రంప్ మళ్లీ షాకింగ్ ప్రకటన..భారత ఔషధ ఎగుమతులకు దెబ్బ..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 26 , 2025 | 11:14 AM