Share News

NATO Chief - India Sanctions: భారత్‌పై సుంకాలు.. రష్యాపై తీవ్ర ప్రభావం: నాటో చీఫ్

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:13 AM

భారత్‌పై ట్రంప్ విధించిన ఆంక్షలు రష్యాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని నాటో చీఫ్ మార్క్ రట్ అన్నారు. ఉక్రెయిన్‌పై ప్రణాళికల గురించి వివరించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారని తెలిపారు.

NATO Chief - India Sanctions: భారత్‌పై సుంకాలు.. రష్యాపై తీవ్ర ప్రభావం: నాటో చీఫ్
Modi Putin Ukraine request

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు రష్యాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని నాటో సెక్రెటరీ జనరల్ మార్ట్ రట్ తాజాగా వ్యాఖ్యానించారు. సుంకాల ఒత్తిడి ఎక్కువ కావడంతో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారని కూడా చెప్పారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహం ఏంటో వివరించాలని పుతిన్‌ను కోరినట్టు తెలిపారు. ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంలో రష్యా, భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది (Modi Putin Ukraine request).

వాణిజ్య లోటు పూడ్చుకునేందుకు ట్రంప్ తొలుత భారత వస్తువులపై 25 శాతం సుంకం విధించారు. రష్యా చమురు కొనుగోళ్లను కొనసాగిస్తున్న కారణంగా మరో 25 శాతం అదనపు సుంకాన్ని విధించారు. చైనాపై కూడా 50 శాతం నుంచి 100 శాతం వరకూ సుంకం విధించాలని ఇటీవల ట్రంప్ నాటో దేశాలను కోరారు. ఇప్పటికీ రష్యా చమురు కొనుగోలు చేస్తున్న కొన్ని నాటో దేశాలపై కూడా విమర్శలు గుప్పించారు. యుద్ధం ముగింపునకు 100 శాతం కట్టుబడి లేవని అన్నారు. దీని వల్ల రష్యాతో చర్చలు జరిపేందుకు ఐరోపా దేశాలకు శక్తి చాలటం లేదని అన్నారు. రష్యాపై చైనాకు చాలా పట్టు ఉందని, భారీ సుంకాలతో ఈ పట్టు సడలుతుందని చెప్పారు. అప్పుడే రష్యా దారికి వస్తుందని అన్నారు. నాటో దేశాలు అంగీకరిస్తే రష్యాపై భారీ స్థాయి ఆంక్షలకు తాను సిద్ధమేనని అన్నారు (U.S. tariffs India).


అమెరికా, భారత్ మధ్య వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఇటీవల అమెరికాలో పర్యటించారు. అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. ఇక తాజాగా ఫార్మా దిగుమతులపై ట్రంప్ 100 శాతం సుంకం విధించడం కలకలం రేపుతోంది. భారత ఫార్మా రంగంపై ప్రభావం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


ఇవి కూడా చదవండి:

ఐరోపా గగనతలంలో ప్రయాణించని ఇజ్రాయెల్ ప్రధాని..అరెస్టు భయమే కారణమా..

కశ్మీర్ అంశం.. భారత్, పాక్‌ల ద్వైపాక్షిక వ్యవహారమే: శ్వేత సౌధం అధికారి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 26 , 2025 | 11:26 AM