Protein Intake For Women: 40ల్లో ఉన్న మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది
ABN, Publish Date - May 19 , 2025 | 02:01 PM
పెరీమెనోపాజ్ దశల్లో ఉన్న మహిళలకు ప్రొటీన్ల అవసరం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వయసులో మహిళలు కేజీ శరీర బరువుకు 1.2 గ్రాముల ప్రొటీన్ చప్పున తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పురుషుల కంటే మహిళలకే ప్రొటీన్ ఎక్కువగా అవసరమా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మెనోపాజ్ మొదలయ్యే దశలో ప్రొటీన్‌ల అవసరం పెరుగుతుందని చెబుతున్నారు. వాస్తవానికి భారతీయ మహిళల్లో ప్రొటీన్ల లోపం ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. దాదాపు 80 శాతం మంది మహిళలు ప్రొటీన్ లోపంతో బాధపడుతున్నారట. పురుషుకంటే మహిళలు 13 శాతం తక్కువగా ప్రొటీన్లు తీసుకుంటున్నట్టు కూడా అధ్యయనాలు తేల్చాయి. ప్రొటీన్‌ల అవసరం గురించి అనేక అపోహల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు చెబుతున్నారు. జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేసే వారికే ప్రొటీన్లు అవసరమన్న అపోహతో కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు.
మెనోపాజ్ ప్రారంభానికి ముందు దశలను వైద్యులు పెరీమెనోపాజ్ అని పిలుస్తారు. ఈ సమయంలో మహిళల్లో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నాయి. కండరాలు బలహీనమవుతాయి. బరువు కూడా తగ్గిపోతారు. బ్లడ్ షుగర్ అదుపు తప్పుతుంది. ఇలాంటి సమయాల్లో మహిళకు పోషకాహారం ముఖ్యంగా ప్రొటీన్లు అధికంగా ఉన్న ఆహారం అవసరమని నిపుణులు చెబుతున్నారు. కేజీ బాడీ వెయిట్‌కు 1.2 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో, కండరాలు కరగడం తగ్గి, జీవక్రియలు మెరుగవుతాయని చెబుతున్నారు.
ఈ వయసులో మహిళలు కసరత్తులను నిర్లక్ష్యం చేయడం కూడా ఇబ్బందులకు దారి తీస్తుందని చెబుతున్నారు. శరీరానికి వ్యాయామం లేక త్వరగా కండరాలు కరిగిపోతాయి. జీవక్రియలు కూడా నెమ్మదిస్తాయి. కాబట్టి, మెనోపాజ్ ప్రారంభ దశల్లో ఎక్సర్‌సైజులు కొనసాగిస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. సప్లిమెంట్స్ ద్వారా ప్రొటీన్లు తీసుకోవడం కంటే సహజసిద్ధమైన ఆహారం ద్వారా వీటిని తీసుకోవడమే శ్రేయస్కరమని కూడా చెబుతున్నారు. దీని వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గుతుందని అంటున్నారు. ప్రొటీన్‌లతో పాటు కాల్షియం, విటమిన్ డీ, పీచు పదార్థం, ఒమెగా-3ఫ్యాటీ యాసిడ్స్ వంటివి తీసుకుంటే మెనోపాజ్ ప్రభావాలను చాలా వరకూ తగ్గించుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి:
చర్మంలో ఈ మార్పులు కనిపిస్తే ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉన్నట్టే..
కొందరు 4 గంటల నిద్రతో సరిపెట్టుకోగలరు.. ఇలా ఎందుకో గుర్తించిన శాస్త్రవేత్తలు
ఈ సింపుల్ టెక్నిక్‌తో నీళ్లల్లోని మైక్రో ప్లాస్టిక్స్‌ను సులువుగా తొలగించుకోవచ్చు
Updated Date - May 19 , 2025 | 02:10 PM