Beauty Tips : అరటి తొక్కతో మొహంపై రుద్దితే.. చర్మానికి మంచిదేనా?
ABN, Publish Date - Jan 07 , 2025 | 11:16 AM
అరటిపండు తొక్కతో మొహంపై రుద్ది మసాజ్ చేస్తే చర్మంపై ఉన్న ముడుతలు తొలిగిపోయి కాంతివంతంగా మారుతుందని అంటుంటారు. ముఖంపై ఉండే చర్మం బిగుతుగా మార్చి నిత్యయవ్వనంగా ఉంచేందుకు ఈ సహజ చిట్కా ఉపయోగపడుతుందని అమ్మాయిల నమ్మకం. ఇలా చేయడం మంచిదేనా? చర్మసంబంధ నిపుణులు ఏమంటున్నారు..
అరటిపండు తొక్కతో మొహంపై రుద్ది మసాజ్ చేస్తే చర్మంపై ఉన్న ముడుతలు తొలిగిపోయి కాంతివంతంగా మారుతుందని అంటుంటారు. ముఖంపై ఉండే చర్మం బిగుతుగా మార్చి నిత్యయవ్వనంగా ఉంచేందుకు ఈ సహజ చిట్కా ఉపయోగపడుతుందని అమ్మాయిల నమ్మకం. తమ చర్మ సౌందర్య రహస్యం ఇదే అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్లు తరచూ చెప్పడం కూడా వినే ఉంటారు. దీంతో వేలు ఖర్చు చేసి తరచూ బొటాక్స్ ట్రీట్‌మెంట్ తీసుకునే కంటే ఇది ఫాలో కావడం బెటరని భావిస్తుంటారు అమ్మాయిలు. అయితే, అరటిపండు తొక్కతో ఫేషియల్ నిజంగానే బొటాక్స్ ట్రీట్‌మెంట్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందా? ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో తోడ్పడుతుందా? ఇలా చేయడం మంచిదేనా? చర్మసంబంధ నిపుణులు అరటిపండు ఫేషియల్ గురించి ఏం చెబుతున్నారనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అరటితొక్క ఫేషియల్‌పై ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ అమ్ము బ్యూటీ బ్రాండ్ వ్యవస్థాపకురాలు ఆరీఫా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఇటీవలి వీడియో వైరల్ మారింది. ఆ క్లిప్‌లో, “మీకు బొటాక్స్ అవసరం లేదు. అరటిపండు తొక్క చాలు. అరటితొక్కతో మొహంపై రుద్ది 10 నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. మా అమ్మ ఇలాగే చేసేది. వారంపాటు క్రమం తప్పకుండా ఈ ఫేషియల్ చేస్తే ముఖంపై ఉన్న ముడుతలు, గీతలు తొలగించి చర్మాన్ని హైడ్రేట్ చేసి ప్రకాశవంతంగా మారుస్తుంది. హైపర్‌పిగ్మెంటేషన్ ఉన్న చోట అరటి తొక్కతో రుద్దుతూ ఉంటే బొటాక్స్ కంటే సమర్థంగా పనిచేస్తుందని “ చెప్తుంది. మరో ఇన్‌స్టా వీడియోలోనూ ఒక విదేశీయురాలు 'అరటిపండు తొక్క ఫేషియల్ బొటాక్స్ కంటే బెటర్' అంటూ ప్రచారం చేయడం చూడవచ్చు. ఈ టాపిక్‌పై ఇలాగే ఎంతో మంది సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
బొటాక్స్ అంటే..
బొటులీనియం టాక్సిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ముఖంపై ఉన్న కండరాలకు నరాలు సంకేతం ఇవ్వకుండా తాత్కాలికంగా నిరోధించవచ్చు. అందువల్ల ముఖంలో ముడుతలు, కళ్ల కింద వలయాలు తగ్గి చర్మం బిగుతుగా, కాంతివంతంగా మారుతుంది. దీని ప్రభావం 3-6 నెలల వరకూ మాత్రమే ఉంటుంది. ఏ భాగంలో తీసుకుంటున్నాం అన్నదాన్ని బట్టి ట్రీట్‌మెంట్ ధర రూ.5000-25000 మధ్య ఉంటుంది. ఈ విధానం సురక్షితమైనదేనని, నిపుణులైన వారి దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావని వైద్యులు సూచిస్తున్నారు.
అరటితొక్క ఫేషియల్ బొటాక్స్‌లా పనిచేస్తుందా..
అరటిపండు తొక్కలలో పాలీఫెనాల్స్, విటమిన్లు (A, B, C, E), యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి తేలికపాటి తాత్కాలిక చర్మ ప్రయోజనాలను అందిస్తాయే తప్ప బొటాక్స్‌లా ముడుతలు తగ్గించినట్లు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. లైకులు, షేర్ల కోసం ఫిల్టర్లు వాడి ఇన్‌ఫ్లుయెన్సర్లు రూపొందించిన వీడియోలు నమ్మవద్దని సూచిస్తున్నారు. రసాయనాలతో పండించిన అరటి పండు తొక్కలతో ఫేషియల్ చేసుకోవడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, వీటిని ముఖంపై రుద్దితే పురుగుల మందులు అవశేషాలు నేరుగా చర్మలోకి చికాకులు, అలర్జీలు, దీర్ఘకాలిక సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదముంది.
Updated Date - Jan 07 , 2025 | 11:16 AM