యోగర్ట్‌లో ప్రొటీన్ ఎంత..
ABN, Publish Date - May 04 , 2025 | 11:40 AM
అధిక క్యాలరీలు, ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వులు అవసరానికి మించి ఉన్నప్పుడు ఆ కొవ్వులు కాలేయంపై పేరుకుంటాయి. దీనివల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి.
యోగర్ట్‌లో ప్రొటీన్లు ఉంటాయనీ, మాంసాహారం తినని వాళ్ళు యోగర్ట్ తీసుకొంటే తగినన్ని ప్రొటీన్లు లభిస్తాయని నా స్నేహితురాలు చెప్పింది, నిజమేనా?
- వర్ష, హైదరాబాద్
యోగర్ట్ పేరుతో మార్కెట్లో దొరికేది మనం ఇళ్లల్లో తయారు చేసుకొనే పెరుగు ప్రత్యామ్నాయమే. గ్రీక్ యోగర్ట్ అనేది మామూలు పెరుగు నుంచి నీరు వడకట్టి తయారు చేస్తారు. దీనిలో సాధారణ పెరుగు కంటే ప్రొటీన్ కొద్దిగా అధికంగా ఉంటుంది. అంతేకానీ మార్కెట్లో లభించే అన్ని రకాల యోగర్ట్‌లలో ప్రొటీన్ అధికంగా ఏమీ ఉండదు. ముఖ్యంగా వివిధ రకాల ఫ్లేవర్ (రుచులు)లలో లభించే యోగర్ట్‌లలో తీపి కోసం చక్కర చేర్చడం వల్ల క్యాలరీలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచూ వాడడం మంచిది కాదు. శాకాహారులు యోగర్ట్ తీసుకోవాలంటే ఎటువంటి ఫ్లేవర్స్, తీపి పదార్థాలు లేని గ్రీక్ యోగర్ట్‌ను ఎంచుకోవచ్చు. కేవలం యోగర్ట్ మాత్రమే కాకుండా కొవ్వు తక్కువగా ఉండే పనీర్, వెన్న తీసిన పాలు, పెరుగు, సోయా పనీర్, సెనగలు, రాజ్మా, అలసందలు, సోయాచిక్కుడు లాంటి వివిధ రకాల గింజలను కూడా ఆహారంలో భాగం చేసుకొంటే సరిపోతుంది.
నాకు హార్ట్ బర్న్ సమస్య ఉంది. చాలా రోజులుగా మందులు వాడుతున్నాను. ఆహారం కూడా బాగా తగ్గించేశాను. అయినా ఉపశమనం లేదు. పరిష్కారం తెలియచేయండి.
- ప్రశాంతి కూచిభొట్ల, విజయనగరం
హార్ట్ బర్న్ అనేది ఎసిడిటీ సమస్యతో వస్తుంది. ఈ సమస్యకు పలు కారణాలు ఉన్నాయి. ఆహారం సమయానికి తీసుకోకపోవడం, మసాలాలు, కారాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, ఒకేసారి అధిక మొత్తంలో తినడం, తిన్న వెంటనే పడుకోవడం లాంటివి చేయడం వల్ల ఈ సమస్య తలెత్త వచ్చు. కదలిక లేని జీవన శైలీ ఓ కారణం. ఇంకా శరీరానికి పడని ఆహారాలు తరచూ తీసుకోవడం, ఈసోఫేగస్‌లో ఏదైనా సమస్యలు, ఒత్తిడి కూడా ఎసిడిటీ తగ్గకుండా అడ్డు పడతాయి. మందులు తీసుకున్నప్పుడు కొద్దిపాటి తేడా వచ్చినప్పటికీ అది దీర్ఘకాలిక పరిష్కారం కాదు. వైద్యుల సలహాతో మందులు వాడుతూనే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఈ సమస్యకు సత్వరమే పరిష్కారం ఉండదు. ముందుగా ఎటువంటి ఆహారం తింటే సమస్య వస్తోందో తెలుసుకొనేందుకు ఫుడ్ డైరీ రాసుకోవాలి. దానిని బట్టి ఇబ్బంది కలిగించే ఆహారానికి దూరం ఉండాలి. అలాగే మసాలాలు, నూనెల వినియోగం తగ్గించాలి. తిన్న తరువాత కనీసం పది నిమిషాలపాటు నెమ్మదిగా నడవడం, ఒత్తిడి తగ్గించుకునేందుకు మెడిటేషన్, యోగా, స్నేహితులతో గడపడం లాంటివి చేయాలి.
నాకు ఫ్యాటీ లివర్ సమస్యఉంది. ఆహార మార్పులతో ఈ సమస్యను ఎదుర్కోవచ్చా?
- షేక్ ఇర్ఫాన్, కడప
ఒకప్పుడు ఫ్యాటీలివర్ సమస్య మద్యం తీసుకునే వాళ్లలో అధికంగా కనిపించేది. ఈ మధ్య కాలంలో మద్యం తీసుకోని వారిలో కూడా ఉంటోంది. దీనిని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. అధిక క్యాలరీలు, ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వులు అవసరానికి మించి ఉన్నప్పుడు ఆ కొవ్వులు కాలేయంపై పేరుకుంటాయి. దీనివల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలా ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నప్పుడు మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, వివిధ రకాల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఫ్యాటీ లివర్ తగ్గాలంటే బరువు నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఊబకాయం లేదా అధిక బరువు ఉన్నవారు కనీసం ఐదు నుంచి పది శాతం బరువు తగ్గితే కూడా చాలా ఉపయోగం ఉంటుందని శాస్త్రీయ పరిశోధనలు తెలుపుతున్నాయి. ఆహారంలో పీచు పదార్థాలు అధికంగా తీసుకోవడం అన్నింటికంటే సులువైన పరిష్కారం. దీని కోసం ప్రతి పూటా ఆహారంలో కనీసం రెండు వందల గ్రాములు కూరగాయలు (ఉడికించి లేదా ఏదైనా నూనె తక్కువ వేసిన కూర రూపంలో లేదా సలాడ్ రూపంలో) తీసుకోవాలి. రోజూ తప్పనిసరిగా ఆకుకూరలు ఆహారంలో చేర్చుకోవాలి. తెల్ల అన్నానికి బదులు ముడిధాన్యాలు, పాలిష్ చెయ్యని చిరుధాన్యాలను తీసుకోవాలి. కొవ్వులు అధికంగా ఉండే ఫ్రైలు, స్నాక్స్ మానెయ్యడం మంచిది. ఇవన్నీ ఫ్యాటీ లివర్ తగ్గేందుకు ఉపయోగపడతాయి.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
Updated Date - May 04 , 2025 | 11:40 AM