ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వారంలో రొయ్యలు ఎన్నిసార్లు తినొచ్చు..

ABN, Publish Date - Jun 29 , 2025 | 11:36 AM

తక్కువ క్యాలరీలతో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాల్లో రొయ్యలు ఒకటి. వంద గ్రాముల రొయ్యల్లో క్యాలరీలు వంద కన్నా తక్కువే ఉంటాయి. పైగా ఇరవై గ్రాముల ప్రోటీన్‌ కూడా లభిస్తుంది.

రొయ్యల్లో పోషకాలు తెలపండి. వారంలో ఎన్నిసార్లు తినొచ్చు?

- సుభాషిణి, గుంటూరు

తక్కువ క్యాలరీలతో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాల్లో రొయ్యలు ఒకటి. వంద గ్రాముల రొయ్యల్లో క్యాలరీలు వంద కన్నా తక్కువే ఉంటాయి. పైగా ఇరవై గ్రాముల ప్రోటీన్‌ కూడా లభిస్తుంది. ముఖ్యంగా సముద్రపు రొయ్యల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, అయోడిన్‌, సెలీనియం, ఫాస్ఫరస్‌, జింక్‌, అస్స్టాజాన్టిన్‌ వంటి పోషకాలెన్నో ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్‌ గుండె, మెదడు, జీర్ణవ్యవస్థల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి. రొయ్యల్లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. రొయ్యల్లో కొలెస్ట్రాల్‌ కూడా అధికంగా ఉంటుంది.

కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు కొంతమందిలో రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ పరిస్థితి అందరికీ ఉండదు. అందువలన ఒకవేళ అధిక కొలెస్ట్రాల్‌ సమస్య ఉన్నవారైతే రొయ్యలు తరచూ తీసుకోకపోవడం మంచిది. రొయ్యల్లో సోడియం కూడా అధికంగానే ఉంటుంది కాబట్టి రక్తపోటు ఉన్న వారు మితంగా తీసుకోవాలి. ఏ సమస్య లేని వారైతే వారానికి రెండుసార్లు మించకుండా రొయ్యలు తీసుకోవచ్చు. తక్కువ నూనెతో వండి తీసుకొంటే తక్కువ క్యాలరీలతోనే అధిక పోషకాలు, ఆరోగ్యం పొందవచ్చు. కొంతమందికి రొయ్యల అలర్జీ ఉంటుంది. ఆ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి తగిన వైద్యం పొందాలి.

ఆకుకూరలన్నింటిలోనూ, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే వాటిలో పోషకాలు ఎక్కువని విన్నాను, నిజమేనా?

- సుమతి, హైదరాబాద్‌

ఏడాది పొడవునా, అందుబాటు ధరలకే లభించే ఆకుకూరలు మంచి పోషకాలందించే ఆహారం. ఆకుకూరలన్నింటిలో సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ’సి‘, నియాసిన్‌, విటమిన్‌ ’కె‘ లతో పాటు క్యాల్షియం, ఐరన్‌ లాంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఆకుకూరలు తినే అలవాటు అధిక రక్తపోటును తగ్గించేందుకు, నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది.

వీటిలో ఎక్కువగా ఉండే పీచుపదార్థాలు రక్తంలో కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరాయిడ్స్‌ను నియంత్రించేందుకు... జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, పెద్దప్రేగు క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం తదితర ఖనిజాలను కలిగి ఉండటం వల్ల ఆకుకూరలు ఎదిగే వయసులో ఉన్న పిల్లలకూ శారీరక శ్రమ చేసేవారికీ కూడా ప్రయోజనకరం. ఆకుకూరల్లోని ఐరన్‌, ఫోలేట్‌ మహిళల్లో, మరీ ముఖ్యంగా గర్భిణుల్లో రక్తహీనత నివారించడానికి, తగ్గించడానికి అత్యుత్తమంగా పనిచేస్తుంది. ముదురు ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు కొంచెం అధిక మొత్తంలో ఉంటాయి కానీ ఆకుకూరలేవైనా వివిధ రకాల్లో వివిధ మోతాదుల్లో పోషకాలుంటాయి. తాజాగా దొరికే వాటిని అవకాశాన్ని బట్టి ఎంచుకుంటే మంచిది.

ఎప్పుడైనా బయటకెళ్ళి రెస్టారెంట్లో తిన్నప్పుడు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా ఎంచుకోవాలి?

- మధుసూదన్‌, విశాఖపట్టణం

ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లు ఎవరికైనా చాలా మంచిది. ఎప్పుడైనా రెస్టారెంట్లలో లేదా బయటి ఆహారం తినేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రుచిని ఆస్వాదిస్తూనే ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు. బయటి ఆహారంలో కల్తీ పదార్థాలు, నిల్వ పదార్థాలు వాడే అవకాశం ఎక్కువ. అందుకే నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా పాటించే రెస్టారెంట్లలో మాత్రమే తినాలి. కృత్రిమ రంగులు వాడే పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది.

కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో వెళ్ళినప్పుడు ఆర్డర్‌ చేసిన పదార్థాలను అందరూ పంచుకున్నట్టయితే, అన్నింటి రుచి చూస్తూనే మితంగా తినవచ్చు. బఫెట్‌ భోజనం అయినట్లయితే మీకు నచ్చిన పదార్థాలు నాలుగైదు ఎంచుకొని వాటి వరకే తిని, తిరిగి ఇంట్లో అందుబాటులో ఉండే ఆహారాన్ని తినకుండా ఉంటే క్యాలరీలు కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇలా బయటి ఆహారం తినడం అనేది ప్రతీ వారాంతం కాకుండా... ఏవైనా ప్రత్యేకమైన సందర్భాలకు మాత్రమే పరిమితం చేసుకొంటే ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - Jun 29 , 2025 | 11:36 AM