ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gut Health: మీరేంటో మీ పొట్ట చెప్పేస్తుంది..

ABN, Publish Date - Jul 06 , 2025 | 11:15 AM

నీటి సరఫరాకు పైప్‌లైన్‌ కీలకం. పైపులు పాడైపోనంత కాలం జల ప్రవాహానికి ఢోకా లేదు. ఎప్పుడైతే దెబ్బతిన్నాయో అప్పటి నుంచీ సమస్యలు మొదలవుతాయి. మన ఉదరంలోని పేగులు కూడా పైపులైన్ల వంటివే!. ఏదిపడితే అది తినేస్తే కొంతకాలానికి అవి దెబ్బతింటాయి.

Gut Health

నీటి సరఫరాకు పైప్‌లైన్‌ కీలకం. పైపులు పాడైపోనంత కాలం జల ప్రవాహానికి ఢోకా లేదు. ఎప్పుడైతే దెబ్బతిన్నాయో అప్పటి నుంచీ సమస్యలు మొదలవుతాయి. మన ఉదరంలోని పేగులు కూడా పైపులైన్ల వంటివే!. ఏదిపడితే అది తినేస్తే కొంతకాలానికి అవి దెబ్బతింటాయి. లోపలున్న సున్నితమైన పొర గీరుకుపోయి.. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. నేటి ఆధునిక జీవనశైలిలో తింటున్న జంక్‌ఫుడ్‌, నిద్రలేమి, ఒత్తిడి, క్రమశిక్షణ లేకపోవడం వంటివన్నీ ఈ పేగుపూత జబ్బుకు కారణం అవుతున్నాయని చెబుతున్నారు వైద్యులు. ఇప్పుడొస్తున్న కొత్త కొత్త అనారోగ్య సమస్యల్లో ఇదొక పెద్ద సమస్యగా మారింది...

‘‘ఛీ ఛీ.. ఏంటమ్మా.. ఇందులో ఉప్పు లేదు, కారం లేదు, అసలు నాలుకకు రుచే తగలడం లేదు’’ అంటూ నూడుల్స్‌ బౌల్‌ను విసిరికొడుతుంది పదేళ్ల అమ్మాయి.

‘‘నువ్వు ఎన్నయినా చెప్పు.. మటన్‌కర్రీలో మసాలా, కారం దట్టించినప్పుడే.. ఆ ఘాటు నషాళానికి అంటుతుంది. ఆ మాత్రం ఉండాల్సిందే తప్పదు’’ అంటాడు భర్త.

‘‘ఏమో రా, ఏం చేయాలో అర్థం అవడం లేదు. ఈ రోజు మీటింగ్‌ ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియదు. మీటింగ్‌ మధ్యలో టాయ్‌లెట్‌కు వెళ్లవలసి వస్తే, నా పరిస్థితేంటి? అక్కడకు దగ్గర్లో టాయ్‌లెట్‌ లేదంటే, నా పని అయిపోయినట్టే!’’... ఐబీడీ సమస్యని ఎదుర్కొంటున్న ఒక ఉద్యోగి మనోవేదన ఇది.

భారతీయ కుటుంబాల్లోని వంట గదుల్లో బియ్యం, పప్పులు ఉంటాయో లేదో కానీ.. ఉప్పు, కారం, మసాలాలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. అవి లేకపోతే పొయ్యి వెలగదు.. వంట పూర్తవ్వదు. ఇవన్నీ జీర్ణాశయం, పేగుల్లోని సున్నితమైన పొరను దెబ్బతీసేవే! ఇప్పుడు లెక్కలేనన్ని ఈటరీలు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, బేకరీలు వచ్చేశాయి. వీటికి తోడు స్విగ్గీలు, జొమాటోలు ఉండనే ఉన్నాయి. అయితే పిజ్జాలు, బర్గర్లు, కేకులు లాంటి ఫాస్ట్‌ఫుడ్స్‌ను అరుదుగా ఆరగిస్తే ఫరవాలేదు. కానీ ఇష్టారాజ్యంగా తినడం వల్ల పొట్ట మీద భారం పడుతుంది. ఆహారం తినడానికి కూడా కచ్చితమైన సమయ వేళలు పాటించాలి. కానీ రాత్రివేళ ఉద్యోగాల వల్ల మన ఆహారవేళలు క్రమం తప్పుతున్నాయి. దాంతో తోచినప్పుడు, తోచింది వేసేసి తిప్పేసే గ్రైండర్ల మాదిరిగానే మన పొట్టల్లోకి కూడా తోచింది తోసేయడం మొదలుపెట్టేశాం. ఇలాంటి అస్తవ్యస్థ ఆహారపుటలవాట్లకు అలవాటు పడడం, జీర్ణప్రక్రియను, జీర్ణాశయాన్నీ కుదేలు చేసే ఆహారపదార్థాలు తీసుకోవడం పేగుపూతను ప్రభావితం చేస్తాయి. పేగుపూతకు జన్యుపరమైన కారణాలు కూడా లేకపోలేదు. అలాగే రోగనిరోధక వ్యవస్థ, శరీరం మీద తిరగబడే ఆటో ఇమ్యూన్‌ రుగ్మత కూడా పేగు పూతకు మరొక కారణం. ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అస్తవ్యస్థ ఆహారపుటలవాట్లు, జీవనశైలి ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.

పేగు పూత అంటే?

పేగుల్లో తీవ్రమైన వాపు... ఇన్‌ఫ్లమేటరీ బోవెల్‌ డిసీజ్‌ (ఐబీడీ) లేదా పేగు పూత. ఏ కారణం వల్ల మన పేగుల్లోని మంచి బ్యాక్టీరియా దెబ్బతిన్నా పేగు ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. దాంతో పేగు లోపలి రక్షణ పొర దెబ్బతిని పుండ్లు ఏర్పడి... కడుపు నొప్పి, విరేచనాలు, పొట్టలో అసౌకర్యం, మలంలో రక్తం లాంటి లక్షణాలు మొదలవుతాయి. అయితే ఈ లక్షణాలు అకస్మాత్తుగా తలెత్తడం, అత్యవసరంగా మలవిసర్జన చేయాల్సి రావడం వల్ల దైనందిన జీవితం దెబ్బతింటుంది. ఏ పని చేయాలన్నా, ఎక్కడకు వెళ్లాలన్నా ఈ సమస్య అడ్డుపడుతూ ఉంటుంది. దేశవ్యాప్తంగా 15 లక్షల మందినీ, హైదరాబాద్‌లో లక్షమందిలో 50 నుంచి 100 మందిని ఈ పేగుపూత సమస్య బాధిస్తోంది.

ఆహారమే ఔషధం

ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. ఈ సూత్రం పెద్ద పేగు పూతకు కూడా వర్తిస్తుంది. తీసుకునే ఆహారంతో పెరిగే పేగు పూత లక్షణాలకు ఆహారంతోనే అడ్డుకట్ట వేసే వీలుంది. అందుకోసం ఎలాంటి ఆహారం తినాలో, ఎలాంటి తిండిని దూరం పెట్టాలో తెలుసుకోవాలి. నిజానికి లక్షణాలను, తినే పదార్థాలనూ నిశితంగా గమనిస్తూ ఉంటే, వేటితో సమస్య పెరుగుతోందో, వేటితో సమస్య అదుపులోకి వస్తోందో .. ఎవరికి వారు తేలికగా కనిపెట్టగలుగుతారు. మరీ ముఖ్యంగా రుగ్మత తీవ్రత, లక్షణాలు, గతంలో జరిగిన సర్జరీలను దృష్టిలో పెట్టుకుని పేగు పూతను అదుపులో ఉంచే ఆహారం ఎంచుకోవాలి.

ఏం తినకూడదు?

పేగుపూత లక్షణాలతో బాధపడుతున్నవారు పచ్చి కూరగాయలు, పండ్లు, విత్తనాలు, పొట్టుతీయని ధాన్యం లాంటివి మానేయాలి. అలాగే పాలు, చీజ్‌, ఐస్‌క్రీమ్‌ వంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వీటితో పాటు కొవ్వులు ఎక్కువగా ఉండే వేపుడు పదార్థాలు, క్రీములు, నూనెలు, మసాలాలు తినకూడదు. వీటితో నొప్పి తిరగబెడుతూ ఉండడమే కాకుండా డయేరియా, ఛాతీ మంట లాంటి సమస్యలు పెరుగుతాయి. అలాగే కెఫీన్‌ కలిగి ఉన్న పానీయాలు, కార్బొనేటెడ్‌ శీతల పానీయాలతో కడుపుబ్బరం, కడుపులో శబ్దాలు పెరుగుతాయి. కొన్ని రకాల వృక్షాధారిత నూనెలు, మాంసం, మద్యం కూడా కడుపునొప్పిని పెంచుతాయి. కొలెస్ట్రాల్‌, జంతు కొవ్వులు, అత్యధిక ఫ్యాటీ ఆమ్లాలు కూడా సమస్యను తీవ్రతరం చేస్తాయి. కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉండాలి.

ఏవి తినాలి?

పీచు కలిగి ఉండే కూరగాయలు, విటమిన్‌ డి, సి, మెగ్నీషియం కలిగి ఉండే పదార్థాలు తీసుకోవాలి. సరిపడా నీళ్లు తాగాలి.

ఓ కన్నేసి ఉంచి...

ఆహార అలర్జీలు ఉన్నవాళ్లు ఎంతగా అప్రమత్తంగా ఉంటారో మనందరికీ తెలిసిందే! కొందరికి నట్స్‌ పడకపోవచ్చు. ఇంకొందరికి పాలు పడకపోవచ్చు. ఇలాంటి అలర్జీలు ఉన్నవాళ్లు ఎలాగైతే లక్షణాల ఆధారంగా తమకు సరిపడని పదార్థాలను కనిపెట్టి, వాటికి దూరంగా ఉంటూ ఉంటారో, ఐబీడీ ఉన్నవారు కూడా లక్షణాల ఆధారంగా సరిపడని పదార్థాలను ఎవరికి వారు కనిపెట్టుకోవాలి. అందుకోసం ఫుడ్‌ డైరీ రాసుకోవాలి. ఎప్పుడు ఏం తిన్నా, వెంటనే డైరీలో రాసుకుంటూ ఉంటే, ఈ లక్షణాలను ప్రేరేపించే పదార్థాలేవో తెలుస్తాయి.

స్వల్ప పరిమాణాల్లో....

ఆహారం తేలికగా జీర్ణమై, జీర్ణాశయం మీద భారం పడకుండా ఉండడం కోసం మూడు పూటలా భారీ భోజనానికి బదులుగా స్వల్ప పరిమాణాల్లో, ప్రతి రెండు లేదా మూడు గంటలకోసారి ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఇందుకోసం తెలివిగా పోషకాలను విభజించుకోవాలి. అలాగే పిండిపదార్థాలు, మాంసకృత్తులు, పీచు, సూక్ష్మపోషకాలు... ఇలా పోషకాలన్నీ సమంగా అందేలా మీల్‌ ప్లాన్‌ను తయారుచేసుకోవాలి. ఇందుకోసం న్యూట్రిషనిస్ట్‌ సలహాలు, సూచనలు పాటించాలి.

మంచి బ్యాక్టీరియాను పెంచి...

సూక్ష్మక్రిములన్నీ వ్యాధులను కలిగిస్తాయనుకుంటే పొరపాటు. నిజానికి కోట్లకొద్దీ బ్యాక్టీరియాలు, ఫంగస్‌, వైరస్‌లు, చివరకు పరాన్నజీవులు సైతం మన శరీరంలో, పేగుల్లో నిక్షేపంగా నివసిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. వీటినే ‘గట్‌ మైక్రోబియం’ అంటారు. వీటి మధ్య సంతులనం నెలకొన్నంత కాలం మన ఆరోగ్యం కూడా క్షేమంగా ఉంటుంది. అది గాడి తప్పితే, పలు రకాల సమస్యలు వేధించడం మొదలుపెడతాయి. వాటిలో పేగు పూత ఒకటి. పేగు పూత సమస్య లేని వారితో పోలిస్తే, ఆ వ్యాధితో బాధపడే వారి పేగుల్లో భిన్నమైన మైక్రోబియం ఉన్నట్టు, నొప్పినీ వాపునూ తగ్గించే మైక్రోబియం తక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. ఇలా ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడే మంచి బ్యాక్టీరియా పేగుల్లో కొరవడడానికి ఎన్నో కారణాలున్నాయి. అవేంటంటే...

మందులు :

ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకూ మందుల షాపుల్లో యాంటీబయాటిక్స్‌ కొనేసి వాడేస్తూ ఉంటాం. అంతే కాదు. వైద్యులు ఒక సందర్భంలో సూచించిన యాంటీబయాటిక్స్‌ను, భవిష్యత్తులో అవసరాన్ని బట్టి వైద్యుల సలహా లేకుండా వాడేస్తూ ఉంటాం. ఈ అలవాట్లన్నీ పేగుల్లోని మంచి బ్యాక్టీరియా మోతాదును తగ్గించేస్తాయి.

ఇన్‌ఫెక్షన్లు: వ్యాధి నిరోధకశక్తి లోపంతో తరచూ ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే వారిలో కూడా మంచి బ్యాక్టీరియా దెబ్బతింటుంది.

ధూమపానం: ఈ దురలవాటు పేగుల్లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను దెబ్బతీస్తుంది.

నొప్పి, వాపును తగ్గిస్తూ...

పేగు పూతను అదుపులో ఉంచాలన్నా, పేగు పూత బారిన పడకుండా ఉండాలన్నా పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించుకోవాలి. అందుకోసం....

పీచు పదార్థాలు : పీచు పదార్థాలు తినడం వల్ల పేగుల్లో ఆమ్లం పెరుగుతుంది. దాంతో హానికారక బ్యాక్టీరియా పెరుగుదల తగ్గి, మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. తద్వారా ఇన్‌ఫ్లమేషన్‌ కూడా అదుపులోకొస్తుంది. కాబట్టి వెల్లుల్లి, ఉల్లి, అరటి పండ్లు, కూరగాయలు, బీన్స్‌, గోధుమలు, ఓట్స్‌, బార్లీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అయితే నోటి నుంచి పురీషనాళం వరకూ ఏ ప్రదేశంలోనైనా పూతకు కారణమయ్యే పేగు పూతకు సంబంధించిన క్రోన్స్‌ అనే మరొక రుగ్మత కలిగి ఉన్నవాళ్లకు ఇదే ఆహారంతో కడుపుబ్బరం వేధించవచ్చు. కాబట్టి అలాంటివాళ్లు తక్కువ పరిమాణాల్లో ఈ పదార్థాలను శరీరానికి అలవాటు చేయాలి. అలాగే సహజసిద్ధ ప్రోబయాటిక్స్‌ అయిన పెరుగు, కంబూచా, కిమ్చి లాంటివి తినాలి.

మంచి కొవ్వులు: వాల్‌నట్స్‌, పొద్దుతిరుగుడు గింజలు, టోఫు, సోయాబీన్‌లు తీసుకోవాలి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు సమకూరతాయి.

వీటికి దూరం: ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచే మాంసం, కృత్రిమ తీపి పదార్థాలు, చక్కెర, ప్రాసెస్‌ చేసిన పదార్థాలు తగ్గించాలి.

జీవనశైలి మార్పులతో...

జీవనశైలికీ జీర్ణవ్యవస్థకూ దగ్గరి సంబంధం ఉంటుంది. మానసికస్థితి, ఒత్తిడి, ఆందోళనలను అదుపులో ఉంచుకునే స్వభావాలు, ఆహార, జీవనశైలి పేగు పూతను ప్రభావితం చేస్తాయి. నిరంతరం ఆందోళనతో సతమతమవుతూ, చిన్నపాటి ఒత్తిళ్లకే కుంగిపోయే స్వభావం కలిగినవారిలో పేగు పూత తలెత్తే అవకాశాలు ఎక్కువ. అలాగే వ్యాయామం కూడా పేగు పూత నియంత్రణకు దోహదపడుతుంది. కాబట్టి....

ఒత్తిడి తగ్గించుకోవాలి: ధ్యానం, యోగా, ప్రాణాయామాలతో మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.

వ్యాయామం: నడక, ఈత, సైకిల్‌ తొక్కడం లాంటి తేలికపాటి వ్యాయామాలతో జీర్ణశక్తి మెరుగు పడుతుంది. అయితే ఈ వ్యాయామాలను క్రమం తప్పకుండా కొనసాగించాలి.

శరీరం మాట వినాలి: శరీరాన్ని విపరీతమైన ఒత్తిడికి లోను చేయకూడదు. ప్రత్యేకించి పేగు పూత లక్షణాలు వేధించే సమయంలో వ్యాయామం, తీసుకునే ఆహారం విషయంలో సున్నితంగా వ్యవహరించాలి.

విశ్రాంతి: పేగు పూతలో నిస్సత్తువ ప్రధాన లక్షణం. ఈ నిస్సత్తువ నుంచి కోలుకోవడం కోసం సరిపడా విశ్రాంతి తీసుకోవాలి.

నిద్ర : శరీరం పూర్తిగా కొత్త శక్తిని పుంజుకునేలా కంటి నిండా నిద్ర పోవాలి. అస్తవ్యస్థ నిద్రవేళలు ఇన్‌ఫ్లమేషన్‌నూ, పేగు పూతనూ పెంచుతాయి. కాబట్టి రోజుకు 7 నుంచి 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. ఇలా ఆహార పానీయాల్లో క్రమశిక్షణ, కంటినిండా నిద్ర, మానసిక ప్రశాంతతలతోనే మన ఉదరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

- గోగుమళ్ల కవిత

చికిత్స మీ చేతుల్లోనే..

పేగు పూత ఉన్నవాళ్లు వ్యాయామం చేయొచ్చు. అయితే పేగు పూత తీవ్రంగా ఉన్నప్పుడు విశ్రాంతిలో గడపడం అవసరం. లక్షణాలు అదుపులో ఉన్నప్పుడు తేలికపాటి వ్యాయామాలు చేయొచ్చు. నడక, ఈత, యోగాల వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ అదుపులోకొచ్చి జీర్ణశక్తి మెరుగు పడుతుంది. వ్యాయామంతో నిద్ర, భావోద్వేగాలు, మెరుగుపడతాయి. దాంతో వ్యాధినిరోధకశక్తి కూడా పెరిగి, పేగు పూత సమస్య అదుపులోకొస్తుంది. అయితే వ్యాయామం కోసం ఎక్కువ దూరాల పాటు పరిగెత్తడం, మోయలేనంత బరువులు ఎత్తే వెయిట్‌ ట్రైనింగ్‌ లాంటివి చేయవలసిన అవసరం లేదు. రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామాలు చేయగలిగినా సత్ఫలితాలను సాధించవచ్చు. శరీరం చెప్తున్నది వింటూ, లక్షణాలను గమనించుకుంటూ శరీరాన్ని ఒత్తిడికి గురిచేయని వ్యాయామాలను ఎంచుకుంటే పేగు పూత ఉన్నప్పటికీ మెరుగైన జీవనాన్ని కొనసాగించగలుగుతాం.

అలాగే ఐబీడీతో ముడిపడి ఉండే మరొక సమస్య మానసిక కుంగుబాటు. ఎప్పుడు లక్షణాలు ముంచుకొస్తాయో తెలియక, నలుగురి ముందు నగుబాటుకు లోను కావలసిన పరిస్థితి తలెత్తుతుందేమోననే నిరంతర భయాందోళనలతో కొందరు బాధపడుతూ ఉంటారు. ఈ భయాలన్నీ దీర్షకాలంలో మానసిక కుంగుబాటుకు దారి తీస్తాయి. సాధారణమైన వ్యక్తులతో పోలిస్తే, ఐబీడీ కలిగిన ఉన్న వాళ్లు రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ ఆందోళనకు గురవుతూ ఉంటారని అధ్యయనాల్లో తేలింది. పేగు పూతను అదుపులో ఉంచుకోవడం కోసం ఇన్‌ఫ్లమేషన్‌తో పాటు భావోద్వేగాలను కూడా అదుపులో పెట్టుకోవాలి. అందుకోసం సపోర్ట్‌ గ్రూపులు, థెరపీలు, ధ్యానం లాంటి వాటిని ఆశ్రయించాలి. ఐబీడీ చికిత్స అన్నది చదరంగం క్రీడ ఆడటం లాంటిది. ఈ క్రీడలో పావులను కదపడానికి మించి తెలివైన వ్యూహాలతో నడుచుకోవాలి. ఎంచుకునే ప్రతి చికిత్స తర్వాతి ఎత్తును ప్రభావితం చేస్తుంది.

కాబట్టి పేగుల్లోని వాపు, మంట, నొప్పులను తగ్గించడం కోసం వైద్యులు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులతో చికిత్స మొదలుపెడతారు. ఒకవేళ ఈ చికిత్స సరిపోకపోతే, బలమైన ఇమ్యూన్‌సిస్టమ్‌ మాడ్యులేటర్స్‌ను ప్రవేశపెడతారు. పేగుపూత మధ్యస్తం నుంచి తీవ్రంగా ఉన్న రోగులకు కణస్థాయిలో ఇన్‌ఫ్లమేషన్‌ను చక్కదిద్దే చికిత్సను ఎంచుకుంటారు. కొన్ని సందర్భాల్లో సర్జరీ కూడా అవసరం పడొచ్చు. అలాగని పేగు పూత పోరాటంలో ఓడిపోయామని భావించవలసిన అవసరం లేదు. నిజానికి క్రీడను గాడిలో పెట్టడం కోసం వైద్యులు ఎంచుకునే మరొక తెలివైన ఎత్తుగడ ఇది. కాబట్టి పేగు పూత ప్రయాణం ప్రతి ఒక్కరికీ భిన్నంగా ఉంటుంది. ఒకరికి ఫలితాన్నిచ్చిన ఎత్తుగడ ఇంకొకరికి ఉపయోగపడకపోవచ్చు. కాబట్టి వైద్యులతో సహకరిస్తూ, ముందస్తు ప్రణాళికలతో పేగుపూతను ఎదుర్కోవడం కీలకం.

- డాక్టర్‌ కె.ఎస్‌.సోమశేఖర రావు

సీనియర్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ అండ్‌ హెపటాలజిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌, హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌.

Updated Date - Jul 06 , 2025 | 12:19 PM