Harmful Medications For Kidneys: ఈ ఔషధాలను పరిమితికి మించి వాడుతున్నారా.. కిడ్నీలు రిస్క్‌లో పడ్డట్టే
ABN, Publish Date - May 30 , 2025 | 08:00 AM
కొన్ని రకాల ఔషధాలను పరిమితికి మించి వాడితే కిడ్నీలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ మెడిసిన్స్ ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: శరీరంలోని మలినాలను తొలగించడంలో కిడ్నీలది ప్రధాన పాత్ర. అత్యంత సున్నితమైన ఈ అవయవం బలహీనమైతే భారీ అనారోగ్యాల పాలపడాల్సి వస్తుంది. కిడ్నీలు పాడవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని రకాల ఔషధాలను అతిగా వాడితే కూడా అనర్థం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నెఫ్రోటాక్సిన్స్ లాంటి ఔషధాలు స్వల్పంగా చేటు చేస్తే మరికొన్ని మాత్రం తీవ్రమైన నష్టం కలుగజేస్తాయని వైద్యులు చెబుతున్నారు. వ్యక్తుల ఆరోగ్య స్థితితో పాటు ఆయా మందులను ఎంత కాలంగా వాడుతున్నారనే దానిపై ఈ విషయం ఆధారపడి ఉంటుంది.
బ్రూఫెన్, నాప్రోక్సెన్, డైక్లోఫినాక్ వంటి నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్.. కిడ్నీలకు రక్త ప్రసరణను తగ్గించి అవి పాడయ్యే ముప్పును పెంచుతాయి. గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లలో ఇవి కిడ్నీ పని తీరును మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి, వీటిని వీలైనంత తక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
ఇక బీపీ నియంత్రణ కోసం వినియోగించే డైయూరెటిక్ ఔషధాలను కూడా మితిమీరి వాడితే అనర్థం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులకు ఈ ప్రమాదం మరింత ఎక్కువని చెబుతున్నారు. అయితే, పరిమితికి లోబడి ఈ ఔషధాలను తీసుకుంటున్నంత వరకూ నిశ్చితంగా ఉండొచ్చని కూడా వైద్యులు భరోసా ఇస్తున్నారు.
అసైక్లోవిర్, గాన్సీక్లోవిర్ వంటి యాంటి వైరల్ ఔషధాలు కిడ్నీల్లో క్రిస్టల్స్ కింద మారతాయి. ఫలితంగా కిడ్నీ పనితీరు దెబ్బతిని దీర్ఘకాలిక నష్టం కలిగే అవకాశాలు పెరుగుతాయి.
నోటి ద్వారా తీసుకునే సోడియం లాక్సేటివ్స్ కారణంగా కిడ్నీల్లో ఫాస్ఫేట్ క్రిస్టల్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఇది కిడ్నీ పనితీరును దెబ్బ తీస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లు ఈ ఔషధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. పోషకాహారం తీసుకోవడం, కంటి నిండా నిద్ర వంటి జీవనశైలి నియమాలతో కిడ్నీ డ్యామేజ్ ముప్పును చాలా వరకూ నిరోధించవచ్చు. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్‌తో అనారోగ్యాన్ని ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ఉప్పు, చక్కెరల వినియోగం తగ్గించడం ద్వారా బీపీ, షుగర్ లెవెల్స్‌పై పట్టుసాధించి కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
బాడీ బిల్డర్స్‌కు హార్ట్ ఎటాక్ ముప్పు ఐదు రెట్లు ఎక్కువ.. అధ్యయనంలో వెల్లడి
రాత్రిళ్లు 6 గంటల కంటే తక్కువ సేపు నిద్రపోతున్నారా.. ప్రమాదంలో పడ్డట్టే
Updated Date - May 30 , 2025 | 08:04 AM