Share News

Sleep Deprivation: రాత్రిళ్లు 6 గంటల కంటే తక్కువ సేపు నిద్రపోతున్నారా.. ప్రమాదంలో పడ్డట్టే

ABN , Publish Date - May 26 , 2025 | 08:29 AM

రాత్రిళ్లు 6 గంటల కంటే తక్కువ సేపు నిద్రపోయే వారికి హైబీపీ వచ్చి, గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్ట్రోక్ ప్రమాదం కూడా పెరుగుతుందని అంటున్నారు.

Sleep Deprivation: రాత్రిళ్లు 6 గంటల కంటే తక్కువ సేపు నిద్రపోతున్నారా.. ప్రమాదంలో పడ్డట్టే
sleep deprivation heart

ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక జీవనం ఎంత బిజీగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో, చాలా మంది రోజుకు కనీసం ఆరు గంటల పాటు కూడా కంటి నిండా నిద్ర పోవడం లేదు. ఇదంతా సర్వ సాధారణమని చాలా మంది పొరపాటు పడుతుంటారు. తక్కువ సేపు నిద్రపోతే కలిగే ప్రమాదాల గురించి పట్టించుకోరు. ఈ అలవాటు దీర్ఘ కాలంలో అనేక అనారోగ్యాలు తెచ్చి పెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి తక్కువ నిద్రతో వచ్చే ప్రమాదాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

నిద్ర సమయంలో శరీరం కోలుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. రోజంతా ఎదుర్కొన్న ఒత్తిడులు, గాయాల తాలూకు దుష్ప్రభావాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో గుండె కొట్టుకునే వేగం నెమ్మదించి, రక్తపోటు తగ్గి శరీరం కోలుకునేందుకు దోహదపడతాయి. కానీ నిద్ర సరిపోని సమయాల్లో ఈ ప్రక్రియలకు ఆటంకాలు ఏర్పడతాయి. దీంతో, గుండె పోటు, బీపీ, గుండె చలనంలో మార్పులు వంటి సమస్యలు వస్తాయి.


నిద్రలేమితో ప్రధాన సమస్య బీపీ పెరగడమేనని వైద్యులు చెబుతున్నారు. కంటి నిండా నిద్రతో ఒత్తిడి కారక హార్మోన్లపై నియంత్రణ పెరుగుతుంది. దీంతో, కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. నిద్ర తక్కువైతే మాత్రం శరీరం అలర్ట్ స్టేట్‌లోకి వెళ్లిపోతుంది. ఇది చివరకు బీపీ పెరిగేందుకు దారి తీస్తుంది. నిత్యం బీపీ ఎక్కువగా ఉంటే చివరకు గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రమాదాలు కలుగుతాయి.

తరచూ రాత్రిళ్లు ఆరు గంటల కంటే తక్కువగా నిద్ర పోయే వారిలో గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి కరోనరీ హార్ట్ డిసీజ్‌ వస్తుంది. చివరకు ఇది హార్ట్ ఎటాక్ ముప్పును పెంచుతుంది.


గుండె చలనంలో మార్పులను ఎరిథ్మియా అని అంటారు. నిద్ర తక్కువైన వ్యక్తులకు ఏట్రియల్ ఫిబ్రిల్లేషన్ అనే ఎరిథ్మియా వచ్చే ముప్పు పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది బ్లడ్ క్లాట్స్‌కు కారణమై, చివరకు స్ట్రోక్ కూడా దారి తీస్తుంది. గుండె జబ్బులు ఉన్న వారు తక్కువ సేపు నిద్రపోవడం మరింత ప్రమాదకరం.

కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సగటున 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలి. ఓ షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని దాని ప్రకారం, నిద్రకు కచ్చితంగా 7 నుంచి 9 గంటల సమయాన్ని కేటాయిస్తే ఆరోగ్యం ఎంతో బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

బాడీ బిల్డర్స్‌కు హార్ట్ ఎటాక్ ముప్పు ఐదు రెట్లు ఎక్కువ.. అధ్యయనంలో వెల్లడి

40 ఏళ్లు దాటిన పురుషులు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే

Read Latest and Health News

Updated Date - May 26 , 2025 | 08:34 AM