Share News

Bodybuilders Heart Attack Risk: బాడీ బిల్డర్స్‌కు హార్ట్ ఎటాక్ ముప్పు ఐదు రెట్లు ఎక్కువ.. అధ్యయనంలో వెల్లడి

ABN , Publish Date - May 23 , 2025 | 10:47 PM

బాడీ బిల్డింగ్ చేసే వారికి గుండె పోటు ముప్పు ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. 20 వేల మందిపై చేసిన ఈ అధ్యయనం తాలూకు వివరాలు యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Bodybuilders Heart Attack Risk: బాడీ బిల్డర్స్‌కు హార్ట్ ఎటాక్ ముప్పు ఐదు రెట్లు ఎక్కువ.. అధ్యయనంలో వెల్లడి
Bodybuilders Heart Attack Risk

బాడీ బిల్డర్స్ కష్టం అంతా ఇంతా కాదు. కఠోరమైన ఆహార నియమాలు, గంటలకు గంటలు జిమ్‌లో కసరత్తులు, మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొంటూ బాడీ బిల్డర్స్ జిమ్‌లో కండలు పెంచేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఈ తీరు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. బాడీ బిల్డర్‌లకు హార్ట్ ఎటాక్ ముప్పు సాధారణ ప్రజలతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ఈ అధ్యయనం తాలూకు వివరాలు ప్రచురితమయ్యాయి. మొత్తం 20,286 మంది ప్రొఫెషనల్ పురుష బాడీ బిల్డర్‌లను శాస్త్రవేత్తలు అధ్యయం చేశారు. 2005-20 మధ్య కాలంలో 121 మంది బాడీ బిల్డర్లు మరణించినట్టు గుర్తించారు. వీరి సగటు వయసు 45 ఏళ్లే అని తేల్చారు.


మృతుల పోస్టు మార్టం నివేదికల్లో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుండె పెద్దది కావడం, కరోనరీ ఆర్టరీ డిసీజ్, అనబాలిక్ డ్రగ్స్ దుర్వినియోగం వంటివి బయటపడ్డాయి. ఇవన్నీ గుండెలో మార్పులు తీసుకొచ్చినట్టు వైద్యులు అంచనాకు వచ్చారు. ఉత్తర అమెరికాలో అత్యధికంగా బాడీ బిల్డర్‌ల మరణాలు సంభవించాయి. ఆ తరువాతి స్థానంలో ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఓషియానా ఖండాలు ఉన్నాయి.

అసాధారణ రీతిలో కండలు పెంచాలన్న లక్ష్యంతో బాడీ బిల్డర్‌లు తీవ్ర మానసిక ఒత్తిడి కూడా అనుభవిస్తున్నట్టు అధ్యయనకారులు తేల్చారు. ఇది శరీరాకృతిలో మార్పులకు, మానసిక రుగ్మతలకు దారి తీస్తోందని పేర్కొన్నారు.


బాడీ బిల్డింగ్ చేసేవారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కండలు పెంచేందుకు చేసే విపరీత ప్రయత్నాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయన్న విషయం మర్చిపోకూడదని హెచ్చరించారు. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

40 ఏళ్లు దాటిన పురుషులు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే

స్మార్ట్ ఫోన్‌తో బీపీ చెక్ చేసుకునే అవకాశం ఉందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

Read Latest and Health News

Updated Date - May 24 , 2025 | 10:18 AM