Bihar Elections: మిత్రులే ప్రత్యర్థులు.. ఆసక్తి కలిగిస్తున్న చతుర్ముఖ పోటీ
ABN, Publish Date - Nov 10 , 2025 | 04:23 PM
ఈసారి పోలింగ్ జరుగుతున్న పలు నియోజకవర్గాల్లో కూటమి భాగస్వామ్య పార్టీల నేతలే ప్రత్యర్థులుగా తలపడుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. కొన్ని చోట్ల టిక్కెట్లు నిరాకరించడంతో రెబల్ అభ్యర్థులు సైతం పోటీలో ఉన్నారు.
కహల్‌గావ్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. కీలకమైన రెండో విడత పోలింగ్ మరి కొద్ది గంటల్లోనే (నవంబర్ 11) జరగనుండటంతో అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. తొలి విడత భారీగా పోలింగ్ నమోదు కావడంతో రెండో విడతపై అంచనాలు బలంగానే ఉన్నాయి. ఈసారి పోలింగ్ జరుగుతున్న పలు నియోజకవర్గాల్లో కూటమి భాగస్వామ్య పార్టీల నేతలే ప్రత్యర్థులుగా తలపడుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. కొన్ని చోట్ల టిక్కెట్లు నిరాకరించడంతో రెబల్ అభ్యర్థులు సైతం పోటీలో ఉన్నారు. అలాంటి నియోజకవర్గాల్లో భాగల్‌పూర్ జిల్లాలోని కహల్‌గావ్ (Kahalgaon) నియోజకవర్గం ఒకటి. ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొనడం ఆసక్తిగా మారింది.
కహల్‌గావ్‌లో జేడీయూ అభ్యర్థిగా సుభానంద్ ముఖేష్ పోటీలో ఉన్నారు. ఆయన దివంగత నేత, బిహార్ అసెంబ్లీ మాజీ స్పీకర్ సదానంద్ సింగ్ కుమారుడు. సదానంద్ సింగ్ కాంగ్రెస్ టిక్కెట్‌పై రికార్డు స్థాయిలో తొమ్మిది సార్లు ఇక్కడి నుంచి గెలిచారు. సుభానంద్ ముఖేష్ వృత్తిరీత్యా ఇంజనీర్ కాగా, ఆయన భార్య డాక్టర్. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేశారు. అయితే బీజేపీ అభ్యర్థి పవన్ కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. ఈ ఏడాది ఆయన జేడీయూలో చేరారు. సీట్ల షేరింగ్ ఒప్పందంలో భాగంగా ఈ నియోజకవర్గాన్ని జేడీయూకు బీజేపీ వదులుకుంది. దీంతో సుభానంద్ ముఖేష్‌కు జేడీయూ టిక్కెట్ ఇచ్చింది. నితీష్ కుమార్ కనుసన్నుల్లో తాను పెరిగాయని, తన తండ్రి వారసత్వం కూడా తనకు ఉందని, తన గెలుపు ఖాయమని సుభానంద్ ధీమా వ్యక్తం చేశారు.
కాగా, కహల్‌గావ్ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కుమార్ తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇండిపెండెట్ అభ్యర్థిగా ఆయన పోటీలో ఉన్నారు. మరోసారి తన గెలుపు తథ్యమని, గత ఐదేళ్లుగా తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆయన తెలిపారు. కహల్‌గావ్ సీటు విషయంలో బీజేపీ, జేడీయూ మధ్య అవగాహన కుదిరినప్పటికీ, విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ మాత్రం ఎలాంటి అవగాహనకు రాలేకపోయాయి. దీంతో స్నేహపూర్వక పోటీ పేరుతో రెండు పార్టీలు ఇక్కడ పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ తరఫున ప్రవీణ్ కుష్వాహ, ఆర్జేడీ నుంచి రజనీష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. రజనీష్ తండ్రి సంజయ్ యాదవ్ జార్ఖాండ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. తానే మహాగఠ్‌బంధన్ అభ్యర్థినని, ఓట్లు చీలే ప్రసక్తే లేదని రజనీష్ తెలిపారు. కుష్వాహ ర్యాలీలకు జనం ఉండటం లేదని, తన సభలకు భారీగా జనం వస్తున్నారని, దానిని బట్టే ఓట్లు చీలే అవకాశం లేదని చెప్పారు. అయితే తమ పార్టీ గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని కాంగ్రెస్ అభ్యర్థి కుష్వాహ తెలిపారు.
ఓటర్ల మనోగతం
కహల్‌గావ్‌లో రసవత్తమైన చతుర్ముఖ పోటీ నెలకొన్నప్పటికీ ఓటర్లు మాత్రం నిరుద్యోగితే ప్రధాన సమస్య అని, ఉపాధి అవకాశాల కల్పనకే తమ ఓటు అని చెబుతున్నారు. 'బిహార్‌లో విద్య నాసిరకమైన స్థితిలో ఉంది. విద్యాధికుడు మాత్రమే విద్యను అందించగలడు. ఫలానా వ్యక్తి అనో, పార్టీ అనో మేము చెప్పం. విద్య గురించి మాట్లాడే వాళ్లనే ఎన్నుకుంటాం' అని యువ ఓటరు ఒకరు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఆ రాష్ట్రంలోని ప్రతి స్కూల్లో ఇకపై వందేమాతరం పాడాల్సిందే.!
ఢిల్లీ సమీపంలో భారీగా ఆయుధాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 10 , 2025 | 05:14 PM