UP CM Yogi: ఆ రాష్ట్రంలోని ప్రతి స్కూల్లో ఇకపై వందేమాతరం పాడాల్సిందే.!
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:56 PM
ఇటీవల 150 వసంతాలు పూర్తి చేసుకున్న వందేమాతరం గేయాన్ని ఇకపై విధిగా ప్రతి స్కూల్లో పాడాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే దేశం పట్ల భక్తి, గౌరవం పెంపొందుతాయని యోగి సర్కార్ తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh)లో యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఇకమీదట వందేమాతరం(Vande Mataram) గేయాన్ని తప్పనిసరిగా ఆలపించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) సోమవారం తెలిపారు. ఈ మేరకు గోరఖ్‌పుర్‌లో 'ఏక్తా యాత్ర((Unity March)' పేరిట నిర్వహించిన సామూహిక వందేమాతరం కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇలా ప్రతీ పాఠశాలలో జాతీయ గేయాన్ని పాడటం ద్వారా.. పిల్లలకు చిన్ననాటి నుంచే దేశభక్తితో పాటు జాతీయ గేయంపై గౌరవభావం వంటివి అలవడతాయన్నారు.
కొత్త జిన్నాలకు తెరలేపకుండా..
వందేమాతరంను వ్యతిరేకించే వారు దేశ ఐక్యత, సమగ్రతను అవమానించినట్టేనని ఈ సందర్భంగా యోగి అన్నారు. దేశంలో నివసించే ప్రతి పౌరుడూ విధేయతగా, ఐక్యత కోసం పనిచేయాలని కాంక్షిస్తున్నట్టు ఆయన చెప్పారు. కులం, ప్రాంతం, భాషల పేరుతో సమాజాన్ని విభజించే వంటి అంశాలను గుర్తించి ఎప్పటికప్పుడు వాటిని వ్యతిరేకించాలని యోగి సూచించారు. ఇలాంటి విభజనలు కొత్త జిన్నాలను సృష్టించే కుట్రలో భాగమని అని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో నూతన జిన్నాలకు తెరలేపకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
భారత స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ఎందరికో స్ఫూర్తి రగిలించిన 'వందేమాతరం' గేయాన్ని 1875 నవంబర్ 7న బంకిం చంద్ర ఛటర్జీ రచించారు. ఇది తొలిసారిగా 'ఆనంద్‌మఠ్' నవలలో ప్రచురితమైంది. ఈ గేయానికి 2025 నవంబర్ 7 నాటికి 150 వసంతాలు పూర్తయ్యాయి. దీనిని ఏడాది పాటు దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించాలని ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పీఎం నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 'వందేమాతరం' అనే పదం ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం సహా.. నూతన భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందని మోదీ పేర్కొన్నారు.