ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అగ్నిశ్వాసలు

ABN, Publish Date - May 16 , 2025 | 06:01 AM

వేడి గాడ్పుల తీవ్రత పెరుగుతూ, దాని ప్రభావం ప్రధానంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కార్మికులపై అధికంగా పడుతోంది. శ్రమజీవుల ఆరోగ్యం, జీవనాధారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న వేడి విపత్తును అణచేందుకు సమగ్ర చర్యలు అవసరం.

నైరుతి ఋతుపవనాలు ముందుగానే వచ్చేస్తున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాగమనం ఆనందప్రదమే, గ్రీష్మతాపం నుంచి ఉపశమనం ఉల్లాసకరమే అయినా ప్రకృతి నుంచి ఎదురవుతున్న ఒక ఉపద్రవాన్ని ఉపేక్షించకూడదు. విషమిస్తున్న వేడిగాడ్పులే ఆ ముప్పు. నిజానికి ఈ ఏడాది ఋతుపవనాలే కాదు, వేసవి సైతం ముందుగానే ప్రవేశించింది. ఇది ప్రస్తుత సంవత్సరంలోనే కాదు, సుదీర్ఘకాలం ఏటా పునరావృతమయ్యే పరిణామమని వాతావరణ నిపుణులు చెప్పుతున్నారు. ‘న్యాయ ధర్మములు బీడులు కాగా/ ఎండాకాలం ఎగసి మండినది’ అని వాతావరణ మార్పు ప్రభావాలపై ప్రపంచం దృష్టిపెట్టని కాలంలోనే తెలుగు కవి ఒకరు ఆక్రోశిస్తే ఉగ్రమవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల డీఎన్‌ఏలో రసాయనిక మార్పులకు కారణమై అకాల వృద్ధాప్యానికి దారితీయవచ్చని అమెరికన్‌ శాస్త్రవేత్తలు ఇటీవల హెచ్చరించారు. కవి హృదయం, వైజ్ఞానిక మేధ మనిషి శ్రేయస్సుకు ఆరాటపడ్డాయి, సమస్త లోకులకు జీవనానందాన్ని ఆకాంక్షించాయి. మరి ప్రజల నుంచి అధికారాన్ని పొందిన పెద్ద మనుషులు ‘పగళ్లన్నీ పగిలిపోయీ, నిశీథాలూ విశీర్ణిల్లు’ తున్న వేసవిరోజుల్లో సామాన్యుల, శ్రామికుల ఆరోగ్యాలను, జీవనాధారాలను కాపాడేందుకు చిత్తశుద్ధితో శ్రద్ధ చూపుతున్నారా? పనిప్రదేశాల్లో తీవ్ర వేడిగాడ్పులకు గురవుతున్న వారిలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలవారు అత్యధిక శాతంలో ఉంటున్నట్టు పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాయకష్టంతో జీవనోపాధి పొందేవారు ప్రధానంగా ఈ సామాజిక వర్గాలవారే. వ్యవసాయం, నిర్మాణ రంగం జీవనాధారాలుగా ఉన్న ఈ సామాజికులు పని ప్రదేశాలలోనే కాకుండా అధ్వాన్న గృహవసతుల కారణంగా కూడా ‘ఉష్ణ అన్యాయం’ (థర్మల్‌ ఇన్జస్టిస్‌)కు గురవుతున్నారు. అనారోగ్యం బారిన పడి ఆదాయాన్ని, జీవన భద్రతను కోల్పోతున్నారు.


ప్రపంచ శ్రామిక జనావళి (240 కోట్లు)లో 70 శాతం మంది తీవ్ర వేడిగాడ్పుల మూలంగా ఆరోగ్య, ఆర్థిక సమస్యలకు లోనవుతున్నారని ఐక్యరాజ్యసమితి నిర్ధారించింది. వేడి గాడ్పుల వైపరీత్యాలలో జెండర్‌ కోణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. అమెరికా, భారత్‌, నైజీరియాలలోని కార్మిక జనాభాపై వేడిగాడ్పుల ప్రభావానికి సంబంధించి నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ దేశాలలో ఏటా రెండు లక్షల మందికి పైగా మహిళలు మరణిస్తున్నట్టు వెల్లడయింది. మన దేశంలో వడదెబ్బ మరణాల సంఖ్యను ప్రభుత్వం కచ్చితంగా నమోదు చేయడం లేదు. గత వేసవిలో 17 రాష్ట్రాలలో 733 మంది చండ్రగాడ్పుల మూలంగా చనిపోయినట్టు ‘హీట్‌ వాచ్‌’ నివేదిక పేర్కొనగా, ప్రభుత్వ గణాంకాలు అంతకంటే తక్కువగా ఉన్నాయి. తీవ్ర వేడిగాలుల ప్రభావం గర్భిణీ స్త్రీలపైన, నవజాత శిశువులపైన తీవ్రంగా ఉంటోంది. మన దేశంలో వేడిగాడ్పుల ప్రభావిత అనారోగ్యాలతో మరణించేవారి సంఖ్య 2050 సంవత్సరం నాటికి వేల సంఖ్యలో పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడిగాడ్పులతో అసంఘటిత రంగంలోని శ్రామిక జనావళి ఆరోగ్యం, జీవనాధారాలకు ఏర్పడుతున్న ముప్పు కారణంగా భారత్‌ స్థూల దేశియోత్పత్తికి 4.5 శాతం మేరకు నష్టం వాటిల్లవచ్చని గత ఏడాది రిజర్వ్‌బ్యాంక్‌ అంచనా వేసింది. పట్టణ నగర ప్రాంతాలలో ప్రాణాంతక వేడిగాడ్పుల నెదుర్కొనేందుకు పలు నగరాలలో హీట్‌ యాక్షన్‌ ప్లాన్‌లను అమలుపరుస్తున్నారు. అయితే అవి లోపభూయిష్టంగా ఉండడంతో అసంఘటిత రంగ కార్మికులు కనీస ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ శ్రమ జీవుల సంక్షేమమే లక్ష్యంగా వేడిగాడ్పుల ఉపశమన ప్రణాళికలను రూపొందించి అమలుపరచాలి. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం గ్రీన్‌ తమిళనాడు మిషన్‌ ద్వారా చేస్తున్న కృషి పథనిర్దేశకమైనదిగా చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడదెబ్బ మృతులకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంచడం అభినందనీయం.


కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ వేడిగాడ్పులను ఒక వ్యవస్థీకృత ముప్పుగా కాకుండా ఒక వార్షిక ఇబ్బందిగా మాత్రమే పరిగణిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఉగ్రవాదంతో జాతీయ భద్రతకు సంభవిస్తున్న ప్రమాదాన్ని అరికట్టేందుకు ఎట్టకేలకు ఒక నిర్ణయాత్మక విధానానికి అంకురార్పణ చేసిన విధంగానే జాతి జనుల ఆరోగ్యానికి, ఆర్థికాభివృద్ధికి ఆటంకమవుతోన్న ఉగ్ర ఉష్ణోగ్రతలను నిరోధించేందుకు జరూరుగా ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 06:02 AM