Indian Students Overseas: విదేశాల్లో 18 లక్షల పైచిలుకు మంది భారతీయ విద్యార్థులు.. విదేశాంగ శాఖ గణాంకాల్లో వెల్లడి
ABN, Publish Date - Dec 06 , 2025 | 03:42 PM
విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 18 లక్షల పైచిలుకని విదేశాంగ శాఖ తాజాగా పార్లమెంటుకు వెల్లడించింది. కెనడాలో భారతీయ విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉన్నట్టు పేర్కొంది. అయితే, విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునే వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే తగ్గింది.
ఇంటర్నెట్ డెస్క్: విదేశాల్లో ప్రస్తుతం 18 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకొంటున్నారని విదేశాంగ శాఖ గణాంకాల్లో తేలింది. మొత్తం 153 దేశాల్లో భారతీయ విద్యార్థులు ఉన్నట్టు కేంద్రం తాజాగా పార్లమెంటులో వెల్లడించింది (Indian Students Overseas-MEA Data).
విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం, మొత్తం 18,82,318 మంది విదేశాల్లో చదువుకుంటున్నారు. వీరిలో 12 లక్షల పైచిలుకు మంది యూనివర్సిటీలు, ఇతర ఉన్నత స్థాయి సంస్థల్లో ఉన్నారు. ఇక విదేశీ స్కూళ్లల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 6,28,305.
ఇక గతేడాది లెక్కల ప్రకారం, విదేశాల్లో పైచదువులు చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 13.3 లక్షలు. ఏడాది వీరి సంఖ్య తగ్గింది. అయితే, ఈసారి స్కూల్ విద్యార్థుల వివరాలను కూడా జోడించడంతో విదేశాల్లోని భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగినట్టు కనిపిస్తుంది.
స్కూలు విద్యతో పాటు పైచదువుల కోసం భారతీయులు అత్యధికంగా యూఏఈ(2,53,832 విద్యార్థులు), యూఎస్ఏ(2,55,447 మంది), కెనడాలకు (4,27,085 మంది) వెళ్లారు. 2022-24 మధ్య కాలంలో పైచదువుల కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. 2022లో విదేశీ యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య 7.5 లక్షలు కాగా, 2023లో 9.3 లక్షలకు చేరింది. 2024లో విద్యార్థుల సంఖ్య గరిష్ఠంగా 13.3 లక్షలకు చేరుకుంది. అయితే, ఈ ఏడాది మాత్రం విదేశీ యూనివర్సిటీల్లో కేవలం 12.54 లక్షల మంది ఉన్నారు.
ఇక దేశాల వారీగా చూస్తే ఈ ఏడాది కెనడా యూనివర్సిటీలు, ఇతర ఉన్నత సంస్థల్లో భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు. వీరి సంఖ్య ప్రస్తుతం 4,27,085. ఆ తరువాతి స్థానంలో ఉన్న యూఎస్‌ఏలో 2,55,247 మంది, యూకేలో 1,73,190మంది ఉన్నారు. ఆస్ట్రేలియా (1,38,579), జర్మనీ (49,483), జార్జియా (16,000), రష్యా(27,000)ల్లో కూడా భారతీయులు గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు.
గల్ఫ్ దేశాల్లో భారతీయ స్కూలు విద్యార్థులు అత్యధికంగా ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. యూఏఈలో 2,47,325 మంది, సౌదీలో 75,000 మంది, ఖతర్‌లో 47,846, కువైత్‌లో50,000 మంది ఒమాన్‌లో 44,547 మంది భారతీయ స్కూలు విద్యార్థులు ఉన్నారు.
ఇవీ చదవండి:
వివిధ దేశాల నుంచి భారతీయుల డిపోర్టేషన్.. వివరాలను వెల్లడించిన కేంద్రం
కూలిన అమెరికా ఎఫ్-16సీ ఫైటర్ జెట్.. పైలట్ సేఫ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 08 , 2025 | 02:43 PM